బాబోయ్‌

ABN , First Publish Date - 2022-01-20T06:00:30+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ మహమ్మారి పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతోంది. ఒకటీ రెండూ కాదు, ఏకంగా బుధవారం 919 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.

బాబోయ్‌

  జిల్లాలో ఒక్కరోజులో 919 మందికి కొవిడ్‌
  పట్టపగ్గాల్లేకుండా విజృంభిస్తున్న మహమ్మారి
 కాకినాడ పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నవీన్‌కు పాజిటివ్‌
  మోతుగూడెంలో ఏడుగురు టీచర్లు, 13 మంది స్థానికులకు
  రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరిధిలో 35 మంది పోలీసులకు
  అమలాపురం, మండపేటల్లో  ఇద్దరు సీఐలు, ఎస్‌ఐలకు వైరస్‌
  మండపేటలో ఇద్దరు వైద్యులు, ఓ ఫార్మసిస్టుకు కూడా
  కలెక్టరేట్‌, కుడా కార్యాలయాల్లో ఆరుగురికి
  పి.గన్నవరంలో ఇద్దరు సచివాలయ సిబ్బందికీ

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) జిల్లాలో కొవిడ్‌ మహమ్మారి పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతోంది. ఒకటీ రెండూ కాదు, ఏకంగా బుధవారం 919 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఒక్కరోజులో వైద్యు లు, పోలీసులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాజకీయ ప్రముఖులు ఇలా అందరినీ పదుల సంఖ్యలో చుట్టేసింది. థర్డ్‌వేవ్‌లో జిల్లాలో ఒక్కరోజులో ఇన్ని కేసులు ఇదే తొలి సారి. రాష్ట్రంలో విశాఖ, చిత్తూరు, గుంటూరు తర్వాత బుధవారం అత్యధిక కేసులు వచ్చింది జిల్లాలోనే. దీంతో మహమ్మారి తీవ్రతకు అంతా వణికిపోతున్నారు. గడచిన పది రోజులుగా జిల్లాలో రోజుకు మూడు వందల వరకు నమోదయ్యే పాజిటివ్‌లు బుధవారం 919 నమోదవడంతో వైద్యశాఖ ఉలిక్కిపడింది. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుని వణికిపోతోంది. వాస్తవానికి సంక్రాంతి పేరుతో భారీగా షాపింగ్‌ సందడి నెలకొంది. పండగకు జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు భారీగా జరిగాయి. అటు కోడిపందేలు, గుండాట, జాతర్లు, తీర్థాలకు లక్షల్లో జనం పోటె త్తారు. ఎక్కడా మాస్క్‌లు ధరించడం, దూరం పాటించడం అమలవలేదు. దీంతో వైరస్‌ వ్యాప్తి తీవ్రత అధికమైంది. దీంతో కేసులు ఒక్కసారిగా పెరగడానికి కారణమైందని వైద్యశాఖ అంచనా వేస్తోంది. తాజాగా నమోదైన పాజిటివ్‌లతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2,98,544కు చేరింది. వివిధ ఆసుపత్రులు, హోంఐసోలేషన్‌లో చికిత్స పొందు తున్నవారు 3,343కు చేరారు. అటు కాకినాడ టీడీపీ పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. మోతుగూడెం మండలంలో 42 మందికి టెస్ట్‌లు నిర్వహించగా, ఏపీ జెన్‌కో డీఏవీ పాఠశాలకు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులకు కొవిడ్‌ నిర్ధారణ అయిం ది. మరో 13 మంది గ్రామస్తులకు పాజిటివ్‌గా తేలింది. మండపేటలో ఇద్దరు వైద్యులు, ఓ ఫార్మసిస్టు కొవిడ్‌ బారిన పడ్డారు. మండపేట టౌన్‌, రూరల్‌లో ఇద్దరు సీఐలు, ఇద్ద రు కానిస్టేబుళ్లకు వైరస్‌ సోకింది. అమలాపురంలో ఓ మహిళా ఎస్‌ఐ సహా ఏడుగురు కానిస్టేబుళ్లకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఇటీవల ఇక్కడ జాతరలు, ప్రభలు జరగడంతో విధులకు వెళ్లిన వారికి వైరస్‌ సోకినట్టు సమాచారం. రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరిధిలో 35 మంది పోలీసులకు కొవిడ్‌ సోకినట్టు సమాచారం. ఇటు కరప మండలం లో ఇద్దరు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సిబ్బందికి కొవిడ్‌ సోకడంతో బ్యాంకు మూతపడింది. కలెక్టరేట్‌ కార్యాలయంలో అయిదుగురు, కుడా కార్యాలయంలో మరో ఉద్యోగికి వైరస్‌ సోకింది. ఇక జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కాకినాడ పరిధిలో 75, రాజమహేంద్రవరం పరిధిలో 65, పెద్దాపురం పరిధిలో 50, రామచంద్రపురం పరిధిలో 45 మందికి  కొవిడ్‌ సోకింది. కాగా 15 నుంచి 18 ఏళ్ల వారికి ప్రత్యేక డ్రైవ్‌ అనంతరం తిరిగి టీకా అందకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తిరిగి టీకా లభ్యత ఎప్పుడు ఉంటుందో కూడా తెలియకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-01-20T06:00:30+05:30 IST