వ్యాక్సినేషన్‌.. వేగవంతం

ABN , First Publish Date - 2021-01-21T07:10:05+05:30 IST

జిల్లాలో నాలుగో రోజులుగా కాస్త మందకొడిగా సాగుతున్న కొవిడ్‌ వాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పుంజుకుంది.

వ్యాక్సినేషన్‌.. వేగవంతం

కోవిషీల్డ్‌తోపాటు కోవాగ్జిన్‌ కూడా

ఆంధ్రా హాస్పిటల్స్‌లో ప్రారంభించిన కలెక్టర్‌

ఐదో రోజు 2181 మందికి టీకా 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో నాలుగో రోజులుగా కాస్త మందకొడిగా సాగుతున్న కొవిడ్‌ వాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఐదోరోజు బుధవారం జిల్లావ్యాప్తంగా మొత్తం 47 కేంద్రాల్లో 2,181 మంది కొవిడ్‌ టీకా తీసుకున్నారు. జిల్లాలో ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించిన నాటి నుంచి సీరం సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్‌ టీకాను మాత్రమే ఇస్తుండగా.. భారత్‌ బయోటెక్‌ సంస్థకు చెందిన కోవాగ్జిన్‌ టీకాను బుధవారం ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 30 వ్యాక్సిన్‌ సెంటర్లలో 1573 మంది ఆరోగ్య సిబ్బందికి కోవిషీల్డ్‌ వాక్సిన్‌ ఇవ్వగా.. కొత్తగా ప్రారంభించిన మరో 12 వ్యాక్సిన్‌ సెంటర్లలో 608 మందికి కోవాగ్జిన్‌ టీకాను ఇచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో నాలుగు రోజుల్లో 3,176 మందికి మాత్రమే టీకా ఇవ్వగా.. బుధవారం ఒక్కరోజే 2,181 మందికి టీకా ఇవ్వడం విశేషం. వీరితో కలిసి జిల్లాలో ఇప్పటి వరకు కొవిడ్‌ టీకా తీసుకున్నవారి సంఖ్య 5,357కు పెరిగింది. గత నాలుగు రోజులుగా కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ మాత్రమే ఇస్తుండగా.. బుధవారం కోవాగ్జిన్‌ టీకాను కూడా ప్రారంభించారు. గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్‌లో కలెక్టర్‌ ఇంతియాజ్‌ సమక్షంలో తొలుత ఆ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ పి.వి.రమణమూర్తి కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ హాస్పిటల్‌లో మరో రెండు రోజులపాటు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌, ఇతర ఆరోగ్య సిబ్బంది మొత్తం 1,084 మందికి కోవాగ్జిన్‌ టీకా ఇవ్వనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. రోజుకి 500 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసిన ఆంధ్రా హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ రమణమూర్తిని కలెక్టరు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీంద్రనాథ్‌, డాక్టర్‌ పి.వి.రామారావు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T07:10:05+05:30 IST