దాచేస్తే..దాగవులే!

ABN , First Publish Date - 2021-12-09T06:47:18+05:30 IST

జిల్లాను కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కుదిపేసింది. లక్షలాది పాజిటివ్‌లు.. వేలాది మరణాలతో చిగురుటాకులా వణికించేసింది.

దాచేస్తే..దాగవులే!

     కొవిడ్‌ మృతులకిచ్చే ఆర్థిక సాయం కోసం
 వెల్లువెత్తుతున్న వేలాది దరఖాస్తులు

జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 3,600 మంది
ఆధారాలతో విజ్ఞప్తులు అందజేత

 జిల్లాలో కొవిడ్‌తో చనిపోయిన వాళ్లు
     1,290 మంది మాత్రమే అంటున్న సర్కారు

      
(కాకినాడ-ఆంధ్రజ్యోతి) జిల్లాను కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కుదిపేసింది. లక్షలాది  పాజిటివ్‌లు.. వేలాది మరణాలతో చిగురుటాకులా  వణికించేసింది. ప్రాణవాయువు సకాలంలో అందక ఆసుపత్రుల లోపల, బయట కన్నుమూసిన వారి సంఖ్యకు లెక్కేలేదు. చికిత్స దశకు వెళ్లకుండానే చనిపోయిన వారి సంఖ్య దేవుడికే ఎరుక. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఏడాది ఏప్రిల్‌, మే, జూన్‌ ఆరంభం వరకు కేసుల తీవ్రత రాష్ట్రంలో ఎక్కడా లేనంత దారుణంగా ఉంది. నిత్యం వందలాది చితులు స్మశానవాటికల్లో నిరంతరం కాలాయి. అయితే ఈ మరణాల సంఖ్యను ఎక్కడికక్కడ రాష్ట్రప్రభుత్వం దాచేసింది. దొంగ లెక్కలతో కొవిడ్‌ మరణ మృదంగ తీవ్రతను బయటకు రాకుండా కప్పిపుచ్చింది. అంతేకాదు ఇప్పటికీ కొవిడ్‌ బులిటెన్‌లో 1,290 మరణాలే అంటూ తప్పుడు            లెక్కలు కొనసాగిస్తూ మభ్యపెడుతోంది. అయితే ఇప్పుడీ చావులెక్కల బండారం బయట పడింది. కొవిడ్‌ మృతులకు ఇచ్చే ఆర్థిక సాయం కోసం ఆధారాలతోసహా వచ్చిన 3,600 అర్జీలు అసలు లెక్కలు బయట పెట్టాయి. ప్రభుత్వం చెబుతున్న మరణాల లెక్కలన్నీ బొంకేనని చాటాయి.ఈ ఏడాది మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో జిల్లాను కొవిడ్‌ కకావికలం చేసేసింది. రోజుకు మూడు వేలకుపైగా పాజిటివ్‌ కేసులు పుట్టుకొచ్చి పల్లె, పట్టణం తేడా లేకుండా మహమ్మారి అతలాకుతలం చేసింది. ఫలితంగా లక్షలాది మంది ఆసుపత్రుల పాలయ్యారు. వేలాది మంది చని పోయారు. ఆసుపత్రుల్లో పడకలు లభించక, ప్రాణవాయువు దొరక్క చనిపోయినవారి సంఖ్యకు లెక్కే లేదు. ఒక్క మే నెలలోనే వారం వ్యవధిలో నాలుగు ఆసుపత్రుల్లో 470 మంది కన్నుమూశారు. ఇందులో జీజీహెచ్‌లో 250 మంది వారం వ్య వధిలో చనిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే సెకండ్‌ వేవ్‌లో ఒక్క జీజీహెచ్‌లోనే 1,150 మంది వరకు చనిపోయారు. ఒక్కో సారి రోజుకు జిల్లాలో మరణించిన కొవిడ్‌ మృతులు అరవై అయిదు పైనే దాటేవి. