వరంగల్‌లో కరోనా శవ జాగారం

ABN , First Publish Date - 2020-07-30T07:28:22+05:30 IST

వరంగల్‌ ఎంజీఎంలో తీవ్ర దయనీయ పరిస్థితి నెలకొంది! ఆస్పత్రి మార్చురీలో నాలుగు రోజులుగా 17 మృతదేహాలు పడివున్నాయి! అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసే పరిస్థితులు లేకపోవడంతో ఎప్పుడు అంతిమసంస్కారాలు

వరంగల్‌లో కరోనా శవ జాగారం

  • ఎంజీఎంలో 17 శవాలు.. వీటిలో 9 కరోనా మృతదేహాలు
  • 4 రోజులుగా మార్చురీలోనే.. అంత్యక్రియలెప్పుడో తెలియని దైన్యం
  • తీసుకెళ్లేందుకు ముందుకు రాని కుటుంబసభ్యులు
  • త్వరగా తేల్చాలని మునిసిపల్‌ కమిషనర్‌కు ఆర్‌ఎంవో లేఖ 
  • తండ్రి అంత్యక్రియలకు అనుమతి కోసం శ్మశానాల చుట్టూ పిల్లలు
  • రోజంతా తిరిగినా దొరకని అనుమతి.. తల్లేమో ఆస్పత్రిలో
  • తండ్రికి అంతిమ సంస్కారాలు ఎక్కడ జరపాలంటూ పిల్లల కన్నీళ్లు


వరంగల్‌ అర్బన్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ ఎంజీఎంలో తీవ్ర దయనీయ పరిస్థితి నెలకొంది! ఆస్పత్రి మార్చురీలో నాలుగు రోజులుగా 17 మృతదేహాలు పడివున్నాయి! అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసే పరిస్థితులు లేకపోవడంతో ఎప్పుడు అంతిమసంస్కారాలు జరుగతాయనేదానిది ప్రశ్నార్థకంగా మారింది. పదిహేడు మృతదేహాల్లో తొమ్మిది.. కరోనా రోగుల మృతదేహాలు కాగా, ఎనిమిది సాధారణ వ్యాధులతో చనిపోయిన వారివి!! అంత్యక్రియల నిర్వహణకు కాదు కదా.. కనీసం మృతదేహాలను చూసేందుకు కూడా కరోనా భయంతో వారి ఆప్తులు ఆస్పత్రి వైపు రావడం లేదు. కొందరు వచ్చినా.. శ్మశాన వాటికల నిర్వాహకులెవ్వరూ అనుమతించకపోవడంతో కరోనా రోగుల మృతదేహాలు అంత్యక్రియలకు నోచుకోవడం లేదు. ఎంజీఎంలో తొమ్మిది కరోనా రోగుల మృతదేహాల వివరాలను తెలుపుతూ ఈనెల 29న గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కమిషనర్‌ పమేలా శత్పతికి ఆర్‌ఎంవో అధికారికంగా లేఖ రాశారు. మృతుల వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ సేకరించింది. ఈ తొమ్మిది మంది కరోనా మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరంతా ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లోనే మృతిచెందారు. పరిస్థితి తెలుసుకున్న ఓ మంత్రి, హైదరాబాద్‌లో మాదిరి వరంగల్‌లో కూడా కరోనా మృతులకు మునిసిపల్‌ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శ్మశానవాటికల నిర్వాహకులతో వరంగల్‌ మునిసిపల్‌ కమిషనర్‌ పమేల సత్పతి మాట్లాడి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఎంతచెప్పినా వినకపోవడంతో ఒప్పుకోవాల్సిందేనని కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధం కావడంతో ప్రజా ప్రతినిధులు అడ్డుకుంటున్నారు. సంబంధిత ఎమ్మెల్యేలు ఫోన్‌ చేసి ఆ ప్రాంతంలో కరోనాతో మృతి చెందినవారి అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రజలు ఒప్పుకోవడం లేదని, వారిని బలవంతం చేయకండి అంటూ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. 


తల్లి ఆస్పత్రిలో.. తండ్రి అంత్యక్రియలు.. ఎలా అని పిల్లలు 

కరోనా రోగుల మృతదేహాల అంత్యక్రియల కోసం ఆప్తుల్లో కొందరు ముందుకు వస్తున్నా వరంగల్‌లో శ్మశానవాటికలు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకురావడం లేదు. దీంతో అంత్యక్రియలు ఎక్కడ జరపాలో తెలియక మృతుల కుటుంబసభ్యులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల హన్మకొండకు చెందిన దంపతులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. పరిస్థితి విషమించడంతో  మంగళవారం రాత్రి 7 గంటలకు భర్త మృతి చెందాడు. భార్య చికిత్స పొందుతోంది. భర్త మృతి చెందిన విషయం భార్యకు తెలియకుండా వారి పిల్లలు జాగ్రత్త పడ్డారు.. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అనుమతి కోసం శ్మశానవాటికల చుట్టూ పిల్లలు కాళ్ళరిగేలా తిరిగారు. పలువురు ప్రజాప్రతినిధులను కలిసి కాళ్లావేళ్లాపడ్డా పట్టించుకోలేదు. ఏం చేయాలో అర్థంకాక  ఏడుస్తున్నారు. ఆ దంపతుల కుమారుడు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ 24 గంటలుగా శ్మశాన వాటికల చుట్టూ తిరుగుతున్నామని,  అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవ్వరూ ఒప్పుకోవడం లేదని వాపోయారు. ‘‘మొన్నటి వరకు నవ్వుతూ గడిపిన మా నాన్నకు ఇంత అవమానం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నాన్న లేడని తెలిస్తే అమ్మ కూడా మాకు దక్కదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు’’ అని కన్నీరు పెట్టుకున్నారు. 


  • మొత్తం 9 మృతదేహాలు శవాగారంలో ఉన్నాయి. ఆ తొమ్మిది మందినీ కొవిడ్‌ వార్డులో చేర్చారు. అంటే, కరోనా వైరస్‌ ధ్రువీకరణ అయిన రోగులు. 
  • వారిలో యాభై ఏళ్ల వృద్ధుడు 26వ తేదీన మృతి చెందాడు.
  • 27వ తేదీన ఇద్దరు మృతి చెందారు. ఒకరికి వయస్సు 52 కాగా, మరొకరిది 85. 
  • 28వ తేదీన 44 ఏళ్ల వ్యక్తి, 64 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. 
  • 29న గుర్తు తెలియని పురుషుడు(50), గుర్తు తెలియని వృద్ధురాలు(64) మరణించారు. 
  • 85 ఏళ్ల గుర్తు తెలియని వృద్ధురాలు, 55 ఏళ్ల మరో మహిళ మృతదేహాలు కూడా ఉన్నాయి. వారెప్పుడు మరణించారో లేఖలో పేర్కొనలేదు. 

Updated Date - 2020-07-30T07:28:22+05:30 IST