గుజరాత్‌లో కోవిడ్-19 తగ్గుముఖం, మరణాల రేటు ఆందోళనకరం

ABN , First Publish Date - 2020-06-07T20:36:03+05:30 IST

మహారాష్ట్ర, గుజరాత్‌లలో కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

గుజరాత్‌లో కోవిడ్-19 తగ్గుముఖం, మరణాల రేటు ఆందోళనకరం

అహ్మదాబాద్ : మహారాష్ట్ర, గుజరాత్‌లలో కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం గుజరాత్‌లో ఈ కేసులు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుతున్నాయి. 


ఏప్రిల్ రెండోవారంలో పరిస్థితిని చూసినపుడు, కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు 20 శాతానికిపైగా పెరుగుతూ ఉండేది. ప్రస్తుతం ఈ రేటు బాగా తగ్గుతోంది. దేశంలో ఈ కేసుల సంఖ్య అతి నెమ్మదిగా  పెరుగుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటిగా మారింది. 


మే 1నాటికి గుజరాత్‌లో 5,000 కేసులు దాటాయి. ప్రస్తుతం 19,617 కేసులు ఉన్నాయి. మే 1నాటికి ఢిల్లీ, తమిళనాడుల్లో ఈ కేసులు గుజరాత్‌లో  కన్నా తక్కువ ఉండేవి. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో గుజరాత్‌లో కేసుల కన్నా ఎక్కువ ఉన్నాయి. 


ఢిల్లీలో మే 1 నాటికి 3,738 కోవిడ్-19 పాజిటివ్ కేసులు ఉండగా, ప్రస్తుతం 27,654  కేసులు ఉన్నాయి. తమిళనాడులో 2,526 నుంచి 30,152కు చేరాయి. 


గుజరాత్‌లో 7 రోజుల్లో నమోదైన కొత్త కేసులను పరిశీలించినపుడు రోజుకు 2.6 శాతం చొప్పున కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు వెల్లడైంది. జాతీయ స్థాయిలో ఈ రేటు 4.33 అని వెల్లడైంది.


కోవిడ్-19 పాజిటివ్ కేసులు రెట్టింపు కావడాన్ని పరిశీలించినపుడు దేశవ్యాప్తంగా 16.61 రోజుల్లో రెట్టింపు అవుతున్నాయి, గుజరాత్‌లో 27 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. అంటే ఈ విధంగా చూసినా గుజరాత్‌ ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్లు వెల్లడవుతోంది. 


అయితే గుజరాత్‌లో రోజుకు 20 నుంచి 30 మంది వరకు ఈ వ్యాధి కారణంగా మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 


Updated Date - 2020-06-07T20:36:03+05:30 IST