కరోనా విజృంభణ.. చెన్నైలో 152 మంది వైద్యులకు పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-08T13:38:18+05:30 IST

రాజధాని నగరం చెన్నైలో రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. శుక్రవారం నగరంలో మూడు ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 152 మంది వైద్యులు వైరస్‌ బారినపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల ఒకటి

కరోనా విజృంభణ.. చెన్నైలో 152 మంది వైద్యులకు పాజిటివ్‌

                      - 5 జోన్లలో అధికమైన కేసులు


చెన్నై: రాజధాని నగరం చెన్నైలో రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. శుక్రవారం నగరంలో మూడు ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 152 మంది వైద్యులు వైరస్‌ బారినపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల ఒకటి నుంచి కరోనా పాజి టివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. నగరంలోని ఐదు ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్యకూడా అధికమవుతోంది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో (జీహెచ్‌)లో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సహా 97 మందికి పాజిటివ్‌ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. 

ఇదే విధంగా స్టాన్లీలో 30 మంది డాక్టర్లు, నర్సులు, కీల్పాక్‌ వైద్యకళాశాలలో 25 మంది డాక్టర్లు కొవిడ్‌ చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ నగరంలో ని ఆస్పత్రుల్లో 152 మంది డాక్టర్లకు కరోనా సోకినట్లు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.


5 జోన్లలో 1000కి పైగా కేసులు...

చెన్నై కార్పొరేషన్‌కు సంబంధించి రాయపురం, అన్నానగర్‌, అడయార్‌ సహా ఐదు జోన్లలో కరోనా బాధితుల సంఖ్య వెయ్యికి పైగా పెరిగినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. నగరంలో గురువారం 3759 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. 15 జోన్లలో మొత్తం 11,494 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  


కరోనా బాధితుడి పరారీ...

స్థానిక తండయార్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా బాధితుడు పరారయ్యాడు. ఈ సంఘటనపై ఆస్పత్రి నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నూరు సునామీ క్వార్టర్స్‌ ప్రాంతానికి చెందిన 25 యేళ్ళ యువకుడు వాచ్‌మాన్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం జలుబు, జ్వరంతో బాధపడుతూ ఆ యువకుడు వైద్యపరీక్షలు చేసుకోగా అతడికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు ఆ యువకుడిని తడయారుపేట ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆ సమయంలో యువకుడు గేట్‌ వద్ద సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ..  పారి పోయాడు. 


కన్నియాకుమారి జిల్లాలో..

కన్నియాకుమారి జిల్లాల్లో శుక్రవారం 108 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడటంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3179 మందికి నిర్వహించిన వైద్యపరీక్షల్లో 55 మంది పురుషులు, 42 మంది స్త్రీలు, ఏడుగురు బాలురు, నలుగురు బాలికలకు కరోనా నిర్ధారణ అయ్యాయి.


వండలూరు జూలో ఆంక్షలు...

కరోనా వైరస్‌ వ్యాప్తి అధికమవుతున్న కారణంగా వండలూరులోని జంతు ప్రదర్శనశాలలో సందర్శకులకు కొత్త ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జూకు వచ్చే సందర్శకులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రవేశ ద్వారం వద్దే థర్మల్‌స్కాన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాస్కులున్న వారినే లోపలకు అనుమతిస్తున్నారు.

Updated Date - 2022-01-08T13:38:18+05:30 IST