కొవిడ్‌ భయం.. ఇంట్లోనే టెస్టు నయం

ABN , First Publish Date - 2022-01-22T07:19:29+05:30 IST

కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే పరీక్షకు పయనం.. ముందు

కొవిడ్‌ భయం.. ఇంట్లోనే టెస్టు నయం

  • అందుబాటులో స్వీయ పరీక్ష కిట్లు.. పెరిగిన కొనుగోళ్లు
  • సోషల్‌ మీడియాలో చూసి వినియోగంపై అవగాహన
  • పాజిటివ్‌ వస్తే వివరాలు అప్‌లోడ్‌ చేయని కొందరు
  • రాష్ట్రంలో రెండో రోజూ 4 వేలకు పైగా కరోనా కేసులు
  • ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 300 మందికి కరోనా.. ఉత్పత్తి బంద్‌!


  

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, జనవరి 21(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే పరీక్షకు పయనం.. ముందు ఎంతమంది ఉన్నప్పటికీ వరుసలో నిల్చుని వంతు వచ్చే వరకు నిరీక్షణ.. పాజిటివ్‌ వస్తే వైద్యుల సలహా మేరకు మందుల వినియోగం.. ఇదీ ఇటీవలి వరకు ప్రజల తీరు. కానీ, ఇప్పుడు చాలామంది కొవిడ్‌ పరీక్షా కేంద్రాలకు వెళ్లడం లేదు. ఒమైక్రాన్‌ వ్యాప్తి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని టెస్టింగ్‌ సెంటర్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. దీంతో ఇంట్లోనే పరీక్షలు చేసేసుకుంటున్నారు. ఇందుకోసం స్వీయ పరీక్ష కిట్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఈ ధోరణి రెండు వారాలనుంచి ఎక్కువగా కనిపిస్తోందని, కిట్‌ల అమ్మకాలు బాగా పెరిగినట్లు మెడికల్‌ షాపుల వాళ్లు చెబుతున్నారు.


ప్రస్తుతం మార్కెట్లోకి 8 కంపెనీల కొవిడ్‌ స్వీయ పరీక్షల కిట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటినిఎలా వాడాలన్నదానిపై యూ ట్యూబ్‌లో చూసి తెలుసుకుంటున్నారు. థర్డ్‌వేవ్‌లో కేసులను చూసి కొందరు ఎక్కడ కొరత వస్తుందోనని ముందుజాగ్రత్తగా కొనుగోలు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలు, ఆస్పత్రుల్లో నిరీక్షించేందుకు ఇష్టపడనివారంతా స్వీయ పరీక్ష కిట్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ఇలా.. పాజిటివ్‌ వచ్చినవారు హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు. కొందరు మరింత నిర్ధారణకు ఆర్టీపీసీఆర్‌ టెస్టుకు వెళ్తున్నారు. మరికొందరు మాత్రం మిన్నకుంటున్నారు. అయితే, స్వీయ పరీక్షలో పాజిటివ్‌ వచ్చినవారిలో చాలామంది ఆ వివరాలను ఐసీఎంఆర్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడం లేదు. వాస్తవానికి.. కిట్‌ను వినియోగించేందుకు హోం టెస్టింగ్‌ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని నమోదు చేసుకోవాలి. వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి.  పాజిటివ్‌ వస్తే టెస్టింగ్‌ స్ర్టిప్‌ను యాప్‌లో ఫొటో తీయాలి. ఈ వివరాలు నేరుగా ఐసీఎంఆర్‌ వెబ్‌సైట్‌కు చేరతాయి. అయితే, ఇంత పద్ధతిగా చేస్తున్నది కొద్ది శాతమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.


ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. సొంత పరీక్షలపై దృష్టిసారించింది. రాష్ట్రంలో ఆయా కంపెనీలు విక్రయించిన మొత్తం కిట్ల వివరాలను సేకరించే పనిలో పడింది. కాగా, స్వీయ పరీక్ష కిట్‌లకు సంబంధించి ఇప్పటికే ఐసీఎంఆర్‌ 8 సంస్థలకు ఆమోదం తెలిపింది. మరో ఐదు సంస్థలు తయారు చేసిన కిట్‌లు అనుమతులకు ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవి రూ.250 నుంచి రూ.600కు లభ్యం అవుతున్నాయి.


లక్షణాలుంటే.. మందులేసుకుంటున్నారు

లక్షణాలుంటే.. కొందరు పరీక్షకు వెళ్లకుండా కరోనా మందులను వినియోగిస్తున్నారు. ఇది హానికరమని వైద్యులు అంటున్నారు. ‘‘ప్రస్తుతం ఒమైక్రాన్‌తో పాటు ప్రమాదకర డెల్టా కూడా మనుగడలో ఉంది. రెండింటి లక్షణాలు ఒకటే అయినా చికిత్సలో చాలా తేడాలున్నాయి. సోకింది ఏ వేరియంట్‌ అనేది తెలియకుండా మందుల వినియోగం ప్రయోజనకరం కాదు. లక్షణాలున్నవారు సొంత వైద్యం మానుకుని వైద్యులను సంప్రదించాలి’’ అని  బంజారా హిల్స్‌ కేర్‌ ఆస్పత్రి (జనరల్‌ మెడిసిన్‌) వైద్యుడు నవోదయ తెలిపారు. 


ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లో ఉత్పత్తి బంద్‌

పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లో 50 మంది శాశ్వత, 250 మంది కాంటాక్టు కార్మికులు కొవిడ్‌కు గురయ్యారు. లోడింగ్‌ విభాగంలోనే 120 కార్మికులు వైరస్‌ బారినపడ్డారు. దీంతో గురువారం రాత్రి నుంచి పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేశారు. పదిరోజుల పాటు షట్‌డౌన్‌ కొనసాగే అవకాశం ఉంది. భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో శుక్రవారం 23 మందికి పరీక్షలు చేయగా 16 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇక సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో సహా కలెక్టరేట్‌లోని 14 మంది రెవెన్యూ ఉద్యోగులు వైర్‌స బారినపడ్డారు.




1.20 లక్షల టెస్టులు.. 4,416 కేసులు

రాష్ట్రంలో రెండో రోజూ కేసులు 4 వేలు దాటాయి. శుక్రవారం 1,20,243 మందికి పరీక్షలు చేయగా, 4,416 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. కొవిడ్‌తో మరో ఇద్దరు మృతిచెందారు. యాక్టివ్‌ కేసులు 29,127కు పెరిగాయి. తాజా పాజిటివ్‌లలో హైదరాబాద్‌లో 1,670, మేడ్చల్‌లో 417, రంగారెడ్డిలో 301, హనుమకొండలో 178, ఖమ్మంలో 117 నమోదయ్యాయి. కొత్తగా 2.38 లక్షల మందికి టీకా పంపిణీ చేశారు. 1.73 లక్షల మంది రెండో, 10,701 మంది ముందుజాగ్రత్త డోసు పొందారు. ఇప్పటివరకు 15 నుంచి 18 ఏళ్ల వయసు వారిలో 10.49 లక్షల మందికి టీకా వేశారు.


Updated Date - 2022-01-22T07:19:29+05:30 IST