మాయని మచ్చ కోవిడ్

ABN , First Publish Date - 2020-08-26T05:51:52+05:30 IST

ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 ప్రభావం ఎంత లోతుగా ఉందన్న విష యం ఇప్పటికిప్పుడే అంచనా వేయడం కష్టమని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తేల్చిచెప్పింది...

మాయని మచ్చ కోవిడ్

  • ఆర్థిక నష్టాల ప్రభావం అంచనా కష్టమే
  • స్థిరమైన వృద్ధికి సంస్కరణలే ఆలంబన
  • ఆర్‌బీఐ వార్షిక నివేదిక

ముంబై: ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 ప్రభావం ఎంత లోతుగా ఉందన్న విష యం ఇప్పటికిప్పుడే అంచనా వేయడం కష్టమని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తేల్చిచెప్పింది. ఇప్పటికీ దాని పరిణామాలు విస్తరిస్తూనే ఉన్నాయని, ఈ పరిస్థితిలో పూర్తిస్థాయి ప్రభావాన్ని చెప్పలేమని వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రైవేటు వినియోగం సంక్షోభానికి ముందు కాలం నాటికి చేరడానికి కొంత ఎక్కువ సమయమే పట్టవచ్చని తేల్చిచెప్పింది. 


నివేదిక ముఖ్యాంశాలు

  1. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసుకుని స్థిరమైన వృద్ధి బాటలో పురోగమించాలంటే విస్తృతమైన సంస్కరణలు తప్పనిసరి. ఉత్పత్తి మార్కెట్లు, ఆర్థిక రంగం, చట్టవ్యవస్థలు అన్నింటిలోనూ లోతైన సంస్కరణలు చేపట్టాలి. పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవడం కూడా తప్పనిసరి
  2. వస్తు వినియోగం తీవ్రంగా పడిపోయినట్టు స్థూల డిమాండుపై చేసిన అధ్యయనాలు తేల్చిచెప్పాయి. ప్రజలు విచక్షణాపూర్వకమైన వ్యయాలను పూర్తిగా తగ్గించేశారు. రవాణా, ఆతిథ్య, రిక్రియేషన్‌ సేవలు, సాంస్కృతిక కార్యకలాపాలకు అవరోధం ఏర్పడడం కూడా వినియోగం భారీగా క్షీణించడానికి కారణం. రాబోయే కాలంలో ప్రభుత్వ వినియోగమే ఆర్థిక రికవరీకి ఆలంబన కానుంది. 
  3. కరోనా సంక్షోభ అనంతర రికవరీకి, 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం ఏర్పడిన రికవరీకి ఎలాంటి పోలికా ఉండదు. ఆర్థిక సంక్షోభ సమయంలో అంతర్జాతీయంగా ఆస్తుల విలువలే దిగజారాయి. కాని కొవిడ్‌ ఆరోగ్య సంక్షోభం కావడం వల్ల మానవాళి, ఆర్థిక రంగం పైన తీవ్ర ప్రభావాలుంటాయి. కొవిడ్‌ అనంతర కాలంలో ప్రపంచం మొత్తంలో అన్ని రంగాల్లోనూ సరికొత్త ధోరణులు ఏర్పడే ఆస్కారం ఉంది
  4. లాక్‌డౌన్‌ ఎత్తివేత అనంతరం మే, జూన్‌ నెలల్లో రికవరీకి సంబంధించిన ఆశలు చిగురించినా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కట్టుదిట్టమైన లాక్‌డౌన్లు తిరిగి ప్రారంభించడం వల్ల జూలై, ఆగస్టు నెలల్లో ఆ ఆశలు నీరుగారిపోయాయి. కార్మిక లభ్యత తగినంతగా లేదు. 
  5. కరోనా వ్యాప్తిని అదుపు చేయడం కోసం సుదీర్ఘకాలం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగుల రిట్రెంచ్‌మెంట్లు చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో ఉన్నట్టు అధ్యయనాలు తేల్చాయి. ఈ ఏడాది వేతనాల వృద్ధి కూడా నామమాత్రంగానే ఉండవచ్చు. కంపెనీల లాభదాయకత కూడా భారీగా తగ్గుతుంది. 


జీడీపీ ఇంకా దిగువకే 

జీడీపీ వరుసగా రెండో త్రైమాసికంలో కూడా ప్రతికూల వృద్ధినే నమోదు చేస్తుంది. ఆగస్టు ద్వితీయార్ధంలో కరోనా కేసులు పతాక స్థాయికి చేరుకోవడం వల్ల ఉత్పాదకత వ్యత్యాసం మైనస్‌ 12 శాతం వరకు ఉండవచ్చు. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నెలల్లో ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రారంభమై కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్య విధానానికి రిటైల్‌ ద్రవ్యోల్బణ ధోరణులనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి తోడు ప్రభుత్వ రుణ భారం, దాని ప్రభావం వల్ల ఏర్పడే అదనపు భారాలు అన్నీ కూడా పరిశీలించక తప్పదు.


