Abn logo
Nov 17 2020 @ 00:12AM

‘వినియోగ’ వైపరీత్యమే కొవిడ్

‘వినియోగ గరిష్ఠీకరణ’తో సంక్షేమం ఇతోధికమవుతుందనే సూత్రాన్ని ఆర్థిక వేత్తలు వదిలివేయాలి. సమాజ జీవితంలో మార్పును యావత్ దేశ ప్రజల సంక్షేమంలో పురోగతిపరంగా మదింపు చేయాలి. వాస్తవానికి మన స్థూల దేశియోత్పత్తి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరినప్పుడు దేశ ప్రజలకు సంక్షేమం తగ్గుతుందే గాని పెరగదు. 


మానవాళి అపరిమిత వినియోగ అవసరాలు, పరిమిత సహజ వనరుల మధ్య అసమతౌల్యత ఫలితమే కొవిడ్ మహమ్మారి. ఈ అసమతౌల్యతలకు కారణమేమిటి? ‘ప్రయోజనాల గరిష్ఠీకరణ’-... ఇదే ఆధునిక అర్థ శాస్త్ర మూల సూత్రం. వినియోగం ఎంత అధికంగా ఉంటే అంత ఎక్కువగా సమాజంలోని సకల వ్యక్తుల సంక్షేమానికి, సంతోషప్రద జీవనానికి స్వతస్సిద్ధంగా దోహదం చేకూరుతుందని ఈ మౌలిక ఆర్థిక స్రూతం ప్రవచిస్తుంది. ఉదాహరణకు 2025 సంవత్సరం నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ (1 ట్రిలియన్ = లక్షకోట్లు) డాలర్ల విలువైనదిగా అభివృద్ధిపరచుకోవడాన్ని ఒక ప్రధాన లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్దేశించుకున్నది. మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెరిగినప్పుడు దేశ పౌరుల తలసరి ఆదాయం కూడా అనివార్యంగా పెరుగుతుంది. జాతి సంపద సమృద్ధి, వ్యక్తిగత ఆదాయాల పెరుగుదల పౌరుల సంక్షేమాన్ని ఇతోధికం చేస్తుందని ‘ప్రయోజనాల గరిష్ఠీకరణ’ సూత్రం విశ్వసిస్తుంది. 


ఆర్థిక శాస్త్ర విద్యార్థికి ఆ సూత్రాన్ని ఇలా వివరిస్తారు: నీకు నిర్దిష్ట కేలరీల శక్తి అవసరం. అందుకు నీవు ఒక అరటి పండు తింటే ఆ అవసరంలో కొంత భాగం తీరుతుంది. రెండో అరటి పండు తింటే మరికొంత భాగం తీరుతుంది. మూడో అరటి పండు తింటే ఇంకొంత భాగం తీరుతుంది. బహుశా, నాలుగో అరటి పండు తినవలసిన అవసరముండబోదు. ఎందుకని? మూడు అరటి పండ్లతో అవసరమైన శక్తి సమకూరినందున అదనంగా మరో అరటి పండు తినవలసిన అవసరం లేదు. తిన్నప్పటికీ ప్రయోజనం శూన్యం. ఇలా ప్రతి వ్యక్తి తన అవసరాలు శూన్య ప్రయోజన స్థాయికి చేరేంతవరకు వినియోగాన్ని గరిష్ఠం చేసుకోవాలనేది దీని వెనుక ఉన్న భావన. మరింత స్పష్టంగా చెప్పాలంటే పొట్ట నిండిపోయి ఉన్న వ్యక్తి మరో అరటి పండును ఆస్వాదించడం వల్ల ప్రయోజనమేముంది? దానివల్ల ప్రతికూల ప్రయోజనం మాత్రమే సమకూరుతుంది. అయినప్పటికీ మీరు శూన్య ప్రయోజన స్థాయికి చేరుకునేలోగా మీరు భారీ వినియోగం చేస్తున్నారనేది ఒక కొట్టివేయలేని వాస్తవం. అయితే ఇలాంటి వినియోగ గరిష్ఠీకరణ అన్ని వస్తువుల విషయంలో సులభంగా జరగదు. ఒక వ్యక్తికి ఎన్నికార్లు కావాలి? ఎన్ని జతల బట్టలు కావాలి? ఒక కారు ఉంటే సరిపోతుంది. అయితే అతను మూడోకారు కూడా సమకూర్చుకుంటాడు. మరోకారును కూడా సమకూర్చుకున్నా అతను సానుకూల ప్రయోజనం పొందుతాడు. దీనికి పరిమితి ఉండదు. అలాగే బట్టల విషయం కూడా. వంద జతల బట్టలు ఉన్న ఆసామీ మరో జత బట్టలను సమకూర్చుకున్నా, ఇంకా సమకూర్చుకోవాలని తప్పక ఆకాంక్షిస్తాడు. అవి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా అతనికి సానుకూల ప్రయోజనాన్ని తప్పక కలిగిస్తాయి కదా. చెప్పవచ్చిన దేమిటంటే ఇలాంటి ప్రయోజనాలను గరిష్ఠంగా సమకూర్చుకునేందుకే మనం ప్రకృతి వనరులను అపరిమితంగా వినియోగించుకుంటున్నాం. సొంత దేశంలోని సహజ వనరులనే కాదు, సుదూర దేశాలలోని సహజవనరులనూ స్వాయత్తం చేసుకొంటున్నాం. కాలుష్యకారక వాయువులను పీల్చడం ద్వారా మన శ్వాస కోశాలను బలహీనపరచు కుంటున్నాం. అధిక వినియోగం అత్యధిక ఆనందాన్ని ఇస్తుందనే విశ్వాసంతో వస్తూత్పత్తిని అపరిమితం చేస్తూ మితిమీరి వినియోగం చేస్తున్నాం. తద్వారా సమాజంలో సామాజిక అసమానతలను సృష్టిస్తున్నాం. ఈ క్రమంలోనే మనకు తెలియకుండానే మనలను కరోనా విషక్రిమి ఆవహించింది. ఇది పూర్తిగా స్వయంకృతం. 


