లెక్కల్లోనే పడకలు.. చిక్కుల్లో రోగులు!

ABN , First Publish Date - 2020-08-13T16:38:27+05:30 IST

అయ్యా వందనాలు. నేను మనుబోలు మండలంలో హైస్కూలు హెడ్‌మాస్టర్‌గా..

లెక్కల్లోనే పడకలు.. చిక్కుల్లో రోగులు!

కోవిడ్‌ ఆసుపత్రుల్లో బెడ్ల లభ్యత గగనమే!

అధికారుల లెక్కల్లో వాస్తవమెంత?

అడ్మిషన్‌ కోసం బాధితుల వేడుకోలు

‘కార్పొరేట్‌’కు అధికారబలం

పట్టించుకోకుంటే మరింత ప్రమాదం

నేడు వైద్య శాఖ మంత్రి నాని రాక

జిల్లా అధికారులతో సమీక్ష?


నెల్లూరు(ఆంధ్రజ్యోతి):

అయ్యా వందనాలు. నేను మనుబోలు మండలంలో హైస్కూలు హెడ్‌మాస్టర్‌గా పని చేస్తున్నాను. నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అడ్మిషన్‌ కోసం గవర్నమెంట్‌ ఆసుపత్రిలో ఒక గంటగా వెయిట్‌ చేస్తున్నాను. కలెక్టర్‌ గారు,  జేసీ గారు, ఎమ్మెల్యే, డీఈఓ గార్లు దయచేసినన్ను కాపాడాల్సిందిగా కోరుతున్నాను. 

ఈ నెల 8వ తేదీన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జీజీహెచ్‌) వద్ద పడకలు దొరక్క, ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఓ ప్రధానోపాధ్యాయుడు పెట్టిన వీడియో మెసేజ్‌ ఇది. అయితే నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం వేకువ జామున ఈయన ప్రాణాలు విడిచారు. నెల్లూరులోని కోవిడ్‌ ఆసుపత్రుల వద్దకు వెళితే రోజుకు ఇలాంటి సంఘటనలు లెక్కలేనన్ని కనిపిస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే పడకలు లేవంటారు. కాస్త గట్టిగా అడిగితే సాధారణ పడకలు ఉన్నాయి, ఆక్సిజన్‌  పడకలు లేవంటారు. ఇతర కోవిడ్‌ ఆసుపత్రుల్లో ట్రై చేసుకోమంటారు. ఆ ఆసుపత్రుల వద్దకు వెళ్లినా అదే జబావు. అయితే, డబ్బులు కడుతామంటే రహస్యంగా అడ్మిషన్లు ఇస్తున్నారు. ఆసుపత్రుల వద్ద కరోనా బాధితులు పడుతున్న మరణ యాతన గమనిస్తే అసలు జిల్లాలో అధికార యంత్రాంగం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 


కోవిడ్‌ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న పడకలకు సంబంధించి జిల్లా అధికారులు విడుదల చేస్తున్న రోజువారి ప్రకటనలు కాకి లెక్కలేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు మనుబోలు హెచ్‌ఎం ఘటనే ఉదాహరణ. వాస్తవానికి ఆ రోజు (8న) అధికారులు విడుదల చేసిన ప్రకటనలో 1491 ఆక్సిజన్‌ బెడ్లు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు. కోవిడ్‌ ఆసుపత్రుల్లో మొత్తం బెడ్లు 2340 కాగా అందులో 841 మాత్రం నిండి ఉన్నాయని, మిగిలిన 1491 బెడ్లు ఖాళీ ఉన్నాయని పేర్కొన్నారు. ఇన్ని బెడ్లు ఖాళీ ఉంటే ఒక హెచ్‌ఎం ఆసుపత్రిలో అడ్మిషన్‌ కోసం పడిగాపులు కాచి ఇక అడ్మిషన్‌ దొరకదేమోనన్న ప్రాణభయంతో తనను కాపాడమని ప్రాధేయపడుతూ మెసేజ్‌ ఎందుకు పెట్టాల్సి వచ్చింది.


వాస్తవానికి దీనికి ముందే ఆయన నెల్లూరులోని ఇతర కోవిడ్‌ ఆసుపత్రులను ఆశ్రయించాడు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళితే కాస్త మెరుగైన చికిత్స అందుతుందన్న ఆశతో  వెళ్లినా నిరాశే ఎదురైంది. చివరికి ఎమ్మెల్యే కాకాణి వీడియో చూసి ఆసుపత్రికి ఫోన్‌ చేసి మాట్లాడటంతో మరో రెండు గంటల తరువాత ఆయనకు అడ్మిషన్‌ దొరికింది. ఎంతమంది రోగులు ఇలా ఎమ్మెల్యేల వద్ద సిఫార్సు చేయించుకోగలరు. ఎంత మంది తమను కాపాడమని అధికారులు, ప్రజాప్రతినిధులకు వీడియో మెసేజ్‌లు చేయగలరు. ఉన్నతాధికారులు విడుదల చేసే ప్రకటనలో వేల సంఖ్యలో బెడ్లు ఖాళీగా ఉన్నప్పుడు ఒక కరోనా బాధితుడు అడ్మిషన్‌ కోసం ఇంతయాతన పడాల్సిన అవసరం ఏమొచ్చిందో ఉన్నతాధికారులే సమాధానం ఇవ్వాలి.


