కొవిడ్‌ కేసులు ఒక్కరోజే 363

ABN , First Publish Date - 2022-01-21T06:29:41+05:30 IST

జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.

కొవిడ్‌ కేసులు ఒక్కరోజే 363
ఐజీఎంసీ స్టేడియంలో కొవిడ్‌ పరీక్షలు చేయించుకుంటున్న నగర పౌరులు

 విజయవాడ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 363 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,23,758కి పెరిగాయి. 2,887 మంది బాధితులు ప్రస్తుతం కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం మరణాలు నమోదు కాలేదు. ఈ సంఖ్య అధికారికంగా 1,482 వద్ద ఉంది. జిల్లాలో వైరస్‌ బారినపడినవారిలో ఇప్పటి వరకు 1,19,419 మంది కోలుకున్నారు.


కొవిడ్‌ పరీక్షలకు దూరంగా బాధితులు 

జిల్లాలో గత ఏడాది వచ్చిన సెకండ్‌ వేవ్‌ కంటే థర్డ్‌వేవ్‌ ఉధృతి పది రెట్లు అధికంగా ఉంది. వైరస్‌ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉండడంతో ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి తదితర కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారు. వైరస్‌ బారినపడిన మొదటి రెండు మూడు రోజుల్లో జ్వరం తీవ్రంగా ఉంటోంది. తర్వాత జ్వరం తగ్గుముఖం పడుతున్న్పటికీ జలుబు, దగ్గు, గొంతులో గరగర, మంట ఉంటున్నాయని బాధితులు చెబుతున్నారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలకూ వైరస్‌ వ్యాపించేసింది. ఇన్‌ఫెక్షన్‌ స్థాయి తక్కువగా ఉండటంతో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య స్వల్పంగానే ఉంటోంది. జిల్లాలో ప్రస్తుతం థర్డ్‌వేవ్‌ విజృంభిస్తున్నా కరోనా మరణాలు నమోదు కాకపోవడం ఉపశమనం కల్గిస్తోంది. దీంతో పాజిటివ్‌ బాధితులు కూడా ఎక్కువ మంది కొవిడ్‌ పరీక్షలు చేయించుకోకుండానే హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కొంతమంది బాధితులు వైద్యుల సలహాలు తీసుకుని మందులు వాడుతుండగా, ఎక్కువ మంది నేరుగా మెడికల్‌ షాపులకు వెళ్లి మందులు తెచ్చుకుని వాడేస్తున్నారు. అయితే కొవిడ్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సొంత వైద్యం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. బాధితులు లక్షణాలను బట్టి వైద్యుల సలహా మేరకే చికిత్స తీసుకోవాలని, అందరూ కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం ద్వారానే కరోనా మహమ్మారిని నిలువరించడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. 


పాఠశాలల్లో అలజడి 

మచిలీపట్నం టౌన్‌ : పాఠశాలల్లో కొవిడ్‌ కలవరపెడుతోంది. జిల్లావ్యాప్తంగా పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారినపడ్డారు. మచిలీపట్నం సర్కిల్‌పేటలోని ఎయిడెడ్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడికి కరోనా సోకడంతో పాఠశాలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. పాతరామన్నపేట మున్సిపల్‌ యూపీ పాఠశాలలో టీచర్‌కు, గూడూరు మండలం మల్లవోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బందరు డివిజన్‌లోని కోసూరు, చేవేండ్ర, పెడన, నందిగం పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కరోనా సోకినట్టు డీవైఈవో సుబ్బారావుకు సమాచారం అందింది. పెడన పట్టణంలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.బి.సాల్మన్‌రాజుకు వైరస్‌ సోకడంతో కళాశాలకు గురువారం సెలవు ప్రకటించారు. 


విస్సన్నపేటలో ఓ ఉపాధ్యాయుడికి..

విస్సన్నపేట : చండ్రుపట్ల ఎంపీయూపీ పాఠశాలలో ఉపాధ్యాయుడికి గురువారం కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో శుక్రవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. పుట్రేలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు గురువారం పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు రావలసి ఉంది.


ఈదులగూడెం జడ్పీ పాఠశాలలో నలుగురికి..

ఆగిరిపల్లి : ఈదులగూడెం జడ్పీ పాఠశాలలో రైటర్‌కు, ఆయాకు, ఓ ఉపాధ్యాయుడికి, విద్యార్థికి కరోనా సోకింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కుటుంబసభ్యులకు పాజిటివ్‌ వచ్చినా, ఆయన అందరితో కలివిడిగా తిరిగినందునే వీరందరికీ సోకిందని సొసైటీ అధ్యక్షుడు ఈలప్రోలు సుబ్బయ్య విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. హీల్‌ పాఠశాలలో ఒకరికి కరోనా సోకింది. 


గన్నవరం, ముస్తాబాద హైస్కూళ్లలోనూ కేసులు

గన్నవరం : గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థికి, ముస్తాబాద జడ్పీ హైస్కూల్లో ముగ్గురు విద్యార్థులకు గురువారం కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 


వన్‌టౌన్‌లోని పాఠశాలల్లోనూ..

  వన్‌టౌన్‌ : విజయవాడ కొత్తపేటలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ హెచ్‌ఎం, విద్యాధరపురంలోని డీఎస్‌ఎం హైస్కూల్లో ముగ్గురు ఉపాధ్యాయులు కొవిడ్‌ బారినపడ్డారు. సితార సెంటర్‌లో ఉన్న జీఎన్‌ఆర్‌ హైస్కూల్లో ముగ్గురు విద్యార్థులకు లక్షణాలున్నాయని తెలిసింది.

Updated Date - 2022-01-21T06:29:41+05:30 IST