కరోనా బాధితుల ఇళ్లు సీల్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-08-01T17:16:21+05:30 IST

కేరళ, మహారాష్ట్రలో కొవిడ్‌ కేసుల సంఖ్య అధికమవుతున్న తరుణంలో మూడో విడత వైరస్‌ ప్రబలుతుందనే భయం వెంటాడుతోంది. దీంతో బెంగళూరు నగర పరిధిలో బాధితుల ఇ

కరోనా బాధితుల ఇళ్లు సీల్‌డౌన్‌

 బెంగళూరు: కేరళ, మహారాష్ట్రలో కొవిడ్‌ కేసుల సంఖ్య అధికమవుతున్న తరుణంలో మూడో విడత వైరస్‌ ప్రబలుతుందనే భయం వెంటాడుతోంది. దీంతో బెంగళూరు నగర పరిధిలో బాధితుల ఇళ్లకు సీల్‌డౌన్‌ చేస్తున్నారు. ఎక్కువ కేసులు నమోదయ్యే ప్రాంతాలను మైక్రో కంటైన్‌మెంట్‌ కేంద్రాలుగా గుర్తించారు. కొవిడ్‌ బాధితుల ఇళ్లు లేదా గోడలకు రెడ్‌అలర్ట్‌ పోస్టర్‌ను అంటిస్తున్నారు. కొవిడ్‌ సోకిన ప్రాంతాలలో ఇతరుల ప్రవేశాన్ని నిషేధించినట్టు అందులో పొందుపరుస్తారు. వైరస్‌ సోకినవారు 14 రోజులపాటు బయటకు రాకుండా వారి ఇళ్లకు ఎవరూ వెళ్లకుండా నిర్బంధిస్తారు. తొలి విడత కొవిడ్‌ కాలంలో వైరస్‌ ప్రబలితే ఆ ప్రాంతాన్ని సీల్‌డౌన్‌ చేసేవారు. ఆ తర్వాత బాధితుల ఇళ్లను మాత్రమే పరిమితం చేశారు. రెండోవిడతలో కొంతమేర నిబంధనలు సడలించారు. ప్రస్తుతం మూడో విడత నేపథ్యంలో పటిష్టంగా అమలు చేయదలిచారు. వైరస్‌ సోకిన వారి ఇంటి నుంచి వందమీటర్ల పరిధిలో నివసించే వారందరికీ కొవిడ్‌ టెస్టులు చేస్తారు. రోగలక్షణాలు ఉంటే క్వారంటైన్‌ అమలు చేస్తారు. యలహంక డివిజన్‌ పరిధిలోని కువెంపు నగర వార్డు సింగాపుర, శ్రీనిధిలే అవుట్‌, సోమణ్ణలే అవుట్‌లో టెస్టింగ్‌లు జరపగా 20 మందికి శుక్రవారం పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ముగ్గురు అంతకంటే ఎక్కువ మందికి వైరస్‌ సోకితే మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌గా గుర్తిస్తారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సీల్‌డౌన్‌ చేస్తున్నారు. ఐదుగురి కంటే ఎక్కువ ఉండే వైరస్‌ బాధితులను గుర్తిస్తే క్లస్టర్‌గా ప్రకటించదలిచారు. 

Updated Date - 2021-08-01T17:16:21+05:30 IST