కొవిడ్‌ టెస్టుల కోసం రెండేళ్లలో ప్రజలు చేసిన ఖర్చు.. రూ.74 వేల కోట్లు!

ABN , First Publish Date - 2022-02-07T08:41:39+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి.. మానవాళికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. వైరస్‌ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా పెద్దసంఖ్యలో ఉపాధి..

కొవిడ్‌ టెస్టుల కోసం రెండేళ్లలో ప్రజలు చేసిన ఖర్చు..  రూ.74 వేల కోట్లు!

 దేశ వ్యాప్తంగా ఇప్పటికి 74 కోట్ల పరీక్షలు

 మొదట్లో ఒక్కో టెస్టుకు రూ.3500 దాకా ఫీజు

 ప్రస్తుతం రూ.600 దాకా వసూలు 

  ప్రమాణాలు లేని ప్రైవేటు ల్యాబ్‌లలోనూ పరీక్షలు!

 జనం ఆందోళనే ఆసరాగా దోపిడీ


ముంబయి, ఫిబ్రవరి 6: కొవిడ్‌ మహమ్మారి.. మానవాళికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు.  వైరస్‌ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా పెద్దసంఖ్యలో ఉపాధి కోల్పోవడం ఒక ఎత్తయితే.. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల కోసం ప్రజలు చేసిన ఖర్చు మరో ఎత్తు. కొవిడ్‌ లక్షణం ఏ ఒక్కటి కనిపించినా.. జనం తీవ్ర ఆందోళనతో కొవిడ్‌ పరీక్షా కేంద్రాలకు పరుగులు పెట్టారు. ఆయా ల్యాబ్‌లు ఎంత చెబితే అంత చెల్లించి పరీక్షలు చేయించుకున్నారు. ఇలా గడచిన రెండేళ్లలో కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు రూ.74 వేల కోట్లు ఖర్చు చేసినట్లు గ్రాహక్‌ భారతి అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. అయితే ఇందులో దాదాపు 74 కోట్ల టెస్టులను ఎటువంటి అనుమతి లేని ప్రైవేటు ల్యాబ్‌లే చేశాయని తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన తొలి రోజుల్లో చాలా మంది తమకు ఎటువంటి లక్షణాలు లేకపోయినా కొవిడ్‌ టెస్టు చేయించుకున్నారు. వారి ఆందోళనను ఆసరాగా చేసుకున్న ల్యాబ్‌లు.. ఒక్కో టెస్టుకు రూ.3500 దాకా వసూలు చేశాయి. తరువాత క్రమంగా ఈ ఫీజు తగ్గుతూ వచ్చింది.


ప్రస్తుతం రూ.600 దాకా వసూలు చేస్తున్నారు. ఇంటివద్దే స్వయంగా పరీక్షించుకునే కిట్‌ రూ.250కే లభిస్తోంది. కాగా సగటున ఈ ఫీజు రూ.1000గా పరిగణిస్తే.. కొవిడ్‌ టెస్టుల కోసం భారతీయులు ఇప్పటిదాకా రూ.74 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అర్థమవుతోంది. అయితే ఇప్పటిదాకా చేసిన 74 కోట్ల టెస్టుల్లో 4.20 కోట్లు మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయని గ్రాహక్‌ భారతి వ్యవస్థాపక అధ్యక్షుడు బారిస్టర్‌ వినోద్‌ తివారి తెలిపారు. కొవిడ్‌ పరీక్షలు జరిపిన మొత్తం 3255 ల్యాబ్‌లలో ప్రైవేటు ల్యాబ్‌లు 1844, ప్రభుత్వ ల్యాబ్‌లు 1411 ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షల వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపించారు. కొందరు ప్రభుత్వ అధికారుల, రాజకీయ నాయకుల అండతో.. ప్రమాణాలు లేని ల్యాబ్‌లు కూడా రోజుకు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహించాయని తెలిపారు. ఈ నెల 4వ తేదీన ఒక్కరోజే ఏకంగా 16,03,856 టెస్టులు చేసినట్లుగా ఐసీఎంఆర్‌ స్వయంగా వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ల్యాబ్‌లలో వచ్చే ఫలితాలకు ఎటువంటి ప్రామాణికత ఉండటంలేదని, ఒకే వ్యక్తికి 24 గంటల వ్యవధిలో రెండు రకాల ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి ల్యాబ్‌లపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే ప్రజల సొమ్ము మరింత దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. 


Updated Date - 2022-02-07T08:41:39+05:30 IST