శభాష్ అనికా.. కరోనాకు చెక్ పెట్టిన 14ఏళ్ల ప్రవాసీ!

ABN , First Publish Date - 2020-10-21T02:40:52+05:30 IST

రోనా.. ఈ పేరు చెబితేనే ప్రపంచం మొత్తం ఉలిక్కిపడుతోంది. దాదాపు ఏడాదిగా ఈ వైరస్ ప్రపంచం మొత్తాన్ని భయపెడుతూనే ఉంది. ఇంతకాలం గడిచినా దీన్ని సమర్థవంతంగా నిలువరించే వ్యాక్సీన్ అందుబాటులోకి రాలేదు.

శభాష్ అనికా.. కరోనాకు చెక్ పెట్టిన 14ఏళ్ల ప్రవాసీ!

టెక్సాస్: కరోనా.. ఈ పేరు చెబితేనే ప్రపంచం మొత్తం ఉలిక్కిపడుతోంది. దాదాపు ఏడాదిగా ఈ వైరస్ ప్రపంచం మొత్తాన్ని భయపెడుతూనే ఉంది. ఇంతకాలం గడిచినా దీన్ని సమర్థవంతంగా నిలువరించే వ్యాక్సీన్ అందుబాటులోకి రాలేదు. దేశాలన్నీ నూతన చికిత్సా విధానాలతోనే పనికానిచ్చేస్తున్నాయి. ప్లాస్మా థెరపీని ఎక్కువ దేశాలు ప్రిఫర్ చేస్తున్నాయి.


ప్రపంచంలో కరోనా సృష్టించిన విలయం చూసి మనమంతా భయపడ్డాం, బాధపడ్డాం, జాలిపడ్డాం. అదే ఓ 14ఏళ్ల బాలికైతే ఏం చేస్తుంది? తల్లిదండ్రులకు విషయం చెప్పి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పగలదంతే. అయితే అమెరికాలోని నివశించే ప్రవాస భారతీయ బాలిక అనికా చేబ్రోలు అంతటితో ఆగలేదు. ఎలాగైనా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని భావించింది.



మాయదారి మహమ్మారిని మట్టుబెట్టేందుకు అనికా చాలా ఆలోచనలు చేసింది. చివరకు కరోనా నుంచి మనుషులను రక్షించే ఓ శక్తివంతమైన థెరపీకి రూపకల్పన చేసింది. టెక్సాస్‌లోని ప్రిస్కోలో అనికా నివశిస్తోంది. తన పరిశోధనలో భాగంగా కరోనా వైరస్ కణాలు పనిచేయకుండా చేసే ఓ మాలిక్యూల్‌ను ఆమె కనిపెట్టింది. దీని సాయంతో కరోనా వ్యాక్సీన్‌ ప్రయోగాలు వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయట.


అమెరికాలో ఏటా 3ఎమ్ సైన్స్ ఛాలెంజ్ జరుగుతుంది. గెలిచిన వారికి 25వేల డాలర్ల బహుమతి. దీనిలో 5-8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు. ప్రతిరోజూ ఎదురయ్యే సమస్యలకు సైన్స్ ద్వారా పరిష్యారం చూపించడమే ఈ ఛాలెంజ్ థీమ్. 8వ తరగతి చదువుతున్న అనికా కూడా  ఈ పోటీలో పాల్గొంది. కరోనా వంటి వైరస్‌లతో పోరాడేందుకు తాను రూపొందించిన చికిత్సను వారికి వివరించింది.


అనిక ప్రతిభను మెచ్చుకున్న పోటీ నిర్వాహకులు ఆమెనే విజేతగా ప్రకటించారు. 25వేల డాలర్ల ప్రైజ్‌మనీ అందించారు. ‘అనికా చురుకైన అమ్మాయి. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్నో ప్రశ్నలు వేసి సమాచారాన్ని సేకరించింది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పరిశీలించి ఓ శక్తివంతమైన చికిత్సా విధానానికి రూపకల్పన చేసింది’ అని ఛాలెంజ్‌కి జడ్జిగా వ్యవహరించిన డాక్టర్ సిండీ మాస్ తెలిపారు. అనికా రూపొందించిన థెరపీ ద్వారా కరోనా రోగులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.


భారత సంతతికి చెందిన అనిక.. తొలుత ఫ్లూతో సంబంధం ఉన్న ప్రాజెక్ట్ చేయాలని భావించింది. ఆ తర్వాత కరోనాపై పరిశోధన చేయాలని డిసైడయింది. తన పరిశోధన కోసం రకరకాల వైరస్‌లు, వ్యాధులను అధ్యయనం చేసింది. ఏయే వ్యాధులపై ఏ మందులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంది. ఆ దిశగా ఎంతో పరిశోధన చేసింది. కరోనా అంతు చూసేందుకు పట్టుదలతో ప్రయత్నంచి విజయం సాధించింది. 


చిన్నతనంలో తాతయ్య ఎక్కువగా సైన్స్ విషయాలే చెప్పేవారని, సైన్స్ నేర్చుకోవాలని ప్రోత్సాహించేవారని అనిక చెప్పింది. ఆమె తాతయ్య కెమిస్ట్రీ ప్రొఫెసర్ కావడంతో సహజంగానే మూలకాలపై ప్రత్యేక శ్రద్ధచూపేవారు. అదే అలవాటు అనికకు కూడా వచ్చింది. చదువు పూర్తయ్యాక వైద్య పరిశోధన వృత్తి చేపట్టడమే తన ఆశయమని అనిక చెప్తోంది. అంతేకాదండోయ్ భారతీయ సంప్రదాయ డ్యాన్సుల్లో కూడా అనిక దిట్ట. ఆమె డ్యాన్సులకు స్థానికంగా అభిమానులు కూడా ఉన్నారు.

Updated Date - 2020-10-21T02:40:52+05:30 IST