మారటోరియం బ్యాంకులకు క్షేమం కాదు

దీర్ఘకాలం పాటు రుణాల మారటోరియం కొనసాగించడం, రుణపునర్‌ వ్యవస్థీకరణ వంటి చర్యలు బ్యాం కుల ఆర్థిక స్వస్థతను దెబ్బ తీస్తాయి. ఏ మాత్రం అలసత్వం లేకుండా సునిశిత పర్యవేక్షణలో న్యాయబద్ధమైన రీతిలో మాత్రమే అవి అమలుజరిగేలా చూడడం తప్పనిసరి. ఈ ఏడాది మార్చిలో మొండి బకాయిలు కాస్తంత తగ్గినట్టు కనిపించినా ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంయమన స్థితి ఎంతో కాలం కొనసాగకపోవచ్చు. జూలైలో నిర్వహించిన స్థూల ఆర్థిక ఒత్తిడి పరీక్షల సందర్భంగా మార్చితో పోల్చితే రాబోయే కాలంలో ఎన్‌పీఏల పరిమాణం 1.5 రెట్లు పెరగవచ్చని తేలింది. 

బ్యాంకులు ఆస్తుల నాణ్యతపరంగా ఎదుర్కొనే ఒత్తిడులను పరిగణనలోకి తీసుకుని వాటికి అదనపు మూలధనం అందించడం తప్పనిసరి. గతంలో సంక్షోభాలు నెలకొన్న సమయంలో ఏర్పడిన నష్టాలను పూడ్చేందుకు కల్పించిన మూలధన మద్దతును పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత సంక్షోభ కాలంలో అందించిన సహాయం ఏ మూలకూ సరిపోదు. 



2000 నోట్ల ముద్రణ నిలిపివేత 

గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ రూ.2000 కరెన్సీ నోట్లను ముద్రించలేదని, గత కొన్ని సంవత్సరాల కాలంలో ఈ నోట్ల చలామణి క్రమం గా తగ్గుతూ వస్తున్నదని ఆర్‌బీఐ వార్షిక నివేదికలో తెలిపింది. ఆ నివేదికలోని ముఖ్యాంశాలు...


  1. 2018 మార్చి నాటికి దేశంలో 33,632 లక్షల రూ.2000 నోట్లు చలామణిలో ఉండగా 2020 మార్చి నాటికి వాటి సంఖ్య 27,398 లక్షలకు దిగివచ్చింది 
  2. ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో ఈ నోట్ల పరిమాణం 3.3 శాతం మాత్రమే. విలువపరంగా చూసినా 2018 నాటికి మొత్తం కరెన్సీ విలువలో 37.3 శాతం ఉన్న ఈ నోట్ల వాటా 2020 మార్చి చివరి నాటికి 22.6 శాతానికి తగ్గింది 
  3. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌నోట్‌ ముద్రణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గానీ, సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ గానీ కొత్తగా 2000 కరెన్సీ నోట్ల ముద్రణకు 2019-20లో ఇండెంట్‌ జారీ చేయలేదు  
  4. గత మూడేళ్ల కాలంలో వ్యవస్థలో 500, 200 రూపాయల విలువ గల కరెన్సీ నోట్ల చలామణి గణనీయంగా పెంచడం జరిగింది. 1,463 కోట్ల కొత్త 500 కరెన్సీ నోట్ల ముద్రణ కోసం 2019-20లో ఆర్‌బీఐ ఇండెంట్‌ జారీ చేయగా 1,200 కోట్ల నోట్లు సరఫరా అయ్యాయి. అలాగే రూ.100 నోట్లు (330 కోట్ల పీస్‌లు), రూ.50 (240 కోట్ల పీస్‌లు), రూ.200 నోట్లు (205 కోట్ల పీస్‌లు), రూ.10 నోట్లు (147 కోట్ల పీస్‌లు), రూ.20 (125 కోట్ల పీస్‌లు) ముద్రణకు ఇండెంట్లు జారీ చేయడం జరిగింది. వాటిలో అధిక శాతం సరఫరా అయ్యాయి. 
  5. 2019-20 సంవత్సరంలో అన్ని విలువల కరెన్సీ నోట్లలోను కలిపి 2,96,695 నకిలీ నోట్లను గుర్తించారు. నకిలీ కరెన్సీ నోట్లను నిలువరించే లక్ష్యంలో వార్నిష్డ్‌ రూ.100 కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకున్నా కొవిడ్‌-19 కారణంగా ఏర్పడిన అంతరాయాల వల్ల వీటి ముద్రణ ప్రారంభం కాలేదు. 

Updated Date - 2020-08-26T05:51:52+05:30 IST