Covid బాధితులకు అంబులెన్స్‌ సేవలు

ABN , First Publish Date - 2022-01-07T17:19:19+05:30 IST

నగరంలో కరోనా బాధితులను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించే నిమిత్తం 42 కొత్త అంబులెన్స్‌ వాహనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. సచివాలయం వద్ద గురువారం ఉదయం ఏర్పాటైన కార్యక్రమంలో నగరపాలక, నీటి

Covid బాధితులకు అంబులెన్స్‌ సేవలు

                            - ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై: నగరంలో కరోనా బాధితులను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించే నిమిత్తం 42 కొత్త అంబులెన్స్‌ వాహనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. సచివాలయం వద్ద గురువారం ఉదయం ఏర్పాటైన కార్యక్రమంలో నగరపాలక, నీటి పంపిణీ శాఖ ఆధ్వర్యంలో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో కొవిడ్‌ బాధితుల కోసం ఈ అంబులెన్స్‌ సేవలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌ల్లో డ్రైవర్‌, ఓ ఆరోగ్య కార్యకర్త పీపీఈ కిట్‌ ధరించి విధుల్లో పాల్గొంటారు. కొవిడ్‌ బాధితుల ఇళ్లకే వెళ్ళి వారిని ఆరోగ్య పరీక్షా కేంద్రాలకు, పరీక్ష పూర్తయిన తర్వాత చికిత్సా కేంద్రాలకు లేదా ఆస్పత్రులకు తీసుకెళ్తారు. ఈ అంబులెన్స్‌ వాహన సేవల కోసం కొవిడ్‌ బాధితులు 1913 అనే టోల్‌ఫ్రీ, 044-25384520 నెంబర్లకు ఫోన్‌ చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. తిరువొత్తియూరు, తండయార్‌పేట, రాయపురం, తిరువికనగర్‌, అంబత్తూరు, అన్నానగర్‌, తేనాంపేట, కోడంబాక్కం, వలసరవాక్కం, ఆలందూరు, అడయారు, పెరుంగుడి జోన్లకు తలా మూడు అంబులెన్స్‌లు, మనలి, మాధవరం, చోళింగనల్లూరు జోన్లకు తలా రెండు అంబులెన్స్‌ వాహనాలు కేటాయించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పొన్ముడి, ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, ఎమ్మెల్యే ఏఎంవీ ప్రభాకర్‌ రాజా, నగరపాలక, నీటి పంపిణీ శాఖల అదనపు ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జే. రాధాకృష్ణన్‌, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్ సింగ్‌ బేదీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-07T17:19:19+05:30 IST