పంచవ్యూహం

ABN , First Publish Date - 2021-06-18T05:11:07+05:30 IST

పంచవ్యూహం

పంచవ్యూహం

ఇక జిల్లాలో కేరళ తరహా కరోనా మేనేజ్‌మెంట్‌

పకడ్బందీగా అమలుకు కలెక్టర్‌ ఆదేశాలు

జిల్లాలో 981 గ్రామాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు 

9,800 బెడ్లను సమకూర్చటం ద్వారా ఆసుపత్రుల్లో రద్దీకి చెక్‌

ప్రతి ఇంటికీ వెళ్లి జ్వర సర్వే

పూర్తిస్థాయిలో శానిటేషన్‌, వ్యాక్సినేషన్‌

గ్రామాల్లో కరోనాను కట్టడి చేసేందుకు కమిటీలు.. ఎక్కడికక్కడ ఆసుపత్రి పడకలు.. జ్వరం వస్తే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు.. వ్యాక్సిన్‌పై సరికొత్త మార్గదర్శకాలు.. పరిశుభ్రతపై పకడ్బందీ ప్రణాళికలు.. ఆరోగ్య సంరక్షణకు నిత్య సూత్రాలు.. 

జిల్లాలో కొవిడ్‌ నియంత్రణకు అధికార యంత్రాంగం చేపడుతున్న వ్యూహాలివి. కేరళలో అవలంబించిన విధానాలతో కలెక్టర్‌ నివాస్‌ పంచవ్యూహాలకు శ్రీకారం చుట్టి యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ ఆపరేషన్‌కు తొలుత గ్రామీణ ప్రాంతాలనే ఎంచుకున్నారు. రెవెన్యూ, పంచాయతీ, వైద్యశాఖలు కీలకపాత్ర పోషించనుండగా, ప్రతి పంచాయతీలో కరోనా మేనేజ్‌మెంట్‌ను విధిగా అమలు చేయటానికి రూపొందించిన పంచవ్యూహాలివే..

- విజయవాడ, ఆంధ్రజ్యోతి


1.కరోనా కమిటీలు

ప్రతి పంచాయతీ పరిధిలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు కరోనా మేనేజ్‌మెంట్‌ చర్యలు చేపడతాయి. ఈ కమిటీకి సర్పంచ్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. గ్రామంలోని ఏఎన్‌ఎంలు, సచివాలయ ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు సభ్యులు. జిల్లావ్యాప్తంగా 981 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ల అఽధ్యక్షతన కొవిడ్‌  మేనేజ్‌మెంట్‌ కమిటీలు పనిచేస్తాయి. ఈ కమిటీల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పది పడకల కొవిడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సి  ఉంటుంది. ఇలా జిల్లావ్యాప్తంగా 981 గ్రామాల్లో పది పడకల కొవిడ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తే, మొత్తం 9,800 పడకలు అందుబాటులోకి వస్తాయి. గ్రామాల్లోనే కొవిడ్‌ వైద్య సేవలు అందించటం ద్వారా ఆసుపత్రులకు వెళ్లే అవకాశం తగ్గుతుంది. ప్రతి గ్రామంలోనూ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహించటానికి రూ.50వేలు ఖర్చవుతుంది. ఈ బడ్జెట్‌ను ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. పంచాయతీలు కూడా తమ నిధుల నుంచి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దగా లక్షణాలు లేని వారిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచే బాధ్యత ను ఈ కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చూసుకుంటుంది. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారు బయట తిరగకుండా ఉండే బాధ్యత కూడా వీరిదే. వారికి తగిన వైద్య సహాయం అందించాలి, మెడికల్‌ కిట్‌ ఇవ్వాలి, మరీ ఇబ్బందిగా ఉన్న వారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించాలి, పరిస్థితిని బట్టి అవసరమైతే ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించాలి. ఎండీవో, ఇతర మండల అధికారులు ఈ కమిటీలను పర్యవేక్షిస్తారు.

2.ఇంటింటి ఆరోగ్య సర్వే

గ్రామంలో ఇంటింటికీ వెళ్లి జ్వర  సర్వే నిర్వహించటం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ పర్యవేక్షణలో ఆశా వర్కర్ల ద్వారా ఈ సర్వే నిర్వహించటం, అనుమానితులను గుర్తించి  పరీక్షలు చేయించడం, ఆరోగ్య పరిస్థితులను బట్టి హోమ్‌ ఐసోలేషన్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలించడం చేయాలి. దీనికి మండల స్థాయిలో రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. తహసీల్దార్‌, ఇతర మండల అధికారులు కూడా సమీక్షిస్తుంటారు.

3. అందరికీ వ్యాక్సిన్‌

ఈ వ్యూహంలో అందరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం వయసులవారీగా మొదటి, రెండో డోసు పంపిణీకి చర్యలు తీసుకోవాలి. గ్రామంలో వయసులవారీగా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు? ఎంతమంది వ్యాక్సిన్‌ వేయించు కోలేదన్న వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ విషయంలో వార్డు వలంటీర్లు బాఽధ్యత తీసుకోవాలి.

4 పకడ్బందీగా పారిశుధ్య నిర్వహణ

ప్రతి గ్రామంలోనూ పారిశుధ్య నిర్వహణ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉంటుంది. వీధులను ఎప్పటి కప్పుడు శుభ్రపరచటం, బ్లీచింగ్‌ చల్లించటం వంటివి ఒక నెలలో నాలుగు వారాలు ఉంటాయి. ప్రతి వారంలో ఒకరోజు సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించాలి. మురుగు నిల్వ లేకుండా, వ్యర్థ పదార్థాలు కనిపించకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రక్షిత మంచినీటిని అందించేందుకు సహకరించాలి.

5. ఆరోగ్యంపై అవగాహన

కరోనాకు సంబంధించి గ్రామాల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వైరస్‌ వ్యాప్తి, తీవ్రత, పరీక్షలు, నిర్ధారణ, నివారణా చర్యలకు సంబంధించి గ్రామ ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగేలా చర్యలు తీసుకోవాలి. కొవిడ్‌ జాగ్రత్తలను ప్రజలు విధిగా తెలుసుకునేలా ఒక టాస్క్‌ఫోర్స్‌ నిరంతరం పనిచేయాలి. 

Updated Date - 2021-06-18T05:11:07+05:30 IST