Abn logo
Aug 4 2021 @ 08:40AM

కళ తప్పిన ఆడిపెరుక్కు

- కరోనా కారణంగా పూజలు నిషేధం

- నిర్మానుష్యంగా కావేరి ఘాట్లు

 

పెరంబూర్‌(చెన్నై): కరోనా కారణంగా నదితీరాలకు ప్రజలను అను మతించకపోవడంతో మంగళవారం జరిగిన ఆడిపెరుక్కు ఉత్సవం కళ తప్పింది. మహిళలు ఇళ్ల దగ్గరే పసుపు తాళ్లు కట్టుకున్నారు. ఆడి మాసం 18వ రోజును ఆడిపెరుక్కుగా ప్రజలు ఆచరిస్తుంటారు. ఆరోజు ప్రజలు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. రైతులు ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటి సాగుపనులు ప్రారంభిస్తారు. ఆడిపెరుక్కు రోజున కావేరి మాతను పూజిస్తే ఆ ఏడాది అంతా కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుందని భక్తుల నమ్మకం. యువతులు పూజ చేస్తే మంచి భర్త లభి స్తాడని కూడా నమ్మకం ఉంది. కొత్తగా పెళ్లయిన వారు, సుమంగళులు ఆడిపెరుక్కు రోజున కొత్త మంగళసూత్రం ధరిస్తారు. పలువురు తమ ఇళ్లలో మొలకెత్తిన ధాన్యాన్ని కావేరి నదిలో వదలడం జరుగుతోంది. రాష్ట్రంలో రెండో అల నియంత్రణలోకి వచ్చినా, కొద్దిరోజులుగా పలు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీనిని అడ్డుకొనేలా తిరుచ్చి, తంజావూరు, తిరువారూర్‌, నాగపట్టణం సహా పలు జిల్లాల్లో నదితీరాల్లో నిషేదాజ్ఞలు విధించారు. అలాగే, ప్రసిద్ధిచెందిన ఆలయాలను కూడా మూసివేశారు. దీంతో, ప్రజలు ఇళ్లల్లోనే ఈ ఏడాది ఆడిపెరుక్కు జరుపు కోగా, సుమంగళులు, నవ వధువులు ఇళ్లలోనే పసుపుతాడు మంగళ సూత్రంగా ధరించారు. ఆడిపెరుక్కు రోజున ప్రజలతో కిటకిటలాడే తిరుచ్చి అమ్మ మండపం నిషేధాజ్ఞలతో నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది. ఆ ప్రాంతంలో బందోబస్తులో ఉన్న పోలీసులు, అక్కడకు వచ్చిన వారిని హెచ్చరించి వెనక్కి పంపేశారు. అలాగే, తంజావూరు జిల్లా తిరువయ్యారు పుష్పమండపం కావేరి ఘాట్‌, నాగపట్టణం, వేదారణ్యం, పుంపుహార్‌ సముద్రతీరాలు కూడా జనసంచారం లేక నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఇదిలా ఉండగా, పలు జిల్లాల్లో పోలీసులు బందోబస్తు ఘాట్లు, నది తీరాల వద్ద మాత్రం తక్కువ సంఖ్యలో మహిళలు ఆడిపెరుక్కు ఉత్సవం నిర్వహించారు.