కొవిడ్‌ మందులకు కటకట!

ABN , First Publish Date - 2021-05-05T09:21:29+05:30 IST

... ఇవీ విశాఖలోని విమ్స్‌లో కరోనా బాధితుల బాధలు. కింగ్‌జార్జి ఆస్పత్రి సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో పరిస్థితీ ఇంచుమించుగా ఇలాగే ఉంది. పరిమితికి మించి బాధితులను చేర్చుకోవడంతో వారికి అత్యవసరమైన ఆక్సిజన్‌తో పాటు ఇతర మందులు

కొవిడ్‌ మందులకు కటకట!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో తీవ్రంగా కొరత 

వార్డుల్లో పరిమితికి మించి బాధితులు 

ఆక్సిజన్‌ సరఫరా అంతంత మాత్రమే 

ప్లాస్టిక్‌ కిట్లతో వైద్యసిబ్బందికి ఇక్కట్లు 

సరైన వసతులు కల్పించడం లేదని ఆవేదన 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

‘అమ్మా... రేపు ఉదయాన్నే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిపోతున్నా. ఈ రాత్రికి నా ప్రాణం నిలపండి. దయచేసి వెంటిలేటర్‌ పెట్టండి. ప్లీజ్‌ మీకు దండం పెడతా..’ 

- 50ఏళ్ల వ్యక్తి ఆవేదన


‘సిస్టర్‌, నాకు పెళ్లయి ఏడాదిన్నరే అయింది. చిన్న బాబు ఉన్నాడు. కుటుంబానికి నేనే ఆధారం. నాకు ఊపిరి అందడం లేదు. దయచేసి ఆక్సిజన్‌ పెట్టండి. నన్ను కాపాడండి.’ 

- 26ఏళ్ల యువకుడి రోదన


... ఇవీ విశాఖలోని విమ్స్‌లో కరోనా బాధితుల బాధలు. కింగ్‌జార్జి ఆస్పత్రి సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో పరిస్థితీ ఇంచుమించుగా ఇలాగే ఉంది. పరిమితికి మించి బాధితులను చేర్చుకోవడంతో వారికి అత్యవసరమైన ఆక్సిజన్‌తో పాటు ఇతర మందులు అందించలేకపోతున్నారు. తగినన్ని నిల్వలు అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. విమ్స్‌లో 600మంది వరకూ బాధితులున్నారు. సామర్థ్యానికి రెట్టింపు సంఖ్యలో ఉండటంతో నాలుగు రోజులుగా కొత్తవారిని చేర్చుకోవడం లేదు. ఈ సమయంలో కొంతమంది మరణించగా, మరికొందరిని డిశ్చార్జి చేశారు. పడకలు ఖాళీ కావడంతో మంగళవారం మళ్లీ అడ్మిషన్లు ఇచ్చారు. ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్న వారినే విమ్స్‌కు తీసుకొస్తున్నారు. రాగానే వారికి రెమ్‌డెసివర్‌తో పాటు రక్తం గడ్డకట్టకుండా క్లెక్సాన్‌ 0.4, 0.6 ఇంజెక్షన్లు ఇచ్చేవారు. స్టాకు లేకపోవడంతో ఇప్పుడు ఇవ్వడం లేదు. యాంటీ బయాటిక్‌గా ఇచ్చే పిప్‌జో 4.5 ఇంజెక్షన్‌, స్టెరాయిడ్‌ మిథైల్‌ ట్రైడికేన్‌ కూడా అయిపోయాయి. ఐవర్‌మెక్టిన్‌ మాత్రలు మాత్రం ఇచ్చి, అందుబాటులో ఉంటే ఆక్సిజన్‌ పెడుతున్నారు. తరువాత వారికి ఆ దేవుడే దిక్కు. 14రోజులు అక్కడ ఉంచుతారు. కోలుకుంటే ఇంటికి పంపుతారు. లేదంటే...అంతే. ఇక కింగ్‌ జార్జి ఆస్పత్రిలో కరోనా బాధితుల కోసం 500 పడకలు ఏర్పాటుచేశారు. అక్కడ కూడా వారికి అవసరమైన వెంటనే ఆక్సిజన్‌ అందడం లేదు. అధికారంలో ఉన్నవారితో ఫోన్‌ చేయిస్తే తప్ప తగిన వైద్యం కూడా చేయడం లేదు. 


ఊపిరాడని ప్లాస్టిక్‌ పీపీఈ కిట్లు 

కరోనా వార్డుల్లో పనిచేసే వైద్యసిబ్బందికి వారానికి 5రోజులు కాటన్‌ పీపీఈ కిట్లు, 2 రోజులు ప్లాస్టిక్‌ పీపీఈ కిట్లు ఇస్తున్నారు. ఒకసారి కిట్‌ వేసుకుంటే డ్యూటీ ముగిసే వరకు విప్పడానికి అవకాశం ఉండదు. దాదాపు 8గంటలు అలాగే ఉండాలి. ప్లాస్టిక్‌ కిట్లు వేసుకున్నపుడు ఊపిరి ఆడక ప్రాణాలు పోయేట్టున్నాయని సిబ్బంది మొత్తుకుంటున్నా అధికారుల చెవికి ఎక్కడం లేదు. వాటినే సరఫరా చేస్తున్నారు. మంచినీళ్లు తాగితే మరుగుదొడ్డికి వెళ్లాల్సి వస్తుందని నర్సులు వాటర్‌ బాటిల్‌ కూడా ముట్టుకోవడం లేదు. ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నా, తమకు సరైన వసతులు కల్పించడం లేదని సిబ్బంది వాపోతున్నారు. ఇంతకు ముందు కరోనా వార్డుల్లో పనిచేస్తే వారం మార్చి వారం హోం ఐసొలేషన్‌ ఇచ్చేవారు. ఇప్పుడు వారానికి ఒకసారి సెలవు కూడా ఇవ్వడం లేదు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తామూ దీనికీ పట్టుబట్టడం లేదని, అయితే మౌలిక వసతులు, మందులు లేకపోతే ఎలాగని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. 


వెంటిలేటర్లకు మరమ్మతులు శూన్యం

విమ్స్‌లో కొన్ని వెంటిలేటర్లు పనిచేయడం లేదు. ప్రస్తుతం వాటి అవసరం ఎంతో ఉంది. వాటిని రిపేర్‌ చేయిస్తే ఎంతోమందికి ప్రాణాలు పోయొచ్చు. కానీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఇక విమ్స్‌లో బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు గడువు ముగిసిపోయినవి. అయితే వాటిపై స్టిక్కర్లు అంటించి ఇక్కడకు పంపుతున్నారు. కాలం తీరిన 6నెలల వరకు వాటిని ఉపయోగించుకోవచ్చని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో అభ్యంతరాలు వ్యక్తం కాలేదని సమాచారం. ఈ అంశాలపై వివరణ కోరేందుకు విమ్స్‌ డైరెక్టర్‌ సత్యప్రసాద్‌కు ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌ చేయగా ఆయన స్పందించలేదు.

Updated Date - 2021-05-05T09:21:29+05:30 IST