నెమ్మదిస్తున్న వ్యాప్తి

ABN , First Publish Date - 2022-01-24T06:30:18+05:30 IST

దేశంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో ఒక ఊరటనిచ్చే విషయం. గత నెల రోజుల వ్యవధిలో ‘ఆర్‌-వ్యాల్యూ’ ఇంచుమించు సగానికి సగం తగ్గి 2.9 నుంచి 1.57కి చేరిందనే విషయం సానుకూల సంకేతాలను పంపుతోంది....

నెమ్మదిస్తున్న వ్యాప్తి

ఆర్‌-వ్యాల్యూ తగ్గడంతో ఊరట

నెల రోజుల్లో 2.9 నుంచి 1.57కు తగ్గుముఖం

4 రోజుల్లో కేసులు 3.47 లక్షల నుంచి 3.33 లక్షలకు

ఫిబ్రవరి 6కల్లా పతాక స్థాయికి: ఐఐటీ మద్రాస్‌

కేసులను చూసి భయపడొద్దు: విద్యాసాగర్‌

 ఫిబ్రవరి 6కల్లా కొవిడ్‌ మూడోవేవ్‌ 

పతాక స్థాయికి : ఐఐటీ మద్రాస్‌


న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో ఒక ఊరటనిచ్చే విషయం. గత నెల రోజుల వ్యవధిలో ‘ఆర్‌-వ్యాల్యూ’ ఇంచుమించు సగానికి సగం తగ్గి 2.9 నుంచి 1.57కి చేరిందనే విషయం సానుకూల సంకేతాలను పంపుతోంది. ‘ఆర్‌-వ్యాల్యూ’ అంటే.. కొవిడ్‌ సోకిన ఒక వ్యక్తి నుంచి ఎంతమందికి ఇన్ఫెక్షన్‌ ప్రబలుతోందనే సమాచారాన్ని తెలిపే ప్రామాణికం. ఆర్‌-వ్యాల్యూ 1లోపు ఉంటే కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులో ఉన్నట్లుగా భావిస్తారు. ప్రస్తుతం ఇది 1కి చేరువలోనే(1.57గా) ఉంది. వాస్తవానికి ఆర్‌-వ్యాల్యూ తగ్గుదల అనేది డిసెంబరు చివరి వారంలోనే మొదలైంది. అప్పుడు 2.9గా ఉన్న ఆర్‌-వ్యాల్యూ క్రమంగా తగ్గుతూ జనవరి 7-13 తేదీల కల్లా 2.2కు చేరింది. జనవరి 14- 21తో ముగిసిన వారంలో అది మరింత తగ్గి 1.57కు చేరింది. అంటే.. ప్రస్తుతం కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి సగటున 1.57 (ఒకరి కంటే ఎక్కువ) మందికి ఇన్ఫెక్షన్‌ ప్రబలుతోందన్న మాట. మరోవైపు గత నాలుగు రోజులుగా దేశంలో కొవిడ్‌ కేసులు కొంతమేర తగ్గాయి. ఈ నెల 20న 3.47 లక్షల కొత్త కేసులు నిర్ధారణ కాగా, ఆదివారం 3.33 లక్షల కేసులు నమోదయ్యాయి. వచ్చే 6వ తేదీకి మూడోవేవ్‌ పతాక స్థాయికి చేరొచ్చని ఐఐటీ మద్రా్‌సకు చెందిన కంప్యూటేషనల్‌ మేథమెటిక్స్‌ విభాగం అంచనా వేస్తోంది. 


ముంబై, కోల్‌కతాల్లో ఎండెమిక్‌ దశకు.. 

ప్రస్తుతం ఆర్‌-వ్యాల్యూ ముంబై నగరంలో 0.67, కోల్‌కతాలో 0.56కు పరిమితమైంది. దీన్నిబట్టి అక్కడ కొవిడ్‌ పతాక స్థాయి ఇప్పటికే ముగిసి, ఎండెమిక్‌ దశకు చేరినట్లుగా భావించవచ్చని ఐఐటీ మద్రాస్‌ అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ నీలేశ్‌ ఎస్‌.ఉపాధ్యాయ్‌, ప్రొఫెసర్‌ ఎస్‌.సుందర్‌ పేర్కొన్నారు.


