Prakasam జిల్లా పాఠశాలల్లో కోవిడ్ విజృంభణ.. భయం.. భయం

ABN , First Publish Date - 2021-09-05T14:22:18+05:30 IST

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

Prakasam జిల్లా పాఠశాలల్లో కోవిడ్ విజృంభణ.. భయం.. భయం

ప్రకాశం : ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులూ వైరస్‌ బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా విషయానికొస్తే.. ఇప్పటికే కొప్పెర పాడు హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు బహదూర్‌ కరోనాతో మృతి చెందారు. తాజాగా గుంటుపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడికి, ఆయన భార్యకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు 156కు చేరాయి. ఒకే రోజు అత్యధికంగా 20 కేసులు నమోదు కావడం.. నలుగురు ఉపాద్యాయులు, 16 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.


స్కూల్స్ వారిగా కరోనా కేసులు.. 

- మద్దిపాడు మండలం నేలటూరు ఎంపీయూపీ స్కూల్‌లో నలుగురికి,

- ఉలవపాడు మండలం వీరేపల్లి మోడల్ స్కూల్‌లో నలుగురికి,

- కొండపి మండలం పెట్లూరు జెడ్పీ హైస్కూల్‌లో ముగ్గురికి,

- పొన్నలూరు మండలం పి.అగ్రహారం ఎంపీ స్కూల్‌లో నలుగురికి

- విప్పగుంట ఎంపీపీఎస్‌లో ఒకరికి,

- కనిగిరి మొదటి వార్డు ఎంపీ స్కూల్‌లో ఇద్దరికి,

- నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం ఎంపీ స్కూల్, హెచ్.నిడమానూరు ఎయిడెడ్ స్కూల్‌లో ఒకరికి చొప్పున కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాఠశాలల్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ఇతర ఉపాద్యాయులు, విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇదిలా ఉంటే.. జిల్లాలో నిన్న ఒక్కరోజే 152 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,34,180కి చేరింది. వీరిలో 1053 మంది మృతి చెందారు. ప్రస్తుతం 2187 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు.. కొత్తగా రెండు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగు చూశాయి.

Updated Date - 2021-09-05T14:22:18+05:30 IST