2 టీకాలూ వేసుకుంటేనే మాల్స్‌లోకి!

ABN , First Publish Date - 2021-12-04T06:32:27+05:30 IST

దేశంలోనే తొలిసారిగా బెంగళూరులో రెండు ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసులు బయటపడటంతో కర్ణాటకలో కొత్త నిబంధనలు విధించారు....

2 టీకాలూ వేసుకుంటేనే మాల్స్‌లోకి!

జనవరి 15 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలపై నిషేధం

‘ఒమైక్రాన్‌‘ కేసుల నేపథ్యంలో కర్ణాటకలో కొత్త నిబంధనలు


బెంగళూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలిసారిగా బెంగళూరులో రెండు ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసులు బయటపడటంతో కర్ణాటకలో కొత్త నిబంధనలు విధించారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వైద్య నిపుణులు, మంత్రులతో సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి ప్రకారం.. విదేశాల నుంచి వచ్చేవారికి నెగెటివ్‌ రిపోర్టు లేకుంటే బెంగళూరు, మంగళూరు నగరాల్లో ప్రవేశం ఉండదు. నివేదిక వచ్చిన తర్వాతే ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌, వ్యాక్సినేషన్‌తో పాటు కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి చేశారు. ప్రస్తుతానికి విద్యాసంస్థలు యథావిధిగా కొనసాగినా జనవరి 15 వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతరత్రా వేడుకలను నిషేధించారు. విద్యాసంస్థలకు వెళ్లే 18 ఏళ్ల లోపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా టీకా రెండు డోసులు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకునేలా తీర్మానించారు. సినిమాహాళ్లు, మాల్స్‌, రంగమందిరాలకు వెళ్లే వారికీ రెండు టీకాలు తప్పనిసరి చేశారు. నర్సింగ్‌ కళాశాలలతో పాటు 65 ఏళ్లు పైబడిన వారికి తప్పనిసరిగా అనుమానం వస్తే పరీక్షలు నిర్వహిస్తారు. ఇకపై రోజూ లక్షమందికి టెస్టులు చేయాలని నిర్ణయించారు. మా స్కు ధరింంచడం తప్పనిసరి చేయడంతో పాటు, ఉల్లంఘిస్తే బెంగళూరులో రూ.250, మిగిలిన ప్రాంతాల్లో రూ.వంద జరిమానా విధించనున్నారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. కొవిడ్‌ పరిస్థితిని పర్యవేక్షించేందుకు కంట్రోల్‌ రూంను ప్రారంభించనున్నారు.

Updated Date - 2021-12-04T06:32:27+05:30 IST