ఆగని వేగం

ABN , First Publish Date - 2020-06-05T11:11:10+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు పదుల సంఖ్యలో పాజిటివ్‌లు నమోదవుతూనే ఉన్నాయి.

ఆగని వేగం

జిల్లాలో గురువారం మరో 16 మందికి కొవిడ్‌ నిర్ధారణ

ఇందులో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నౌకలో ముగ్గురికి పాజిటివ్‌ 

గుజరాత్‌ టగ్‌లో నలుగురికి, ముంబై టగ్‌లో ఒకరికి వైరస్‌ గుర్తింపు

బొమ్మూరు క్వారంటైన్‌లో అయిదుగురికి కూడా

ఇందులో ముగ్గురు ఢిల్లీ నుంచి వచ్చిన ఓఎన్జీసీ ఉద్యోగులు

అటు రాజమహేంద్రవరం అర్బన్‌లో ఇద్దరికి, అయినవిల్లిలో మరొకరికి

జిల్లాలో మొత్తం 337కి చేరిన కేసులు..  హడలిపోతున్న ప్రజానీకం

చైనా నుంచి ఎట్టకేలకు కాకినాడ జీజీహెచ్‌కు అయిదు వెంటిలేటర్లు రాక


(కాకినాడ-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కొవిడ్‌ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు పదుల సంఖ్యలో పాజిటివ్‌లు నమోదవుతూనే ఉన్నాయి. ఏరోజు ఎక్కడి నుంచి కేసులు పుట్టుకు వస్తున్నాయనేది మాత్రం అంతుచిక్కడం లేదు. దీంతో క్వారంటైన్‌ కేంద్రాల నుంచి పల్లెల్లో గ్రామాల వరకు వైద్యులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. మొన్నటివరకు మామిడాడ కేసులు ఊపిరి సలపకుండా ఉక్కిరిబిక్కిరి చేయగా, ఇప్పుడు క్వారంటైన్‌ కేంద్రాలు, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న టగ్‌లు, విదేశీ నౌకల సిబ్బందికి వైరస్‌ విస్తరించింది. అందులోభాగంగా గురువారం జిల్లాలో మరో 16 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. ఇందులో ఎనిమిది మంది రెండు టగ్‌లు, ఒక నౌకలో వచ్చినవారే బాధితులు. బుధవారం రాత్రి గుజరాత్‌ నుంచి వచ్చిన ఓ టగ్‌లో 11 మంది కాకినాడ పోర్టుకు చేరుకున్నారు.


వీరికి పరీక్షలు చేస్తే నలుగురికి ట్రూనాట్‌లో పాజిటివ్‌ తేలింది. గురువారం ఆర్‌టీపీసీఆర్‌లో పరీక్షించగా కొవిడ్‌ ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో వీరిని రాజమహేంద్రవరంలో జీఎస్‌ఎల్‌ ఆసుపత్రికి తరలించారు. అటు మరో టగ్‌లో ముంబై నుంచి వచ్చిన ఒకరికి పాజిటివ్‌ తేలింది. ఇదికాకుండా మూడు రోజుల కిందట దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ నౌకలో సిబ్బందికి పరీక్షలు చేస్తే గురువారం ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరంతా హర్యానా, జంషెడ్‌పూర్‌ తదితర ప్రాంతాలకు  చెందిన వారుగా గుర్తించారు. వీరిని కాకినాడ నగరంలో ఓ హోటల్‌లో పెయిడ్‌ క్వారంటైన్‌కు తరలించినట్టు సమాచారం. అయితే నౌకలో పనిచేసిన సిబ్బందికి కొవిడ్‌ విషయమై  చాలా గోప్యత పాటిస్తున్నారు. పోర్టు అధికారులు సైతం దీనిపై తమకు సమాచారం లేదని చెబుతున్నారు. మరోపక్క రాజమహేంద్రవరం బొమ్మూరు క్వారంటైన్‌లో అయిదుగురికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో ముగ్గురు ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన ఓఎన్జీసీ ఉద్యోగులు ఉన్నారు.


మరొకరు విజయవాడ, ఇంకొకరు విజయనగరం నుంచి వచ్చిన వలస కూలీలుగా తేల్చారు. అటు రాజమహేంద్రవరం నగరంలో ఇద్దరికి పాజి టివ్‌గా తేలింది. ఒకరు ముంబై నుంచి రాగా, ఇంకొకరు విజయవాడ నుంచి వచ్చిన మహిళగా గుర్తించారు. అటు అయినవిల్లిలో మరో పాజిటివ్‌ తేలింది. తాజా కేసులతో జిల్లాలో మొత్తం కొవిడ్‌ కేసులు 337కి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే కాకినాడ జీజీహెచ్‌కు ఎట్టకేలకు కొత్త వెంటిలేటర్లు అయిదు చైనానుంచి వచ్చాయి. విశాఖ విమ్స్‌ ప్రభుత్వ ఆసు పత్రి అవసరాలకు ఇక్కడి నుంచి ఇటీవల కొన్ని వెంటిలేటర్లు తరలించగా ఇక్కడ కొరత ఏర్పడింది. అయితే కొత్త వెంటి లేటర్లకు ఆర్థికంగా దాతల నుంచి సాయం అందడంతో ఇటీ వల వీటిని కొనుగోలు చేయగా జీజీహెచ్‌కు చేరుకున్నాయి.

Updated Date - 2020-06-05T11:11:10+05:30 IST