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో మరణాల సంఖ్య అంతా గోప్యంగానే ఉంచేవారు. అప్పట్లో కాకినాడ రూరల్‌లోని తూరంగి స్మశానవాటికలోనే రోజుకు 30 చితులు కాలేవి. రాజమహేంద్రవరం కైలాసభూమిలో నిత్యం అంతకుమించి ఎక్కువ చితులు కాలేవి. ఒకరకంగా మృతుల సంఖ్య వేలల్లో ఉండేవి. అయితే ఇంత ఘోరం జరిగినా రాష్ట్రప్రభు త్వం మాత్రం తన వైఫల్యాలు బయట పడకుండా రోజువారీ మృతుల్లో 30 శాతం కూడా చూపేది కాదు. వేల మరణాలను దాచేసి ఎప్పటికప్పుడు కొవిడ్‌ బులిటెన్‌ల్లో మాత్రం తప్పులు లెక్కలు కొనసాగిస్తూ వస్తోంది. చివరకు బుధవారం నాటికి జిల్లాలో చనిపోయిన కొవిడ్‌ మృతుల సంఖ్య 1,290గా బులిటెన్‌లో పేర్కొంది. అయితే ఈ లెక్కలన్నీ అబద్దాలేనని తాజాగా కొవిడ్‌ మృతుల సాయం కోసం వచ్చిన దరఖాస్తులు బండా రం బయటపెట్టాయి. కుటుంబంలో కొవిడ్‌తో ఎవరైనా వ్యక్తి మరణిస్తే ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. దీంతో గత నెల నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి వేలాదిమంది ప్రభుత్వ సాయం కోసం అర్జీలతో బారు లు తీరుతున్నారు. ఇప్పటివరకు 3,600 దరఖాస్తులొచ్చాయి. ఇందులో అత్యధికంగా కోనసీమ, కాకినాడ డివిజన్ల నుంచే ఉన్నాయి. వీరంతా తమ కుటుంబంలో వ్యక్తి కొవిడ్‌తో ఎప్పుడు.. ఎలా చనిపోయింది ఆధారాలతోసహా దరఖాస్తు చేశారు. దీన్ని బట్టి ఇంతకాలం కొవిడ్‌ మృతుల విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ అబద్దాలేనని తేలిపోయిం ది. కేవలం 1,290 మంది మాత్రమే కొవిడ్‌తో చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటిస్తే 3,600 మంది మృతుల తాలూకూ లెక్క లు ఆధారాలతో సహా రావడం దొంగ లెక్కలను బయటపెట్టింది. ఇదిలాఉంటే కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో మరణాలపై సర్వత్రా భయాందోళనలు పెరిగాయి. అయితే పాలనా వైఫల్యం బయటపడకుండా మృతుల సంఖ్యను ప్రభుత్వం అడ్డంగా దాచేయగా ఇప్పుడు ఇవన్నీ నిజాలుగా తేలాయి. ఇదిలాఉంటే కొవిడ్‌ సోకి 30 రోజుల లోపు చనిపోయిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే ప్రభుత్వ నిబంధనతో అనేకమంది అనర్హతగా మారారు. ప్రభుత్వం విధించిన షరతుల మేరకు ఆధారాల్లేక ఇంకొంత మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. లేదంటే ఈ లెక్కలు మరింత పెరిగేవి. కాగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు 1,650 అర్జీలు సక్రమమేనని ఇప్పటివరకు తేల్చారు. అయితే అర్హత సాధించిన వారికి రూ.50 వేల సా యం ఎప్పుడు అందుతుందో ప్రశ్నార్థకంగా ఉంది. కొవిడ్‌తో తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులకు ఇస్తామన్న రూ.10 లక్షల సాయం ఇంకా నలభై శాతం మందికి అంద లేదు. తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలకు ఇస్తామ న్న సాయం ఇంకా సీఎఫ్‌ఎంఎస్‌లోనే మూలుగుతోంది.

Updated Date - 2021-12-09T06:47:18+05:30 IST