భారీగా తగ్గిన కేసులు

ABN , First Publish Date - 2022-01-26T07:27:54+05:30 IST

: దేశంలో కరోనా కేసుల తగ్గుదల వరుసగా ఐదో రోజూ కొనసాగింది. ఎట్టకేలకు కేసుల సంఖ్య 3 లక్షల దిగువకు వచ్చింది. మంగళవారం రోజున 2.55 లక్షల కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ...

భారీగా తగ్గిన కేసులు

  కొత్తగా 2.55 లక్షల మందికి కొవిడ్‌

 కొత్త కేసుల్లో సగానికిపైగా దక్షిణాదిలోనే


న్యూఢిల్లీ, జనవరి 25: దేశంలో కరోనా కేసుల తగ్గుదల వరుసగా ఐదో రోజూ కొనసాగింది. ఎట్టకేలకు కేసుల సంఖ్య 3 లక్షల దిగువకు వచ్చింది. మంగళవారం రోజున 2.55 లక్షల కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం రోజున నిర్ధారణ అయిన కేసుల (3.06 లక్షల) కంటే ఇది దాదాపు 50వేలు తక్కువ. దీంతో కొవిడ్‌ పాజిటివిటీ రేటు కూడా 20.7 శాతం నుంచి 15.5 శాతానికి తగ్గింది. మంగళవారం మృతుల సంఖ్య 614కు చేరింది. కేరళలో మున్నుపెన్నడూ లేని స్థాయిలో ఒక్కరోజులోనే అత్యధికంగా 55,475 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. కొత్త కేసుల్లో సగానికిపైగా కేరళ (55,475), కర్ణాటక (46,426), తమిళనాడు (30,215), మహారాష్ట్ర (28,286), కశ్మీర్‌ (6,570), ఢిల్లీ (6,028) రాష్ట్రాల్లోనే బయటపడటం గమనార్హం. కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న పలు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వర్చువల్‌గా భేటీ అయ్యారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న రోగులకు ఆయా జిల్లా కేంద్రాలలోని ప్రభుత్వ వైద్య నిపుణుల సలహాలు పొందేందుకు టెలీ కన్సల్టేషన్‌ విభాగాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.


ఇంకొన్ని రోజులు ఐసీయూలోనే.. 

కొవిడ్‌తో బాధపడుతున్న గాయని లతా మంగేష్కర్‌ (92) ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడిందని, ఇంకొన్ని రోజులు ఐసీయూలో ఉండాల్సి రావొచ్చని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక మూడోవేవ్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 13 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రీ విభాగానికి చెందిన 400 మంది సిబ్బందికి కొవిడ్‌ సోకిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మంగళవారం ప్రకటించారు. తన కేసుకు సంబంధించిన సమాచారాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ త్వరగా నమోదు చేయడం లేదంటూ ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదుకు స్పందనగా ఈ వివరాలను వెల్లడించారు. ఇక.. గత వారం రోజులుగా కేసులు తగ్గుతున్నందున త్వరలోనే కొవిడ్‌ ఆంక్షలను ఎత్తివేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.


కర్ఫ్యూ ఉల్లంఘన , నవదంపతుల అరెస్టు 

రాత్రి కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి సోమవారం అర్ధరాత్రి కార్లలో వెళ్తున్న నవ దంపతులు, వారి కుటుంబ సభ్యులను గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పెళ్లి జరిగిన తొలిరాత్రిలో దాదాపు 3 గంటలపాటు నవ దంపతులు స్టేషన్‌లో ఉండాల్సి వచ్చింది. ఇక ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు టీకా రెండు డోసులు తీసుకొని ఉంటే.. వచ్చే 11 నుంచి పరీక్షల అవసరం లేకుండానే నేరుగా అనుమతిస్తామని బ్రిటన్‌ ప్రకటించింది. మరోవైపు.. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల వేగం, ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల కచ్చితత్వాన్ని మేళవించి పనిచేస్తూ.. 20 నిమిషాల్లోనే కొవిడ్‌ పరీక్షా ఫలితాన్ని ఇవ్వగల కిట్‌ను అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ కిట్లను అమెరికాలోని పలు పాఠశాలలు, పని ప్రదేశాల్లో అందుబాటులోకి తేనున్నారు.

Updated Date - 2022-01-26T07:27:54+05:30 IST