కరోనా పరీక్షలెక్కడ?

ABN , First Publish Date - 2022-01-18T06:30:45+05:30 IST

విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఓ చెట్టు కింద నిరుపయోగంగా పడి ఉన్న ఈ వాహనాలను చూశారా?

కరోనా పరీక్షలెక్కడ?

విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఓ చెట్టు కింద నిరుపయోగంగా పడి ఉన్న ఈ వాహనాలను చూశారా? గత ఏడాది కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్నప్పుడు వైద్య సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఉపయోగపడతాయని రూ.లక్షలు వెచ్చించి ఈ వాహనాలను కొనుగోలు చేశారు. సెకండ్‌ వేవ్‌లో కొన్ని రోజులు ఈ వాహనాలను వినియోగించినప్పటికీ.. ఆ తర్వాత ఇలా చెట్టు కింద పడేయడంతో దుమ్ము పట్టి తుప్పు పట్టి పాడైపోతున్నాయి. కొవిడ్‌ పరీక్షల నిర్వహణకు ఉపయోగపడే వాహనాలను పరిరక్షించడంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి పై చిత్రమే నిదర్శనం. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఒమైక్రాన్‌ రూపంలో చుట్టుముడుతున్న  థర్డ్‌వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అందరూ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సూచించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు వైరస్‌ బారిన పడుతున్నారు. కరోనా లక్షణాలతో బాధ పడుతున్నవారు పరీక్షలు చేయించుకునేందుకు ప్రభుత్వపరంగా కొవిడ్‌ పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేవు. అధికారులు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. కొవిడ్‌ బాధితులకు వెంటనే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం, ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ.. సిబ్బంది సకాలంలో రాకపోవడం, ఆర్టీపీసీఆర్‌ కిట్ల కొరత కారణంగా బాధితులు అసహనంతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు.

Updated Date - 2022-01-18T06:30:45+05:30 IST