విద్యాసంస్థలపై కరోనా పంజా!

ABN , First Publish Date - 2021-04-16T05:03:43+05:30 IST

పాఠశాలల్లో కరోనా నిబంధనలను మరిచారు. వైరస్‌ నిబంధనలపై అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయో లేదోనన్నది పట్టించుకోవడం లేదు.

విద్యాసంస్థలపై కరోనా పంజా!
వరికుంటపాడు ఉన్నత పాఠశాలలో అరకొర మాస్కులతో భౌతికదూరం పాటించని విద్యార్థులు

ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాజిటివ్‌లు

నిబంధనలు తుస్‌.. అవగాహనలేమి!

రోజువారి లెక్కలు సేకరిస్తున్న డీఈవో కార్యాలయం

మూతపడుతున్న ప్రభుత్వ స్కూళ్లు


మహమ్మారి కరోనా చాపకింద నీరులా జిల్లాను చుట్టేస్తోంది. ముఖ్యంగా  విద్యాసంస్థలను పట్టిపీడిస్తోంది. ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు వైరస్‌ బారిన పడుతుండటంతో జిల్లాలో పలు ప్రభుత్వ విద్యాసంస్థలను మూసేస్తున్నారు. స్కూళ్లకు ఎంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరవుతున్నారు!? ఎంతమందికి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు? వీరిలో ఎంతమందికి పాజిటివ్‌ వచ్చింది అన్న లెక్కలను డీఈవో కార్యాలయ సిబ్బంది ప్రతిరోజు లెక్కలు తీస్తున్నారు. ఇక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో కరోనా ఉందన్న విషయాన్నే అధికారులు మరచినట్టు ఉన్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో అసలు పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు విడుదల చేయడం అన్నది కనిపించడం లేదు. 


నెల్లూరు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి/స్టోన్‌హౌ్‌సపేట) : పాఠశాలల్లో కరోనా నిబంధనలను మరిచారు. వైరస్‌ నిబంధనలపై అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయో లేదోనన్నది పట్టించుకోవడం లేదు. జిల్లావ్యాప్తంగా పలు పాఠశాలలను ‘ఆంధ్రజ్యోతి’ బృందం గురువారం విజిట్‌ చేసింది. ఈ సందర్భంగా అక్కడ కరోనాను ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారన్నది స్పష్టంగా కనిపించింది. చాలా చోట్ల విద్యార్థులు మాస్కులు ధరించడం లేదు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు కూడా మాస్కులు లేకుండా పాఠాలు చెబుతున్నారు. దాదాపుగా అన్ని పాఠశాలల్లో భౌతికదూరం పాటించడం మరిచారు. విద్యార్థులంతా పక్క పక్కనే కూర్చుంటుండగా ఉపాధ్యాయులు కూడా అలానే పాఠాలు బోధిస్తున్నారు. విరామవేళల్లో బయట తిరిగేటప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఇక మరుగుదొడ్లలో శానిటైజేషన్‌కు సబ్బులు ఉంచాలని సూచించినా ఎక్కడా ఆ పరిస్థితి లేదు. పాఠశాలల్లో మొదట్లో శానిటైజేషన్‌ చేస్తుండగా ఇప్పుడు ఆ ఊసే మరిచారు. ఇలా నిర్లక్ష్యం వ్యవహరించడం మూలంగా ఇప్పటి వరకు జిల్లాలో 43 మంది ఉపాధ్యాయులు, 46 మంది  విద్యార్థులు వైరస్‌ బారిన పడ్డారు. ఇంతవరకు 2564 మంది ఉపాధ్యాయులకు, 9227 మంది విద్యార్థులకు కరోనా  నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొదట్లో పాఠశాలలో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ అయితే సెలవు ప్రకటించడంతో పాటు పాఠశాల మొత్తం శానిటైజేషన్‌ చేస్తుండగా ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించలేదు. తమ పాఠశాలలో ఎవరికైనా కరోనా సోకితే తమకు నిర్ధారణ పరీక్షలు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదని కొన్ని చోట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు చెబుతున్నారు. 


మూతపడుతున్న స్కూళ్లు

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో హాజరవుతున్న విద్యార్థులు, ఉపాఽధ్యాయుల సంఖ్య, వారికి నిర్వహించిన నిర్ధారణ పరీక్షలు, కరోనా బారిన పడ్డవారు ఎంతమంది? తదితర వివరాలను ప్రతి రోజు మండల విద్యా శాఖ అధికారులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి డీఈవో కార్యాలయానికి పంపుతున్నారు. ఇప్పటికే కరోనా కేసులు నమోదైన పాఠశాలలను వేసివేయగా, ఏ కళాశాలల్లోనూ కొవిడ్‌పై దృష్టి సారించలేదు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అలా ఉంటే ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులు చెల్లింపే లక్ష్యంగా బోధన సాగుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల హాజరు, కొవిడ్‌ సోకిన వివరాలను బయటకు చెప్పేందుకు ఏ విద్యాసంస్థలు ముందుకు రావడం లేదు. 


అమలుకాని నిబంధనలు

కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థుల భవిశ్యత్తు గురించి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించడం లేదని అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కరోనా రెండవ దశ విజృంభిస్తున్నా ఒకే గదిలో పదుల సంఖ్యలో విద్యార్థులు కూర్చోవడం, శ్యానిటేజర్లు ఏర్పాటు చేయడం వంటి కనీస జాగ్రత్తలపై దృష్టి సారించక పోవడంతో విద్యాసం్థల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి.


ఉదయగిరి రూరల్‌ : పట్టణంలోని బీసీ కాలనీ ప్రాథమిక, ఉర్దూ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను  ఆంధ్రజ్యోతి పరిశీలించింది. పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు కొండెక్కాయి. విద్యార్థులు అరకొరగా మాస్కులు ధరించినా భౌతికదూరం పాటించడంలేదు. గదులు తక్కువ, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ఇరుకుగదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. 

ఆత్మకూరు : పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 15 సెక్షన్లు ఉన్నాయి. దీంతో చెట్ల కిందే తరగతులు నిర్వహిస్తున్నారు. నీడ ఉన్నంతలో విద్యార్థులు ఇరకుగా కూర్చోవలసిన పరిస్థితి నెలకుంది. 

డక్కిలి : మండలంలోని పలు పాఠశాలల్లో కరోనా నిబంధనలు అసలు పాటించడం లేదు. ఎక్కువ పాఠశాలల్లో విద్యార్థులు గుంపులు గుంపులుగా కూర్చొని విద్యాభ్యాసం చేస్తున్నారు. శానిటైజరు అందుబాటులో వున్నా, దానిని వినియోగించడంపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 

గూడూరురూరల్‌ : గూడూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడా కరోనా నిబంధనలు పాటించడం లేదు. తరగతి గదులు, పాఠశాల ఆవరణను శానిటైజ్‌ చేయడం లేదు.  బుధవారం ఓ ఉపాధ్యాయుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యసిబ్బంది ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. 





Updated Date - 2021-04-16T05:03:43+05:30 IST