ఆసుపత్రిలో చేరికకు కోవిడ్ రిపోర్ట్ అక్కర్లేదు : కేంద్రం

ABN , First Publish Date - 2021-05-08T21:33:10+05:30 IST

ఆసుపత్రుల్లో కోవిడ్-19 సంబంధిత వైద్య సేవలను పొందడానికి రోగులకు ఆ

ఆసుపత్రిలో చేరికకు కోవిడ్ రిపోర్ట్ అక్కర్లేదు : కేంద్రం

న్యూఢిల్లీ : ఆసుపత్రుల్లో కోవిడ్-19 సంబంధిత వైద్య సేవలను పొందడానికి రోగులకు ఆ వ్యాధి పాజిటివ్ అని తెలిపే నివేదిక అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  కోవిడ్ రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకుని, చికిత్స అందజేయడానికి సంబంధించిన మార్గదర్శకాలను సవరించినట్లు పేర్కొంది. ఏదైనా కారణాన్ని చూపుతూ రోగులకు వైద్య సేవలను నిరాకరించరాదని తెలిపింది. ఆక్సిజన్, అత్యవసర మందులు వంటివాటితో సహా అన్ని వైద్య సేవలను రోగులకు అందజేయాలని పేర్కొంది. రోగి వేరొక నగరానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ వైద్య సేవలను నిరాకరించరాదని శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 


ఏ వ్యక్తికైనా కోవిడ్-19 సోకినట్లు అనుమానం వచ్చినపుడు, ఆ వ్యక్తిని కోవిడ్-19 కేర్ సెంటర్ లేదా డెడికేటెడ్ కోవిడ్-19 హెల్త్ సెంటర్, లేదా డెడికేటెడ్ కోవిడ్-19 ఆసుపత్రిలో అనుమానితుల వార్డులో ఉంచాలని తెలిపింది. రోగులను చేర్చుకోవడానికి చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డులను ఆసుపత్రులు అడగకూడదని పేర్కొంది. అవసరం ప్రాతిపదికపైనే ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకోవాలని స్పష్టం చేసింది. ఆసుపత్రిలో వైద్య సేవలు పొందవలసిన అవసరం లేనివారు పడకలను ఆక్రమించుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వర్తిస్తాయని వివరించింది. కోవిడ్-19తో బాధపడే రోగులకు సకాలంలో, సమర్థవంతంగా, సమగ్ర చికిత్స అందించేందుకు వీలుగా ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపింది. 


దీనికి సంబంధించిన ఆదేశాలు, సర్క్యులర్లను మూడు రోజుల్లోగా జారీ చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. 


Updated Date - 2021-05-08T21:33:10+05:30 IST