Abn logo
May 13 2021 @ 00:56AM

చికిత్స కోసం వచ్చిన వృద్ధురాలి అదృశ్యం

శ్రీకాళహస్తి, మే 12: కొవిడ్‌ బాధితురాలు అదృశ్యమైన సంఘటన శ్రీకాళహస్తిలో బుధవారం జరిగింది. బాధితురాలి కుటుంబీకుల కథనం మేరకు... శ్రీకాళహస్తి పట్టణం బాలాజీ కాలనీకి చెందిన సుబ్బమ్మ(70) కరోనా బారినపడ్డారు. దీంతో ఈనెల 9న కుటుంబసభ్యులు ఆమెను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఐసోలేషన్‌ వార్డులో ఉన్న వృద్ధురాలికి మరుసటి రోజు ఆహారం కూడా అందజేసి వచ్చారు. పలు కారణాలతో మంగళవారం ఆస్పత్రికి వెళ్లలేక పోయారు. ఈ నేపథ్యంలో బుధవారం సుబ్బమ్మను పరామర్శించేందుకు వెళ్లగా ఆమె కన్పించలేదు. వైద్య సిబ్బందితో ఆరాతీయగా సరైన సమాధానం లభించలేదు. దీంతో సాయంత్రం వరకు సమీపప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. కాగా, వృద్ధురాలి అదృశ్యం ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సుబ్బమ్మ కుటుంబీకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement