బడిలో భయం

ABN , First Publish Date - 2022-01-19T06:12:59+05:30 IST

కరోనా థర్డ్‌ వేవ్‌ చుట్టుముట్టేస్తోంది.

బడిలో భయం

పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలకు తిలోదకాలు 

దృష్టి సారించని విద్యాశాఖ అధికారులు

ప్రైవేటు పాఠశాలల్లో తగ్గిన హాజరు 

కేసులను దాచేస్తున్న యాజమాన్యాలు

పరీక్షలు నిర్వహిస్తే కేసులు వెలుగులోకి! 


కరోనా థర్డ్‌ వేవ్‌ చుట్టుముట్టేస్తోంది. రోజురోజుకూ కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ వల్ల ప్రాణభయం లేనప్పటికీ.. అది రూపం మార్చుకుంటే ప్రమాదమేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ పిల్లలను పాఠశాలలకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. తెలంగాణలో మాదిరి ఇక్కడ కూడా సెలవులను పొడిగించాలని తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నా, ప్రభుత్వం ఆమోదించడం లేదు. దీంతో భయం భయంగానే విద్యార్థులు విద్యాలయాలకు వెళుతున్నారు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కరోనా వైరస్‌ సోకింది. అయినప్పటికీ ఆయన పాఠశాలకు వచ్చి మొత్తం కలియదిరగడం ద్వారా వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యారంటూ స్థానిక పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఈలప్రోలు సుబ్బయ్య సోమవారం జిల్లా, మండల విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధాయుడి ద్వారా పిల్లలు, వారి ద్యారా వందల కుటుంబాలు కరోనా బారినపడే ప్రమాదముందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేయడంతో డీఈవో స్పందించారు. ఆ పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. తరచి చూడాలేగానీ, ఇలాంటి పరిస్థితులు జిల్లా అంతటా కనిపిస్తాయి.


సెలవుల ప్రతిపాదనకు నో

కరోనా థర్డ్‌వేవ్‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఇక్కడ కూడా పాఠశాలలకు సెలవులు పొడిగించాలని ఎన్ని విజ్ఞప్తులు వస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. పైగా సెలవులు ఇచ్చే ప్రసక్తే లేదంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలనే ప్రతిపాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. పైగా కరోనా థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే పాఠశాలలను నిర్వహిస్తున్నామని, విద్యార్థుల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అయితే  క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. కొవిడ్‌ నిబంధనల అమలు మొక్కుబడి తంతుగానే మారింది. పాఠశాలల్లో బెంచీకి ఇద్దరు విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టాలనే నిబంధన ఉన్నప్పటికీ.. ప్రైవేటు పాఠశాలల్లో, ఇరుకు గదుల్లో బెంచీకి ముగ్గురు, నలుగురు చొప్పున కూర్చోబెడుతున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారు. అయితే అవి సాధారణ సీజనల్‌ జ్వరాలేనంటూ ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు కరోనా బారినపడుతున్న విద్యార్థుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. 


వైరస్‌ రూపం మార్చుకుంటే ప్రమాదమే  

జిల్లాలో రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 300 దాటిపోయింది. కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ వల్ల ప్రాణాపాయ పరిస్థితులు లేనప్పటికీ.. అది కొత్త మ్యూటెంట్‌గా రూపం మార్చుకుంటే మాత్రం ప్రమాదమేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అజాగ్రత్తగా ఉంటే ముప్పు తప్పదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలు, కళాశాలలకు వెళుతున్న విద్యార్థులు వైరస్‌ బారినపడితే.. వారి ద్వారా ఇళ్లలోని పెద్దవారికీ కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 


నిబంధనలు గాలికి.. 

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొద్దోగొప్పో కొవిడ్‌ నిబంధనలను అమలు చేస్తున్నా.. ప్రైవేటు పాఠశాలల్లో గాలికి వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం ఒక తరగతి గదిలో బెంచీకి ఒకరు చొప్పున 20 మంది విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టి పాఠాలు బోధించాల్సి ఉండగా.. 90 శాతం ప్రైవేటు పాఠశాలల్లో ఈ నిబంధన అమలు కావడం లేదు. థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజేషన్‌ ఎక్కడా కనిపించడం లేదు. 


పట్టించుకోని విద్యాశాఖ అధికారులు 

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్నా, విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలను గాలికి వదిలేశారు. జిల్లావ్యాప్తంగా పాఠశాలల తనిఖీ అధికారులున్నా ఇంతవరకు ఒక్క ప్రైవేటు పాఠశాలను కూడా తనిఖీ చేయకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


ప్రొసీడింగ్స్‌ ఇచ్చాం

అన్ని పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. పాఠశాలల్లో విద్యార్థులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్‌ చేయడం తప్పనిసరి చేయాలని, ఎక్కడైనా విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించాలని సూచించాం. తరగతి గదులు తక్కువగా ఉంటే వరండాల్లో దూరం దూరంగానే కూర్చోబెట్టి పాఠాలు బోధించాలని చెప్పాం. సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 60 శాతం వరకు హాజరు నమోదవుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో హాజరు తగ్గితే తగ్గొచ్చు. వివరాలు మా దగ్గర లేవు. - తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారి 

Updated Date - 2022-01-19T06:12:59+05:30 IST