కొవిడ్‌ మెగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతం

ABN , First Publish Date - 2021-06-21T05:37:27+05:30 IST

కొవిడ్‌ మెగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం విజయవంతమైంది.

కొవిడ్‌ మెగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతం
వ్యాక్సిన్‌ కోసం వేచి ఉన్న జనం

మల్కాపురం, జూన్‌ 20 : కొవిడ్‌ మెగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం విజయవంతమైంది. ఈ ప్రాంతంలో ఉన్న 40, 58 నుంచి 63 వార్డులలో 31 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయానికి 150 డోసులు చొప్పున మొత్తం 31 కేంద్రాలకు 4650 డోసులను అధికారులు పంపారు. ఆయా కేంద్రాలకు ముందుగా ఎవరైతే వచ్చారో వారికి స్లిప్పులు ఇచ్చారు. అయితే ఉదయం 7 గంటలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కావలసి ఉండగా, వ్యాక్సిన్‌ ఆలస్యంగా రావడంతో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా మంది అంత సేపు వేచి ఉండలేక ఇళ్లకు వెళ్లిపోయారు. ములగాడ హౌసింగ్‌ కాలనీని ఆనుకుని ఉన్న జీవీఎంసీ సామాజిక భవనంలో రెండు సచివాలయాలకు కలిపి ఒకే చోట వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి ఒక ఏఎన్‌ఎం ఉండాల్సి ఉండగా, ఇక్కడ రెండు కేంద్రాలకు ఒకే ఒక్క ఏఎన్‌ఎం వ్యాక్సిన్‌ వేశారు. ఆశ వర్కర్‌ సహాయంతో ఇక్కడ వ్యాక్సినేషన్‌ కొనసాగించారు. పలు చోట్ల ఏఎన్‌ఎంల కొరత ఉండడంతో కలెక్టర్‌ చొరవ మేరకు ఆయా కేంద్రాలకు అదనపు సిబ్బందిని తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. 

జీవీఎంసీ ఆస్పత్రి వద్ద పడిగాపులు

శ్రీహరిపురం జీవీఎంసీ ఆస్పత్రిలో ఆదివారం వ్యాక్సిన్‌ వేయడం లేదని తెలియక ఉత్తర భారతదేశానికి చెందిన సుమారు రెండు వందల మంది ఉదయం ఏడు గంటలకే ఆ ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల వరకు అక్కడే ఉండడంతో ఇక్కడ వ్యాక్సిన్‌ వేయడం లేదని, సచివాలయాల్లో వేస్తున్నారని అధికారులు చెప్పడంతో వారంతా అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ ముందుగా స్లిప్పులు ఇవ్వడంతో కొందరికి వ్యాక్సిన్‌ వేయించుకునే అవకాశం దక్కలేదు. దీంతో వారు నిరాశ చెందారు.

గోపాలపట్నంలో..

గోపాలపట్నం: జీవీఎంసీ 89, 91, 92 వార్డుల్లోని సచివాలయాల్లో ఆదివారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. 91, 92 వార్డుల పరిధిలోని గోపాలపట్నం, పాతగోపాలపట్నం, వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో జరిగిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జీవీఎంసీ కో ఆప్షన్‌ మెంబర్‌ బెహరా భాస్కరరావు పరిశీలించారు. 89వ వార్డు కొత్తపాలెం, నాగేంద్రకాలనీ, చంద్రనగర్‌ ప్రాంతాల్లో జరిగిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వైసీపీ వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్‌ పరిశీలించారు. వ్యాక్సిన్‌ కోసం వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయా కేంద్రాల వద్ద జీవీఎంసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2021-06-21T05:37:27+05:30 IST