రెండు డోసుల నియమంతో కలెక్షన్లకు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-12-16T18:02:44+05:30 IST

కొవిడ్‌ రెండు డోసులు వేసుకున్న వారినే థియేటర్లలోకి అనుమతిస్తుండటంతో బాక్సాఫీస్‌ కలెక్షన్లపై ప్రభావం పడుతోందని చందనసీమ వర్గాలు వాపోతున్నాయి. అయితే ఒమైక్రాన్‌ భయాందోళనల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం

రెండు డోసుల నియమంతో కలెక్షన్లకు బ్రేక్‌

- థియేటర్లలో ప్రేక్షకులు, సిబ్బందికి వాగ్వాదాలు

- ఆందోళన చెందుతున్న చందనసీమ


బెంగళూరు: కొవిడ్‌ రెండు డోసులు వేసుకున్న వారినే థియేటర్లలోకి అనుమతిస్తుండటంతో బాక్సాఫీస్‌ కలెక్షన్లపై ప్రభావం పడుతోందని చందనసీమ వర్గాలు వాపోతున్నాయి. అయితే ఒమైక్రాన్‌ భయాందోళనల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిజానికి ఒమైక్రాన్‌ హడావుడి తర్వాత సినిమా థియేటర్లలో 50 శాతం సీట్ల నియమ నిబంధనలు అమల్లోకి వస్తాయని భావించినా రెండు డోసులు వేయించుకున్నవారినే థియేటర్లలోనికి అనుమతించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. ఈ ఆదేశాల సంగతి ఏమో గానీ సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లతో అయితే సిబ్బందికి, ప్రేక్షకులకు మధ్య ప్రతిరోజూ వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. రెండు డోసుల సర్టిఫికెట్ల తనిఖీ సమయంలో ఈ గొడవలు జరుగుతున్నాయి. సర్టిఫికెట్లు లేని ప్రేక్షకులు సినిమా థయేటర్‌ వరకు వచ్చి వెనుతిరిగిపోతున్నారు. ఇలాంటి ప్రేక్షకుల సంఖ్య 10 శాతం వరకు ఉందని చందనసీమ వర్గాలు వెల్లడించాయి. ఇది సినిమా కలెక్షన్లపై కొంతమేరకు ప్రభావం చూపుతోందని పేర్కొన్నాయి. కొవిడ్‌ నియమాలు కావడంతో అనివార్య స్థితిలో అమలు చేయక తప్పడం లేదని అంటున్నాయి. ఇక 18 సంవత్సరాలలోపు వారినైతే థియేటర్లలోకి అస్సలు అనుమతించడం లేదు. ఈ వయోపరిమితి వారికి ఇంకా వ్యాక్సిన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా సకుటుంబ సమేతంగా థియేటర్లకు సినిమా చూసేందుకు విచ్చేసే వారి సంఖ్య బాగా తక్కువగా ఉందని థియేటర్ల నిర్వాహకులు వెల్లడించారు. కరోనా నుంచి విముక్తి లభించిందని సంతోషపడుతున్న సమయంలో ఒమైక్రాన్‌ వైరస్‌ భయాలు చందనసీమను ఆవరించడంతో నిర్మాతలు సైతం తమ చిత్రాలను విడుదల చేయాలా? వద్దా అనే ధర్మసంకటంలో పడ్డారు.

Updated Date - 2021-12-16T18:02:44+05:30 IST