దసరాపై కొవిడ్‌ ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2020-10-25T06:37:51+05:30 IST

గతంలో ఎన్నడూ లేని విధంగా దసరా పండుగను ఈసారి ఎవరి ఇళ్ల వద్ద వారే జరుపుకోవాల్సి వస్తున్నది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రతియేటా ప్రజలందరూ గుమిగూడి జమ్మి చెట్టుకు పూజలు చేయడం

దసరాపై కొవిడ్‌ ఎఫెక్ట్‌

జమ్మి చెట్టుకు పూజల్లేవ్‌.. పాలపిట్ట దర్శనాల్లేవ్‌

ఇళ్ల వద్దనే వేడుకలు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి)

గతంలో ఎన్నడూ లేని విధంగా దసరా పండుగను ఈసారి ఎవరి ఇళ్ల వద్ద వారే జరుపుకోవాల్సి వస్తున్నది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రతియేటా ప్రజలందరూ గుమిగూడి జమ్మి చెట్టుకు పూజలు చేయడం, పాలపిట్ట దర్శనాలు చేసుకోవడం జరిగేది. అయితే ఈసారి జిల్లావ్యాప్తంగా అలాంటి ఏర్పాట్లు ఏమి జరగడం లేదు. ముఖ్యంగా సంగారెడ్డిలోని అంబేడ్కర్‌ స్టేడియంలో ప్రతియేటా దసరా ఉత్సవాలు వైభవంగా జరిగేవి. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని చెట్టుకు పూజలు చేసి పాలపిట్ట దర్శనం చేయించేవారు. ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలు గుమిగూడరాదన్న ఉద్దేశంతో గ్రౌండ్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. అయితే సంగారెడ్డిలో మాత్రం ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రాంమందిర్‌ నుంచి శ్రీ సీతారాముల విగ్రహాలతో నిర్వహించే శావను 50 మందితో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజలు ఎవరూ స్టేడియం వద్దకు రావద్దని ఎమ్మెల్యే తెలిపారు. ఈసారి బతుకమ్మ పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు. 


పూలకు, గుమ్మడి కాయలకు భలే గిరాకీ

దసరా సందర్భంగా వాహనాలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఆయుధ పూజలో భాగంగా వాహనాలకు పూల దండలు వేయడం, గుమ్మడికాయలు కొట్టడం చేస్తారు. సంగారెడ్డిలో బంతి పూలను రూ.200 నుంచి రూ.250 వరకు కిలో చొప్పున విక్రయించారు. గుమ్మడికాయలను సైజును బట్టి రూ.150 నుంచి రూ.200 వరకు అమ్మారు. వ్యాపారులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెచ్చి అమ్మడంతో గిరాకీని బట్టి రేట్లను నిర్ణయించారు. ఏడాదికోసారి నిర్వహించే ఆయుధ పూజ కావడంతో ఎంత ధరైనా ప్రజలు కొనుగోలు చేశారు. 

Updated Date - 2020-10-25T06:37:51+05:30 IST