టెస్టులూ ఓ పరీక్షే

ABN , First Publish Date - 2022-01-20T08:12:54+05:30 IST

ఒమైక్రాన్‌ తీవ్రతతో రాష్ట్రంలో ప్రజలు కొవిడ్‌ పరీక్షలకు బారులు తీరుతున్నారు. సంక్రాంతి ముందు వరకు టెస్టింగ్‌ కేంద్రాల వద్ద పెద్దగా రద్దీ కనిపించలేదు. పండుగ తర్వాత..

టెస్టులూ ఓ పరీక్షే

కొవిడ్‌ నిర్ధారణకు బారులు తీరుతున్న ప్రజలు

 సంక్రాంతి తర్వాత పెరిగిన రద్దీ.. 4 రోజుల్లోనే రెట్టింపు

 రాష్ట్రంలో 3,614 కేసులు.. క్రితం రోజుకు 631 అధికం

 ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, శంకర్‌నాయక్‌, గండ్ర దంపతులకు కరోనా

 సింగరేణిలో ఒక్కరోజే 47 మందికి.. నేడు కేటీఆర్‌, హరీశ్‌రావు సమీక్ష


హైదరాబాద్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఒమైక్రాన్‌ తీవ్రతతో రాష్ట్రంలో ప్రజలు కొవిడ్‌ పరీక్షలకు బారులు తీరుతున్నారు. సంక్రాంతి ముందు వరకు టెస్టింగ్‌ కేంద్రాల వద్ద పెద్దగా రద్దీ కనిపించలేదు. పండుగ తర్వాత ఒక్కసారిగా పెరిగినట్లు క్షేత్ర స్థాయి వైద్యసిబ్బంది చెబుతున్నారు. లక్షణాలున్నవారితో పాటు అనుమానితులు, కాంటాక్టులు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో పరీక్షలకు వస్తున్నారని పేర్కొంటున్నారు. ప్రభుత్వ కేంద్రాల వద్దనే కాక ప్రైవేటు ల్యాబ్‌ల వద్ద కూడా రద్దీ పెరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో పీహెచ్‌సీల్లో రోజంతా కలిపినా యాంటీ జెన్‌పరీక్షలు 20-30కి మించేవి కావు. ఇప్పుడు గ్రామీణ ప్రాంత పీహెచ్‌సీల్లోనే రోజూ వందకుపైగా చేస్తున్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది.


రంగారెడ్డి జిల్లాల్లో రోజూ 3 వేల యాంటీజెన్‌ టెస్టులు చేయాలని వైద్య శాఖ లక్ష్యం విధించింది. కానీ 5,200 పరీక్షలు నిర్వహించినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఇందులో వెయ్యి పాజిటివ్‌లు నమోదైనట్లు వెల్లడించారు. అంటే వ్యాప్తి రేటు 20 శాతంగా ఉంది. ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో పండుగ మందు వరకు ఆర్టీపీసీఆర్‌ టెస్టుకు రోజూ 100 మంది వచ్చేవారని, బుధవారం ఏకంగా 680 మంది వచ్చారని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీరిలో 362 మందికి పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. ఐసీఎంఆర్‌ ఇటీవలి మార్గదర్శకాల్లో.. వయసు, దీర్ఘకాల వ్యాధుల రీత్యా ముప్పు ఎక్కువగా ఉన్నవారు కాకుంటే, లక్షణాలు లేనివారికి, కాంటాక్టులకు పరీక్షలు అవసరం లేదని పేర్కొంది. రాష్ట్ర వైద్య శాఖ కూడా ఇలానే చేస్తామని అంటోంది. క్షేత్ర స్థాయిలో మాత్రం లక్షణాలు లేనివారు టెస్టులకు వచ్చి, వరుసలో నిల్చుని పరీక్ష చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. వారిని వెనక్కు పంపలేకపోతున్నామని వైద్య సిబ్బంది చెబుతున్నారు. దీంతో కొన్ని కేంద్రాల వద్ద వాగ్వాదం  చోటుచేసుకుంటోంది. సెకండ్‌ వేవ్‌లో పాజిటివ్‌ వస్తే, కాంటాక్టుల జాబితాను కచ్చితంగా తీసుకునేవారు. ప్రధానంగా పీహెచ్‌సీల్లోని వైద్యులు కాంటాక్టుల జాబితాను తీసుకుని వారందరికీ టెస్టులు చేసేవారు. కాంటాక్టుల వివరాలను చెప్పేవరకు వదిలిపెట్టేవారు కాదు. ప్రస్తుతం వివరాలను తీసుకోవడం లేదు. కాంటాక్టులకు పరీక్షలే చేయడం లేదు.


3 వేలు దాటిన కొత్త కేసులు

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు భారీగా పెరిగాయి. వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ ప్రకారం బుధవారం 1,11,178 మందికి పరీక్షలు చేయగా 3,614 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగిన సమయంలో.. నిరుడు మే 27న ఈ స్థాయిలో పాజిటివ్‌లు నమోదయ్యాయి. థర్డ్‌ వేవ్‌లో తొలిసారిగా 3 వేలు దాటాయి. వైర్‌సతో మరో ముగ్గురు మృతిచెందారు. తాజా కేసుల్లో హైదరాబాద్‌లోనే 1,474 నమోదయ్యాయి.  బుధవారం 2.71 లక్షల మందికి టీకా ఇచ్చారు. 1.91 లక్షల రెండో డోసు, 12,790 మంది ముందుజాగ్రత్త డోసు పొందారు.


మంత్రుల పర్యటనలో పాల్గొన్న ఎమ్మెల్యేలకు..

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, ఆయన భార్య, వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ జ్యోతి కరోనా బారినపడ్డారు. మంగళ వారం జిల్లాలో పంట నష్టం పరిశీలనకు వచ్చిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లితో కలిసి వీరు పర్యటనలో పాల్గొన్నారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌కూ పాజిటివ్‌ వచ్చింది. ఈయన సైతం మంత్రుల పర్యటనలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు రెండు రోజుల కిందట వైర్‌సకు గురయ్యారు. పలువురు నేతలు, సిబ్బందికీ పాజిటివ్‌ రావడంతో.. గాంధీభవన్‌లో శానిటైజేషన్‌ చేపట్టారు. భూపాలపల్లి జిల్లా సింగరేణిలో బుధవారం ఒక్క రోజే 47 మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. రుద్రంపూర్‌ ఏరియాలో కార్మికులు పెద్దఎత్తున కరోనా ప్రభావానికి గురవుతున్నారు. ఉస్మానియా   వీసీ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ యాదవ్‌కు కరోనా నిర్ధారణ అయింది.


నేడు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ సమీక్ష

రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలపై గురువారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు, మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సంయుక్తంగా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి కూడా సమావేశంలో పాల్గొంటారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సహా ఆయా శాఖల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జేసీలు, జిల్లాల వైద్యాధికారులు హాజరు కానున్నారు.

Updated Date - 2022-01-20T08:12:54+05:30 IST