కొవిడ్‌ కొత్త మందులు ఏ మేరకు?

ABN , First Publish Date - 2021-06-01T05:30:00+05:30 IST

కొవిడ్‌ నుంచి కోలుకోవాలని ఎవరు కోరుకోరు? బాధితులతో పాటు, సన్నిహితులందరూ కొవిడ్‌ నుంచి ఎలాగైనా గట్టెక్కాలని ఎంతో తాపత్రయపడతారు...

కొవిడ్‌ కొత్త మందులు ఏ మేరకు?

కొవిడ్‌ నుంచి కోలుకోవాలని ఎవరు కోరుకోరు? బాధితులతో పాటు, సన్నిహితులందరూ కొవిడ్‌ నుంచి ఎలాగైనా గట్టెక్కాలని ఎంతో తాపత్రయపడతారు. ఆ క్రమంలో తెలిసిన మందులన్నీ వాడేస్తారు. అయితే మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన కొవిడ్‌ కొత్త మందులను ఇష్టారాజ్యంగా వాడేయడం సరి కాదంటున్నారు వైద్యులు!


రెమిడెసివిర్‌, 2 డిజి, కాక్‌టెయిల్‌ యాంటీబాడీ థెరపీ... ఇలా కొవిడ్‌ చికిత్సకు సంబంధించి కొన్ని మందులు, చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ కొవిడ్‌ చికిత్సలో సమర్థమైన ఫలితాలను ఇచ్చేవే! అయితే వీటి వాడకానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. సరైన సమయంలో, సరైన కొవిడ్‌ బాధితులకు మాత్రమే అవి సమర్ధంగా ఉపయోగపడతాయి. అవసరమైన సమయంలో వాడినప్పుడే వీటితో ఫలితం దక్కుతుంది. కాబట్టి కొవిడ్‌ చికిత్స ఎవరికి వారు నిర్ణయించుకోకుండా, ఆ బాధ్యతను వైద్యులకు వదిలేయాలి. అలాగే మందుల విషయంలో వైద్యులను ఒత్తిడి చేయడం కూడా సరి కాదు. 


మోల్నుపిరావిర్‌

ఈ మందు అమెరికాలో ఇంకా ట్రయల్స్‌లోనే ఉంది. మూడవ దశలో చేపట్టిన ప్రయోగాల్లో ఈ మందుకు యాంటీవైరల్‌ గుణం ఉందని పరిశోధనల్లో తేలడంతో కొవిడ్‌కు కూడా దీన్ని వాడుకోవడం మొదలుపెట్టాం. ఇది ఫ్లూకి వాడే మందు లాంటిదే! కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన 24 నుంచి 48 గంటల్లో ఈ మందు ఇవ్వగలిగితే వైరస్‌ విభజనను అడ్డుకుంటుంది. దాంతో ఐదు నుంచి ఏడు రోజుల్లో పరీక్షిస్తే నెగటివ్‌ ఫలితం పొందే వీలుంటుంది. కాబట్టి మోల్నుపిరావిర్‌ను కేవలం కొవిడ్‌ సోకిన వెంటనే వాడుకోగలిగిన డ్రగ్‌గానే పరిగణించాలి. 


ఫావిపిరావిర్‌

ఇది కూడా మాల్నుపిరావిర్‌ లాంటిదే! అయితే మాల్నుపిరావిర్‌తో పోలిస్తే, దీని మోతాదు ఎక్కువ. ఈ మందు వాడడం మొదలుపెట్టిన 10 నుంచి 14వ రోజులకు కొవిడ్‌ నెగటివ్‌ ఫలితం వచ్చే వీలుంది. అయితే ఈ డ్రగ్‌ను కొవిడ్‌ సోకినా లక్షణాలు కనిపించని (అసింప్టమాటిక్‌), లేదా లక్షణాలు కనిపించిన (సింప్టమాటిక్‌) పాజిటివ్‌ రిపోర్ట్‌ పొందిన బాధితులకు ప్రారంభంలోనే వాడుకోవాలి. 800 మిల్లీగ్రాముల చొప్పున ఐదు రోజుల పాటు వాడవలసిన ఈ నోటి మాత్రకు దుష్ప్రభావాలు కూడా ఎక్కువే! కాలేయం, జీర్ణసంబంధ సమస్యలు తలెత్తే వీలుంటుంది. తలనొప్పి కూడా ఉండవచ్చు. 