ప్రయోజన సూత్రం (ప్రిన్సిపుల్ ఆఫ్ యుటిలిటి) పై పునః వివేచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొవిడ్ మహమ్మారి పీడిస్తుందని కాదు, ఆ ఉపద్రవం లేకపోయినా ఆ ఆర్థిక నియమం ఎలాగూ మన సంక్షేమానికి దోహదం చేయడం లేదు కదా. ఒక సాధువు అతి తక్కువ వినియోగంతో అపరిమిత సంక్షేమాన్ని పొందుతాడని తాత్త్వికుడు–-ఆర్థికవేత్త అమర్త్యసేన్ అన్నారు. సంపన్నుల విషయం ఇందుకు పూర్తిగా విరుద్ధం. వారు మహాసౌధాలలో నివశిస్తుంటారు. మహా వ్యాధులతో బాధపడుతుంటారు. జీవనానందాన్ని స్వల్పంగా మాత్రమే వారు పొందుతుంటారు. ఈ వాస్తవం దృష్ట్యా తక్కువ వినియోగంతో అధిక సంక్షేమం ఖాయంగా పొందవచ్చు. అయితే అధిక వినియోగంతో సంక్షేమం తక్కువగా మాత్రమే ఉంటుంది. వాస్తవం ఇది కాగా అర్థ నీతిలో ఉత్పత్తి, వినియోగాల గరిష్ఠీకరణ సూత్ర ప్రాబల్యమే కొనసాగుతోంది. కొవిడ్ మొదలైన అనేక అరిష్ఠాలకు మాత్రమే ఈ సూత్రాచరణ దారితీస్తోంది. 


వ్యక్త మనస్సు లేదా చేతనాత్మక మనస్సును అవ్యక్త లేదా అచేతన మనస్సు లేదా అవ్యక్త ఆకాంక్షలతో మిళితం చేయడం వల్ల మనం ఆనందాన్ని పొందగలమని మనో వైజ్ఞానికుడు కార్ల్ యంగ్ అంటాడు. ఇది ప్రయోజన సూత్రానికి భిన్నమైనది. అమర్త్య సేన్ అన్నట్లు ఒక సాధువు స్వల్ప వినియోగంతో అమితానందం పొందుతాడు. ఎందుకంటే అతని అవ్యక్త ఆకాంక్ష వనాల్లోనూ, కొండ ప్రాంతాలలోనూ, నదీ తీరాల్లోనూ హాయిగా నడడం లేదా పరాత్పరుని కీర్తిస్తూ పాటలు పాడడమే. ఒక మహా సౌధంలో నివాస వసతి సమకూరినా ఆయనకు ఎటువంటి సంతోషం సమకూరదు. వినియోగం సంక్షేమాన్ని సమకూరుస్తుందనే సూత్రాన్ని ఆర్థికవేత్తలు వదిలివేయవలసిన అవసరం ఉంది. 


సంక్షేమ భావనను సరికొత్తగా నిర్వచించుకోవాలి. అవ్యక్త ఆకాంక్షలకు అనుగుణంగా వినియోగం జరిగినప్పుడే సంక్షేమం సిద్ధిస్తుందన్న సత్యాన్ని మనం గుర్తించాలి. గుర్తించడమేకాదు, అంగీకరించాలి. ఒక సాధువు అవ్యక్త ఆకాంక్ష ప్రకృతి ఒడిలో పవళించడమే అయితే అడవుల నరికివేతను నిలిపివేయడం ద్వారా అతనికి ఆ ఆనందాన్ని అధికం చేయగలుగుతాము. అడవులను కాపాడుకుని, మరింతగా పెంచుకున్నప్పుడు కొవిడ్ మొదలైన అరిష్ఠాలకు ఆస్కారముండదు. గంగానదిని స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ప్రవహింప చేయడం వల్లే షెహనాయి విద్వాంసుడు బిస్మిల్లాఖాన్‌కు మరింత సంక్షేమం సమకూరుతుంది. అయితే దీనివల్ల విద్యుత్ ధర అధికమవ్వడం అనివార్యం. ఫలితంగా పరిశ్రమల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుంది. ఆ భారం మళ్ళీ వినియోగదారులపైనే పడుతుంది. నదుల స్వేచ్ఛా ప్రవాహాలను జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులతో అరికట్టడం ద్వారా చౌక విద్యుత్ ను సరఫరా చేయడం సాధ్యమవుతుంది. చౌక కాగితాన్ని ఇతోధికంగా సరఫరా చేయడమూ సాధ్యమవుతుంది. చౌక విద్యుత్, చౌక కాగితం సమృద్ధిగా లభించడం కంటే నదులు స్వచ్ఛంగా ప్రవహించాలని కోరుకునే వారు తక్కువ సంఖ్యలో ఉంటారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇటువంటి వారి సంక్షేమానికీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముంది. ఏమైనా సమాజ జీవితంలో మార్పు రావాలి. ఈ మార్పును యావత్ దేశ ప్రజల సంక్షేమంలో పురోగతి పరంగా మదింపు చేయడం ప్రభుత్వ నైతిక బాధ్యత. మరి మన స్థూల దేశియోత్పత్తి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరినప్పటికీ మన దేశ ప్రజల సంక్షేమం తగ్గుతుందే గాని పెరగదని నేను గట్టిగా నమ్ముతున్నాను. 

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...