ఛీ.. ఛీ.. ఏం మనుషులురా మీరు!

ABN , First Publish Date - 2021-05-05T16:43:07+05:30 IST

కరోనా చావులు..

ఛీ.. ఛీ.. ఏం మనుషులురా మీరు!

కు‘సంస్కారం’

శ్మశానాల దగ్గర దళారుల దందా!

అంత్యక్రియల పేరుతో ప్రైవేటు వ్యక్తుల దోపిడీ 

కొవిడ్‌ మృతులకు అంతిమ సంస్కారాలూ కరువే!


ఆంధ్రజ్యోతి-విజయవాడ: కరోనా చావులు దళారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇదే అవకాశంగా తీసుకుని అన్ని శ్మశాన వాటికల వద్ద శవాలపై పేలాలు ఏరుకునే బ్యాచ్‌లు ఎక్కువయ్యాయి. ప్రాణాంతక కరోనా వైరస్‌ బారినపడి మరణిస్తున్నవారికి కుటుంబ సభ్యులు, బంధువులు కనీసం కడసారి వీడ్కోలు పలికి గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి అశ్రుతర్పణం చేసే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి కుసంస్కారులు కాటికాడ నక్కల్లా చేరి అంత్యక్రియలకు వేలల్లో డబ్బులు వసూలు చేస్తూ మానవత్వాన్ని మంటగలుపుతున్నారు.


కరోనా బారినపడిన బాధితుడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని గుణదల శ్మశాన వాటికకు తరలించడానికి ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవరు రూ.10వేలు డిమాండ్‌ చేశాడు. అప్పటికే రూ.లక్షలు ఖర్చుపెట్టిన కుటుంబం రూ.10వేల గురించి ఆలోచించకుండా ఇచ్చేశారు. అక్కడి నుంచి శ్మశాన వాటిక వచ్చాక లోపలకు తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు అక్కడున్న ప్రైవేటు వ్యక్తులు రూ.20 వేలు డిమాండ్‌ చేశారు. అంబులెన్స్‌ డ్రైవరే మధ్యవర్తిత్వం చేసి రూ.10వేలకు బేరం కుదిర్చాడు. డబ్బు చేతిలో పడ్డాకే మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఇలా ప్రతిరోజూ కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ రెండుచేతులా సంపాదిస్తున్నారు. 


ఒక్క గుణదల శ్మశాన వాటిక వద్దే కాదు.. విజయవాడ నగరంలోని అన్ని శ్మశాన వాటికల వద్ద దాదాపుగా ఇదే పరిస్థితి. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి అంత్యక్రియల కోసం మృతదేహాలను తీసుకొచ్చే వారి నుంచి రూ.వేలల్లో డిమాండ్‌ చేస్తూ దందా నడుపుతున్నారు. ప్రైవేటు అంబులెన్సుల డ్రైవర్లే సూత్రధారులు. ఆప్తులను పోగొట్టుకున్న దుఖంతో కుటుంబ సభ్యులు, బంధువులు దళారులు అడినంత ఇచ్చి అంత్యక్రియలు నిర్వహించుకుంటున్నారు. రోజూ ఎంతోమంది కరోనా కటుకు బలి అవుతుండగా శ్మశాన వాటికల్లో రేయింబవళ్లు చితిమంటలు రగులుతూనే ఉన్నాయి. 


ఇంటి వద్ద చనిపోతే ప్రత్యేక ప్యాకేజీలు

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్స్‌ ఖాళీలు లేక 90శాతానికి పైగా పాజిటివ్‌ బాధితులు ఇళ్ల వద్దే సొంత వైద్యంతో కాలం గడుపుతున్నారు. చాలామంది ఊపిరాడక ఇంటివద్దే మృతి చెందుతున్నారు. ఇలా చనిపోతున్న బాధితుల మృతదేహాలను శ్మశాన వాటికలకు తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు భయపడుతున్నారు. దీంతో ఇంటి నుంచి వాహనాల్లో శ్మశాన వాటికలకు తరలించి, దహన సంస్కారాలు నిర్వహించేందుకు దళారులు రూ.25వేల నుంచి రూ.50వేల వరకూ ప్యాకేజీలు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. చితి అంటించడానికి కుటుంబ సభ్యుల అనుమతికి, కర్మకాండల నిర్వహణకు అస్థికలు తీసివ్వడానికి అదనంగా వసూళ్లు చేస్తున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది ప్రైవేటు వ్యక్తులకు సహకరిస్తుండటంతో అక్రమ వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. 


గౌరవంగా అంతిమ సంస్కారాలూ కరువే!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణిస్తున్న కరోనా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా సిబ్బందే శ్మశాన వాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అస్థికలను మాత్రం కుటుంబ సభ్యులకు అందించాలని ఆదేశించింది. నెగెటివ్‌ వస్తే ప్రత్యేకమైన బ్యాగేజీలో చుట్టి కుటుంబ సభ్యులకు అప్పగించాలి. కానీ సంప్రదాయబద్ధంగా స్నానాలు, మృతదేహాలపై పడి విలపించడం అనుమతించరు. నిబంధనల నడుమ ఆప్తులకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించుకోలేక కుటుంబ సభ్యుల రోదనలు కడు దయనీయం.


పరీక్షలు నిర్వహించకుండానే అంత్యక్రియలు 

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దాదాపు 800 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రతిరోజూ 40మందికి పైగా చనిపోతున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించేలా ఆసుపత్రి సూపరింటెండెంట్లు బాధ్యతలు తీసుకోవాలని, ప్రతి మరణం కలెక్టరుకు తెలియజేయాలి. కానీ ఇవేవీ అమలు కావడం లేదు. మృతదేహాలకే కాదు.. బతికున్న బాధితులకు కూడా పరీక్షల నిర్వహణకు కిట్లు లేవు. దీంతో చనిపోతున్నవారికి పరీక్షలు నిర్వహించకుండానే అనుమానాస్పద (సస్పెక్టెడ్‌) మరణాల కింద రికార్డుల్లో నమోదు చేసి. కుటుంబ సభ్యులకు అప్పగించేస్తున్నారు. చాలామంది కుటుంబ సభ్యులు తీసుకెళ్లటం లేదు. అనాథలా మిగిలిపోతున్న మృతదేహాలను సిబ్బందే కృష్ణలంకలోని స్వర్గపురిలో ఉన్న విద్యుత్తు శ్మశాన వాటికకు తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.  


క్రిమిటోరియానికి మరమ్మతులు 

కృష్ణలంక స్వర్గపురిలోని విద్యుత్‌ క్రిమిటోరియం మరమ్మతులకు గురవటంతో ఆదివారం నుంచి నిలిచిపోయింది. అందుబాటులోకి వచ్చేందుకు 4రోజులు సమయం పడుతుందని చెబుతున్నారు. దీంతో పక్కనే స్వర్గపురి డెవలె్‌పమెంట్‌ కమిటీ (వీఎ్‌సడీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్యాస్‌ ఆధారిత శ్మశాన వాటికను వీఎంసీ తీసుకుని దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. 4 మృతదేహాలను ఏకకాలంలో దహనం చేసేందుకు ఏర్పాట్లు ఉండటంతో రోజుకు 30 మృతదేహాలను దహనం చేస్తున్నారు. ఇక్కడ కూడా దళారుల బెడద తప్పడం లేదు. అందినకాడికి వేలల్లో వసూలు చేస్తున్నారు. నిరుపేదల నుంచి కూడా కనీసం రూ.5వేలైనా వసూలు చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్ల గురించి అధికారులకు తెలిసినా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2021-05-05T16:43:07+05:30 IST