కాళ్ల మండలంలో మృత్యుహేల

ABN , First Publish Date - 2021-05-04T05:07:40+05:30 IST

కరోనా రెండో దశ మండలాన్ని చుట్టుముట్టింది.. రోజురోజుకి పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

కాళ్ల మండలంలో మృత్యుహేల
ఏలూరుపాడులో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న బాధితుడితో మాట్లాడుతున్న డాక్టర్‌ రాజ్‌కుమార్‌

అంతకంతకూ పెరుగుతున్న మృతులు

భయాందోళనలో పలు గ్రామాల ప్రజలు

కాళ్ళ, మే 3 :  కరోనా రెండో దశ మండలాన్ని చుట్టుముట్టింది.. రోజురోజుకి పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా రెండో దశ ప్రారంభమైన నాటి నుంచి గ్రామాల్లో వరుస మరణాలు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో మండలంలో సుమారు 25 నుంచి 30 మంది వరకు చనిపోయారు. ఏలూరుపాడులో అత్యధికంగా సుమారు 14 వరకు మ రణాలు సంభవించాయని గ్రామస్థులు చెబుతున్నారు. సీసలి, కోపల్లె, కాళ్ళ, పెదఅమిరం, బొండాడ, కాళ్ళకూరు, జువ్వలపాలెం, కోలనపల్లి గ్రామాల్లో పలువురు కొవిడ్‌తో మరణించినట్లు సమాచారం. దీనిపై పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ గులాబ్‌రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా చనిపోయిన వ్యక్తులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవడం వల్ల తాము అధికారికంగా ధ్రువీకరించలేమని చెప్పారు. ముందస్తు చర్యగా సంబంధిత గ్రామా ల్లో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సిబ్బందితో సర్వే చేయిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 38 కేసులతో పాటు సోమవారం మరో 7 కేసులు నమోదు కావడంతో మండలం మొత్తం మీద 45 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు స్పష్టం చేశారు. అధికారులు 45 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఉన్నాయని చెబుతున్నా.. అనధికారికంగా 150 నుంచి 200 వరకు కేసులు ఉన్నట్టు బహిరంగ సమా చారం. ఇటీవల కాలంలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో  ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను వైద్య సిబ్బంది గుర్తించినా ర్యాపిడ్‌ కిట్లు అందుబాటులో లేకపోవడంతో టెస్టులు చేయడానికి వీల్లేకుండా పోతోందని పలువురు వైద్య సిబ్బందే బాహాటంగా చెబుతున్నా రు. ప్రభుత్వం వీలైనన్ని కిట్లు అందుబాటులోకి తీసుకువస్తే ప్రజలకు ఎక్కువ పరీక్షలు జరపడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

Updated Date - 2021-05-04T05:07:40+05:30 IST