కాక్‌టెయిల్‌ యాంటీబాడీ థెరపీ

ల్యాబ్‌లో తయారుచేసిన సింథటిక్‌ యాంటీబాడీలు ఇవి. కరోనా వైరస్‌ కణాలలోకి చేరుకునేలోపే ఈ రకం యాంటీబాడీలు ఎసి2 రిసెప్టర్లను బ్లాక్‌ చేస్తాయి. అయితే ఈ డ్రగ్‌ కూడా ఒక కోవకు చెందిన బాధితులకే మెరుగైన ఫలితాన్ని అందిస్తుంది. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమయ్యే అవకాశం ఉన్న హై రిస్క్‌ బాధితులకు మాత్రమే ఈ డ్రగ్‌ను వాడుకోవాలి. దుష్ప్రభావాలు లేని ఈ డ్రగ్‌ను పాజిటివ్‌ వచ్చిన ఎంత త్వరగా ఇస్తే అంత ఎక్కువ ఫలితం దక్కుతుంది. మూడు నుంచి నాలుగు లేదా ఏడు రోజుల లోపు ఈ డ్రగ్‌ను ఇవ్వవచ్చు. ఆక్సిజన్‌ అవసరం పడిన తర్వాత, లేదా ఆక్సిజన్‌ థెరపీలో ఉన్నప్పుడు ఈ డ్రగ్‌ను వాడకూడదు. వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉందని వైద్యులు ధృవీకరించిన సందర్భంలో మాత్రమే ఈ డ్రగ్‌ ఇస్తారు. అలాగే ఈ డ్రగ్‌కు 12 ఏళ్లకంటే పెద్ద వయస్కులై, కనీసం 40 కిలోల శరీర బరువు కలిగిన కొవిడ్‌ బాధితులే అర్హులు. 


ప్లాస్మా థెరపీ

మెరుగైన యాంటీబాడీలు కలిగి ఉన్న ప్లాస్మా థెరపీ అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే కొవిడ్‌ చికిత్సలో ప్లాస్మా అందించే సమయం, మోతాదులు ఎంతో కీలకం. ఆక్సిజన్‌ శాచురేషన్‌ 92ు కంటే తగ్గి, పరిస్థితి మరింత తీవ్రం కాని సమయంలోనే ప్లాస్మా ఇవ్వాలి. అలాగే  వెంటిలేటర్‌ మీద ఉన్న బాధితులకు కూడా పరిమిత మోతాదులో ఇవ్వవచ్చు.  


2 డిజి

డిఆక్సీగ్లూకోజ్‌ అనే ఈ మందు ముందు నుంచీ కేన్సర్‌ రోగుల్లో వాడుతున్నదే! ఈ మందుతో కేన్సర్‌ కణాల విభజన ఆగుతుంది. కణాల్లో కరోనా వైరస్‌ విభజనను కూడా ఈ డ్రగ్‌ అడ్డుకోగలుగుతుంది. అయితే ఈ డ్రగ్‌ ప్రభావం అందరిలోనూ ఒకేలా ఉండదు. ఈ డ్రగ్‌ స్వభావం గురించి, మరింత విస్తృత పరిశోధనలు జరపవలసి ఉంది. డిఆర్‌డిఒ శాస్త్రవేత్తలు అందించిన మార్గదర్శకాల ప్రకారం ఆక్సిజన్‌ అవసరం ఉన్నవారికి మాత్రమే (మోడరేట్‌, సివియర్‌) ఈ డ్రగ్‌ను వాడవలసి ఉంది. 


రెమిడెసివిర్‌

మధ్యస్త, తీవ్ర కొవిడ్‌ చికిత్సలో వాడకం కోసం ఎఫ్‌డిఎ అంగీకరించిన ఒకే ఒక యాంటీవైరల్‌ డ్రగ్‌ ఇది. అయితే దీన్ని కొవిడ్‌ దశను బట్టి వాడుకోవాలి. అటు తీవ్రమైన కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌లో, ఇటు స్వల్ప కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌లో ఈ మందు పని చేయదు. ఊపిరితిత్తుల్లో న్యుమోనియాతో కూడిన ప్యాచెస్‌ కనిపించినప్పుడు మాత్రమే దీన్ని వాడుకోవాలి. అప్పుడే ఫలితం కనిపిస్తుంది. 


ఫాబిఫ్లూ

దీన్ని కూడా కొవిడ్‌ సోకిన ప్రారంభంలోనే వాడుకోవాలి. స్వల్ప కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవాళ్లకు 14 రోజుల లోపు ఈ మందును వాడుకుంటే ఫలితం ఉంటుంది. దీనికి దుష్ప్రభావాలు ఎక్కువ.


మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇచ్చిన కాక్‌టెయిల్‌ యాంటీబాడీల మోతాదు 2400 మిల్లీగ్రాములు. ఈ డ్రగ్‌ను ఇంజక్షన్‌ రూపంలోనే ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత చేపట్టిన ప్రయోగాల ద్వారా దాన్లో సగం మోతాదుతో కొవిడ్‌తో సమర్ధంగా పోరాడడానికి తోడ్పడే మరో కాక్‌టెయిల్‌ డ్రగ్‌ను తయారుచేశారు. దీన్లోని యాంటీబాడీల మోతాదు 1200 మిల్లీగ్రాములు మాత్రమే. ఇప్పుడు కొవిడ్‌ చికిత్సలో వాడుతున్న కాక్‌టెయిల్‌ డ్రగ్‌ ఇదే!


-డాక్టర్‌ పి.నవనీత్‌ సాగర్‌ రెడ్డి

సీనియర్‌ పల్మనాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌.

Updated Date - 2021-06-01T05:30:00+05:30 IST