8 లక్షల కొత్త కేసులొచ్చినా..

‘‘రోజువారీగా భారీ సంఖ్యలో నమోదవుతున్న కొత్త కొవిడ్‌ కేసుల ఆధారంగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలను తీసుకోవద్దు. కొత్త కేసులు 2 లక్షలు, 6 లక్షలు, 8 లక్షలున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని జాతీయ కొవిడ్‌-19 సూపర్‌ మోడల్‌ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ ఎం.విద్యాసాగర్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ‘‘ఒకవేళ దేశంలో ఒక్కరోజులో 8 లక్షల కొత్త కేసులు నమోదైనా.. అందులో ఆస్పత్రుల్లో చేరుతున్నది 3.5 శాతం మందే. ఈ లెక్కన పాజిటివ్‌ వచ్చిన 8 లక్షల మందిలో 28వేల మందే ఆస్పత్రుల్లో చేరుతారు. ఆస్పత్రుల నుంచి కొవిడ్‌ రోగుల డిశ్చార్జి సమయం కూడా 10 రోజుల నుంచి 5 రోజులకు తగ్గింది. వరుసగా 5 రోజుల పాటు 8 లక్షలు చొప్పున కొత్త కేసులు నిర్ధారణ అయినా.. ఆ వ్యవధిలో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య మొత్తం 1.4 లక్షలకు మించదు. కరోనా రెండోవేవ్‌ నాటితో పోలిస్తే ఆస్పత్రులపై ఈ భారం తక్కువే’’ అని ఆయన వివరించారు. అయితే కొవిడ్‌ ఆస్పత్రుల్లోని పడకల్లో 25 నుంచి 50 శాతం మేర నిండిపోతే మాత్రం అందుకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకోవడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని సూచించారు. ‘‘కరోనా మొదటి వేవ్‌ 2020 మార్చిలో మొదలుకాగా, సెప్టెంబరు రెండోవారంలో కేసులు పతాకస్థాయికి చేరి.. ఆ తర్వాతి నుంచి మళ్లీ  తగ్గుదల చోటుచేసుకుంది. అదే కరోనా రెండో వేవ్‌ 2021 మార్చిలో మొదలవగా పతాక స్థాయికి చేరడానికి దాదాపు 10 వారాల సమయం పట్టింది. ఈసారి (మూడోవేవ్‌లో) కేసులు పతాక స్థాయికి చేరడానికి దాదాపు ఆరువారాల సమయం పట్టే అవకాశం ఉంది’’ అని ప్రొఫెసర్‌ ఎం.విద్యాసాగర్‌ తెలిపారు.


సామాజిక వ్యాప్తి దశలో ఒమైక్రాన్‌ 

  కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ప్రస్తుతం సామాజిక వ్యాప్తి దశలో ఉందని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ల కన్సార్టియం ‘ఇన్సాకాగ్‌’ ఆదివారం వెల్లడించింది. ఒమైక్రాన్‌లోని ఉపవర్గానికి చెందిన బీఏ.2 వేరియంట్‌ కేసులు దేశంలో గణనీయంగా ఉన్నాయని తెలిపింది. కేసుల్లో ఎక్కువ భాగం తేలికపాటి ఇన్ఫెక్షన్లవే ఉంటున్నాయని, ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగుల చేరికలు, ఐసీయూ కేసులు మూడోవేవ్‌లో పెరిగాయని పేర్కొంది. ఒమైక్రాన్‌లోని ఉపవర్గానికి చెందిన మరో వేరియంట్‌ ‘బీ.1.640.2’కు సంబంధించిన కేసులు ఇప్పటివరకు దేశంలో బయటపడలేదని తేల్చి చెప్పింది. కాగా, ఒమైక్రాన్‌లోని ఉపవర్గానికి చెందిన బీఏ.2 వేరియంట్‌నే ‘స్టెల్త్‌ ఒమైక్రాన్‌’ అని కూడా పిలుస్తున్నారు. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలకు కూడా ఇది చిక్కడం లేదని వైద్యరంగ నిపుణులు అంటున్నారు.

Updated Date - 2022-01-24T06:30:18+05:30 IST