పరీక్షకు వచ్చిన ప్రతి ఇద్దరిలో ఒకరికి కొవిడ్‌ !

ABN , First Publish Date - 2022-01-19T06:26:44+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. పాజివిటిటీ రేటు రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం అత్యధికంగా 1,263 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది.

పరీక్షకు వచ్చిన ప్రతి ఇద్దరిలో ఒకరికి కొవిడ్‌ !

జిల్లాలో 48.45కు చేరిన పాజిటివిటీ రేటు 

మంగళవారం 2,606 మందికి పరీక్షలు, 1,263 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ

వైరస్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందంటున్న వైద్య నిపుణులు

 చికిత్స పొందుతూ ఇద్దరి మృతి


విశాఖపట్నం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):


జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. పాజివిటిటీ రేటు రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం అత్యధికంగా 1,263 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో కొవిడ్‌ వైరస్‌...మరోసారి సామాజిక వ్యాప్తి దశకు చేరినట్టు వైద్యులు పేర్కొంటున్నారు. సాధారణంగా కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నాలుగు దశలుగా పేర్కొంటారు. మొదటి దశలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్‌ను గుర్తిస్తారు. రెండో దశలో ప్రాంతీయ స్థాయిలో కేసులు నమోదవుతాయి. కానీ ఈ కేసులు విదేశాల నుంచి వచ్చిన వారిని కలిసిన వారిలో మాత్రమే గుర్తించబడతాయి. మూడో దశను సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌)గా పేర్కొంటారు. ఈ దశలో వైరస్‌ ఎవరి నుంచి ఎవరికి వ్యాప్తి చెందుతుందో, ఒకరికి వైరస్‌ వ్యాప్తి చెందడానికి కారణం ఎవరో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. చివరిగా నాలుగో దశలో ప్రాంతీయ స్థాయిలో అత్యధికులు వైరస్‌ బారినపడే స్థాయికి చేరుతుంది.


18 రోజుల్లో 8,271 కేసులు..

జిల్లాలో గత 18 రోజుల్లో 8,271 కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా వెయ్యి దాటుతున్నాయి. 15న 1,103, 16న 1,028, 17న 1,018 నమోదుకాగా, మంగళవారం 2,606 మందికి పరీక్షలు నిర్వహించగా 1,263 కేసులు (48.45 పాజిటివిటీ రేటు) వచ్చాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,67,706కు చేరింది. ఇందులో 1,59,054 మంది కోలుకోగా, మరో 7,508 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


ఇద్దరి మృతి...

జిల్లాలో కొద్దిరోజులుగా కేసులు భారీగా నమోదవుతున్నప్పటికీ మరణాలు లేకపోవడం కొంత ఉపశమనంగా భావిస్తూ వచ్చారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం ఇద్దరు మృతిచెందారు. వీటితో మొత్తం మరణాల సంఖ్య 1,114కు చేరింది. ప్రస్తుతం కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో 170 మంది చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారిలో అత్యధిక శాతం  హోం ఐసోలేషన్‌లో వున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు.


నిబంధనలు పాటించకపోవడం వల్లే...

జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు భారీగా పెరగడానికి ప్రజలు వ్యవహార శైలే కారణమని వైద్యులు, అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పండగ సీజన్‌లో వాహనాలలో కిక్కిరిసి ప్రయాణించడం, ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు భారీగా తరలిరావడం, భౌతికదూరం పాటించకపోవడం, మాస్క్‌ వాడకపోవడం, శానిటైజర్‌లు వినియోగించకపోవడం వల్ల కేసులు భారీగా పెరుగుతున్నాయని అంటున్నారు. రానున్న పది రోజుల్లో కేసులు మరింత భారీగా పెరిగే అవకాశం వుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొవిడ్‌ ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నారు. 


అమల్లోకి కర్ఫ్యూ

రాత్రి 11 నుంచి ఉదయం ఐదు వరకూ...

నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు

సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా


విశాఖపట్నం/మహారాణిపేట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ మంగళవారం రాత్రి నుంచి అమలులోకి వచ్చినట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలుచేయాలని ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ఆ మేరకు నగరంలో రాత్రి 11 నుంచి ఉదయం ఐదు గంటల వరకూ కర్ఫ్యూను పక్కాగా అమలు చేస్తామన్నారు. అత్యవసర సేవలు, మీడియా సిబ్బందితోపాటు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు, పోర్టుకు వచ్చిపోయే లారీలకు మాత్రమే కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. మిగిలిన వారెవరూ రాత్రి 11 గంటల తర్వాత బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. కర్ఫ్యూ సందర్భంగా రాత్రి 11 గంటల తర్వాత తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, బీఆర్‌టీఎస్‌ రోడ్డును మూసివేస్తామన్నారు. వారాంతాల్లో బీచ్‌లలో ఆంక్షలు విధించడంపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కర్ఫ్యూ అమలు కోసం ఎక్కడిక్కడ రోడ్లపై బారికేడ్లు, పోలీస్‌ పికెటింగ్‌లను ఏర్పాటుచేస్తున్నామన్నాన్నారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కొవిడ్‌ వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలంతా పగటిపూట బయటకు వచ్చినప్పుడు మాస్క్‌ ధరించడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డీసీపీ-1 గౌతమీశాలి పాల్గొన్నారు.


వైద్య సిబ్బందిపై పంజా...

కేజీహెచ్‌లో ఏడుగురికి పాజిటివ్‌

విశాఖపట్నం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో వైద్యులు, నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బంది భారీగా కొవిడ్‌ బారినపడుతున్నారు. మంగళవారం కేజీహెచ్‌లో ఏడుగురు వైద్య సిబ్బందికి కొవిడ్‌ సోకినట్టు తెలిసింది. వీరిలో ఒక సీనియర్‌ వైద్యుడు, ఇద్దరు పీజీలు, మరో ముగ్గురు నర్సింగ్‌ సిబ్బంది, ఒక ఎఫ్‌ఎంవో వున్నట్టు చెబుతున్నారు. 


అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయంలో కలకలం

ముగ్గురు వైద్యులు సహా 11 మందికి పాజిటివ్‌

అనకాపల్లి టౌన్‌: అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ వైద్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. ముగ్గురు వైద్యులు, మరో వైద్య అధికారి, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఇద్దరు నాలుగో తరగతి సిబ్బందితో పాటు మరో ఇద్దరు కౌన్సిలర్లకు పాజిటివ్‌ వచ్చింది. సోమవారం 54 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు సూపరింటెండెంట్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. వీరిలో 11 మంది వైద్యులు, సిబ్బంది ఉన్నారన్నారు. ప్రస్తుతం అంతా హోమ్‌ ఐసోలేషన్‌లో వున్నట్టు ఆయన చెప్పారు. 


నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో...

నర్సీపట్నం, జనవరి 18: స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది కొవిడ్‌ బారినపడ్డారు. ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌, మరో డాక్టర్‌, ఇద్దరు నర్సింగ్‌ స్టాఫ్‌కు కరోనా నిర్ధారణ కావడంతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు.



Updated Date - 2022-01-19T06:26:44+05:30 IST