ఆసుపత్రికో న్యాయం

నెల్లూరులోని కరోనా ఆసుపత్రుల్లో ఒక్కో దానికి ఒక్కో న్యాయం అమలవుతోంది. జీజీహెచ్‌కు వెళితే ఆక్సిజన్‌ బెడ్లు లేవు. ప్రైవేటు కోవిడ్‌ ఆసుపత్రుల్లో ట్రై చేసుకోండి అనే సమాధానం వస్తోంది. అక్కడికి వెళితే మా ఆసుపత్రిలో బెడ్లు లేవు.. వెళ్లండి! అనే సమాధానం వస్తోంది. దీంతో కరోనా బాధితులు అటు ఇటు తిరిగి ఇక ఎక్కడా అడ్మిషన్‌ దొరకదనే భయంతో వ్యాధిని తీవ్రం చేసుకొంటున్నారు. కొంతమంది భయానికే ప్రాణాలు వదిలేస్తున్నారు. అసలు జీజీహెచ్‌ వరకు వెళ్లిన పాజిటివ్‌ బాధితుడికి అక్కడ బెడ్లు లేవంటే ప్రైవేట్‌ కోవిడ్‌ ఆసుపత్రులకు పంపాల్సిన బాధ్యత అధికారులది. అయితే ఆ పని చేయడం లేదు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


నగరంలో రెండు కార్పోరేట్‌ ఆసుపత్రులను కోవిడ్‌ ఆసుపత్రులుగా ప్రకటించినా వాటికి బాధితులను రెఫర్‌ చేయడం లేదు. పాజిటివ్‌ కేసుల కండీషన్‌, జీజీహెచ్‌, నారాయణల్లో బెడ్ల లభ్యత ఆధారంగా అవసరమైన పాజిటివ్‌ కేసులను కార్పోరేట్‌ ఆసుపత్రులకు అధికారులు రెఫర్‌ చేయాలి. నెల్లూరు ఆసుపత్రికి(ప్రైవేట్‌) మాత్రం నోడల్‌ ఆఫీసర్‌ పాజిటివ్‌ కేసులను రెఫర్‌ చేస్తున్నారు. కానీ మిగిలిన రెండు కార్పోరేట్‌ ఆసుపత్రులకు మాత్రం రెఫర్‌ చేయడం లేదు. మీరే వెళ్లి ట్రై చేసుకోండి అని రోగులను పంపుతున్నారు. ఈ ఆసుపత్రులకు సామాన్యులు వెళితే గేటు బయటే బెడ్లు లేవని తిప్పి పంపుతున్నారు. ఎమ్మెల్యేల సిఫార్సులతో వచ్చిన కేసులను, లేదా అడిగినంత బిల్లులు చెల్లించే ధనికులకు మాత్రం ఈ ఆసుపత్రుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో రోజుకు 20వేల రూపాయలు బెడ్‌ చార్జి కింద వసూళ్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నిబంధనల ప్రకారం ఉచితంగా వైద్య సేవలు అందించాల్సిన ఈ ఆసుపత్రులు కరోనాతో వ్యాపారం చేసుకొంటుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో అంతుపట్టని ప్రశ్న.  


జీజీహెచ్‌లో ఏం జరుగుతోంది! 

రాష్ట్ర కోవిడ్‌ ఆసుపత్రి అయిన జీజీహెచ్‌లో అడ్మిషన్ల విషయంలోనే కాదు, చికిత్స విషయంలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆసుపత్రిలో రోజుకు ఒకసారి కూడా డాక్టర్‌ రోగిని పలకరించడం లేదని, రోగుల దరిదాపుల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. మొబైల్‌ ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత కారణంగా క్యాజువాలిటీ నుంచి వార్డుకు షిఫ్టు చేసేలోగానే ప్రాణాలు పోతున్నాయన్న విషయం తెలిసినా పట్టించుకునే వారు లేరు. కరోనా వైద్యంలో అతి కీలకపాత్ర పోషించే సిటీ స్కాన్‌ మిషన్‌ను బాగుచేసుకోవాలన్న ప్రయత్నం కూడా జరగలేదు. కరోనా సీజన్‌ మొదలైన నాటి నుంచి ఇప్పటికి నలుగురు సూపరింటెండెంట్లను మార్చారు కాని ఆసుపత్రి పనితీరు మెరుగుపడలేదు. మొన్నటికి మొన్న ఆసుపత్రిలో అడ్మిట్‌ అయిన ఇద్దరు జర్నలిస్టులు తమకు కనీస వైద్య సేవలు కూడా అందడం లేదని, అడ్మిషన్‌ అయి 24 గంటలు గడుస్తున్నా తమను పట్టించుకున్న వారు లేదని జర్నలిస్టుల గ్రూప్‌లో మెసేజ్‌ పెట్టారు.


జర్నలిస్టు సంఘాలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తే, ఆ తరువాత ఉన్నతాధికారుల జోక్యంతో ఆసుపత్రి వర్గాలు కదిలాయి. అంతో ఇంతో పలుకుబడి, పరిచయాలు ఉన్న వారి పరిస్థితే ఇలా ఉంటే జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అసలు జీజీహెచ్‌లో ఏం జరుగుతోంది, మెరుగైన సేవలు అందించడానికి ఏం అవసరం ఉంది. ప్రైవేట్‌ కోవిడ్‌ ఆసుపత్రుల్లో సామాన్యులకు ఎందుకు బెడ్లు అందుబాటులో లేవు.. అనే విషయాలపై ఆరా తీయాల్సి ఉంది. లేని పక్షంలో పరిస్థితి మరింత చేజారిపోయే ప్రమాదం ఉంది. 


నేడు మంత్రి నాని రాక

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గురువారం నెల్లూరుకు రానున్నారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షంచనున్నట్లు సమాచారం.


Updated Date - 2020-08-13T16:38:27+05:30 IST