పీడించేస్తోంది!

ABN , First Publish Date - 2021-04-22T06:29:54+05:30 IST

జిల్లాను కొవిడ్‌ పట్టి పీడించేస్తోంది. రోజురోజుకూ వైరస్‌ మహమ్మారి విజృంభణ పెరిగిపోతోంది. వందలాది పాజిటివ్‌లతో చుట్టుముట్టేస్తోంది. ఎక్కడికక్కడ అందరినీ కమ్మేస్తూ ప్రాణభయంతో వణికించేస్తోంది. వైరస్‌ తీవ్రత నేపథ్యంలో ఇప్పటికే చాలావరకు జనం జాగ్రత్తలు పాటిస్తున్నా కేసులు మాత్రం తగ్గడం లేదు.

పీడించేస్తోంది!

జిల్లాను పీడించేస్తున్న కొవిడ్‌ మహమ్మారి

  బుధవారం జిల్లా వ్యాప్తంగా 830 మందికి వైరస్‌

 1,31,619కి చేరిన మొత్తం పాజిటివ్‌లు.. యాక్టివ్‌ కేసులు 6,246

  కొవిడ్‌తో జిల్లాలో ఒకేరోజు నలుగురు మృతి.. 643కు చేరిన మరణాలు

 న్యాయశాఖలో కలకలం.. ఉన్నత న్యాయమూర్తిసహా పలువురికి కొవిడ్‌

  వైరస్‌ తీవ్రత నేపథ్యంలో ద్రాక్షారామ, వాడపల్లి వెంకన్న ఆలయాల మూత

  జిల్లాకు 35 వేల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు రాక.. సెకండ్‌ డోస్‌కే వినియోగం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) జిల్లాను కొవిడ్‌ పట్టి పీడించేస్తోంది. రోజురోజుకూ వైరస్‌ మహమ్మారి విజృంభణ పెరిగిపోతోంది. వందలాది పాజిటివ్‌లతో చుట్టుముట్టేస్తోంది. ఎక్కడికక్కడ అందరినీ కమ్మేస్తూ ప్రాణభయంతో వణికించేస్తోంది. వైరస్‌ తీవ్రత నేపథ్యంలో ఇప్పటికే చాలావరకు జనం జాగ్రత్తలు పాటిస్తున్నా కేసులు మాత్రం తగ్గడం లేదు. సరికదా ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయశాఖ, విద్యార్థులు, ఆలయాల్లో కేసుల తీవ్రత అధికంగా ఉంటోంది. దీంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే విధులకు రావడానికి సిబ్బంది వణికిపోతున్నారు. దేవాలయాలైతే మళ్లీ మూతపడుతున్నాయి. ఇప్పటికే సినిమా థియేటర్లు, పార్కులు, స్విమ్మింగ్‌పూల్స్‌ మూతపడగా, ఇప్పుడు దేవాలయాలు ఆ బాటలో నడుస్తున్నాయి. మరోపక్క జిల్లావ్యాప్తంగా బుధవారం 830 మందికి వైరస్‌ సోకింది. నలుగురు కొవిడ్‌తో కన్నుమూశారు. దీంతో ఎక్కడికక్కడ జనం మహమ్మారిని తల్చుకుని బెంబేలెత్తిపోతున్నారు. ము ఖ్యంగా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలలో కేసుల నమోదు అధికంగా ఉంటోంది. ఈ మూడు ప్రాంతాల్లో గడచిన వారంలో 3,500 వరకు పాజిటివ్‌లు నమోదయ్యాయి. అత్యధిక జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలు కావడంతో పాజిటివ్‌లు గుట్టలుగుట్టలుగా బయటపడుతున్నాయి. అయితే కేసుల తీవ్రతకు తగ్గట్టు టెస్ట్‌లు జరగకపోవడంతో వైరస్‌ వ్యాప్తి అధికమవుతోంది. ఒకపక్క కేసులు రోజూ వందల్లో ఉంటున్నా టెస్ట్‌ల సంఖ్య మాత్రం పెరగడం లేదు. దీంతో జనం పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కాగా బుధవారం నమోదైన పాజిటివ్‌లతో జిల్లాలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 1,31,619కు చేరుకున్నాయి. ఇన్ని కేసులు నమోదైన జిల్లా రాష్ట్రంలో ఇదొక్కటే. మరోపక్క రోజురోజుకు కొత్త కేసులు పెరుగుతుండడంతో యాక్టీవ్‌ కేసులు రయ్‌మంటూ పరుగులు తీస్తున్నాయి. బుధవారం రాత్రికి జిల్లావ్యాప్తంగా 6,246 మంది కొవిడ్‌ బాధితులు వివిధ చోట్ల వైద్యసేవలు పొందుతున్నారు. ఇందులో అరవై శాతానికిపైగా కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం డీహెచ్‌, అమలాపురం కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం కొవిడ్‌తో జిల్లాలో నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 646కు చేరుకుంది. కాగా న్యాయశాఖలో వైరస్‌ కలకలం రేపుతోంది. రాజమహేంద్రవరంలో ఉన్నత న్యాయమూర్తిసహా పలువురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మరోపక్క వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో దేవాలయాలు క్రమేపీ మూతపడుతున్నాయి. వాడపల్లి వెంకన్న, ద్రాక్షరామ, బిక్కవోలు లక్ష్మీగణపతి వంటి ఆలయాలు బుధవారం నుంచి మూతపడ్డాయి. ఇకపై భక్తులకు అనుమతించకూడదని అధికారులు నిర్ణయించారు. కేవలం రోజువారీ పూజలు మాత్రం జరగనున్నాయి. ఇదిలాఉంటే జిల్లాకు 35 వేల డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు బుధవారం చేరుకున్నాయి. వీటిని గురువారం నుంచి సెకండ్‌ డోస్‌ కింద ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌తోపాటు సాధారణ ప్రజలకు కూడా పంపిణీ చేయనున్నారు.

Updated Date - 2021-04-22T06:29:54+05:30 IST