హమ్మయ్య ! తొలిరోజు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-01-17T05:06:27+05:30 IST

ఎప్పుడెప్పుడాని ప్రజలంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శనివారం ప్రారంభమైందవవి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలిరోజు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఇరుజిల్లాలో మొత్తం 290 మందికి మొదటి రోజు వ్యాక్సిన్‌ అందించారు.

హమ్మయ్య ! తొలిరోజు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విజయవంతం
ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

భద్రాద్రిలో 120, ఖమ్మం జిల్లాలో 170 మందికి టీకా

ఖమ్మంలో ప్రారంభించిన మంత్రి పువ్వాడ, ఎంపీ నామ

రిజిస్ట్రేషన్‌ చేసుకొని గైర్హాజరైనవారి స్థానంలో ఇతరులకు అవకాశం

కొత్తగూడెంలో ఓ నర్సుకు స్వల్ప అస్వస్తత 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కరోనా నివారణ: మంత్రి అజయ్‌ 

ఖమ్మం(ప్రతినిధి)/కొత్తగూడెం కలెక్టరేట్‌, జనవరి16: ఎప్పుడెప్పుడాని ప్రజలంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శనివారం ప్రారంభమైందవవి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలిరోజు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఇరుజిల్లాలో మొత్తం 290 మందికి మొదటి రోజు వ్యాక్సిన్‌ అందించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం ఆరు కేంద్రాల్లో 180మందికి వ్యాక్సిన్‌ వేయాల్సి ఉండగా 170మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ప్రతికేంద్రంలో 30వ్యాక్సిన్‌ వేయాల్సి ఉండగా ఖమ్మం నగరంలోని ముస్తాఫానగర్‌ సెంటర్‌లో 20మంది మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. భద్రాద్రి జిల్లాలో నాలుగు కేంద్రాల్లో 120మందికి వ్యాక్సిన్‌ అందించారు. ఖమ్మం జిల్లా కేంద్ర అసుపత్రిలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో కరోనా ఈ సంవత్సరం పూర్తిగా పూర్తిగా నియంత్రణలోకి రాగలదని, వ్యాక్సిన్‌ తయారీకి హైదరాబాద్‌ కేంద్రం కావాటం గర్వకారణమన్నారు. తొలిదశలో జిల్లాలో 36కేంద్రాల ద్వారా 16వేల మందికి వ్యాక్సిన్‌ అందివ్వటం జరుగుతుందన్నారు. కొవిడ్‌ తరుణంలో ముందుండి వ్యాధి నివారణకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ కార్యక్రమం ప్రారంభించటం గర్వకారణమని, రాష్ట్రం కేంద్రం కలిసి కరోనా మహామ్మారిని తరిమేసేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, డీఎంహెచ్‌వో ఖమ్మం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రి హెడ్‌నర్స్‌ మేరీకి తొలివ్యాక్సిన్‌ అందించారు. మధిర అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2021లో కరోనా పూర్తిగా అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ దశల వారీగా వ్యాక్సిన్‌ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. బోనకల్లు పీహెచ్‌సీలో జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, సత్తుపల్లిలో మున్సిపల్‌ చైర్మన్‌ మహేశ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్తుపల్లిలో డాక్టర్లగా పనిచేస్తున్న కిరణ్‌, శ్రావంతి వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 

గైర్హాజరైన వారిస్థానంలో కొత్తవారికి..

ఖమ్మం జిల్లాలో కొవిన్‌యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారిలో 29మంది వ్యాక్సిన్‌ తీసుకోలేదు. ఇందులో ముగ్గురు వ్యాక్సిన్‌ కేంద్రానికి వచ్చి అనారోగ్య కారణాలతో వ్యాక్సిన్‌ తీసుకోలేదు. మిగిలిన 26మంది గైర్హాజరయారు. వారిస్థానంలో 16మంది కొత్తవారికి వ్యాక్సిన్‌ అవకాశం కల్పించారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో 12మంది, ఖమ్మం వెంకటేశ్వరనగర్‌ అర్బన్‌ ఆరోగ్యకేంద్రంలో 13మంది, ముస్తాఫానగర్‌ అర్బన్‌ ఆరోగ్య కేంద్రంలో  10మంది, బోనకల్లు పీహెచ్‌సీలో ఒక్కరూ రిజిస్ట్రేషన్‌ చేయించుకొని వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. ఖమ్మం వెంకటేశ్వరనగర్‌ అర్బన్‌ ఆరోగ్యకేంద్రంలో సాయంత్రం వరకు వ్యాక్సిన్‌ వేయాల్సి వచ్చింది. భయంతో ఇక్కడ 13మంది గైర్హాజరయ్యారు. వారికి ఫోన్‌చేసినా స్పందించలేదు. వారిస్థానంలో వేరే వాళ్లకు వ్యాక్సిన్‌ అందించారు. జిల్లాలో 153 వయల్స్‌ వచ్చాయి. వాటిని జాగ్రత్తగా భద్రపరిచి వ్యాక్సిన్‌ అందించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 180 మందికి వ్యాక్సిన్‌ అందించగా  ఎవ్వరికి అనారోగ్య సమస్యలు రాలేదు.  

భద్రాద్రి జిల్లాలో 120మందికి వ్యాక్సిన్‌ 

భద్రాద్రి జిల్లాలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతమైంది. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో 120మందికి తొలిరోజు వ్యాక్సిన్‌ అందించారు. భధ్రాచలం ఏరియా ఆసుపత్రిలో ముందుగా పేర్లు నమోదు చేసుకొన్న ఇద్దరు గర్భిణులు ప్రసవించడంతో వారి స్థానంలో వేరేవారికి టీకా ఇచ్చారు.  తొలుత ఎస్‌ విజయలక్ష్మి, దేవిక అనే గర్భిణులు పేర్లు నమోదు కాగా వారు ప్రసవించడంతో వారి స్థానంలో పి విజయశ్రీ, జి. దుర్గాభవానికి టీకాలు వేశారు. కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో టీకా తీసుకొన్న నర్సు దేవిశ్రీకి కళ్లు తిరగడం, ఆయాసం రావవడంతో వైద్యులు అప్రమత్తమై  వైద్య సేవలు అందించడంతో ఆమె కుదుటపడింది. కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో టీకా తీసుకున్న తరువాత దేవిశ్రీ అనే నర్సుకు స్వల్పంగా కళ్లు తిరగడం, ఆయాసం రావవడంతో వైద్యులు అప్రమత్తమై వైద్య సేవలు అందించడంతో ఆమె సాధారణ స్థితికి చేరుకున్నారు. అదే ఆసుపత్రిలో శివారెడ్డి అనే వైద్యసిబ్బంది వ్యాక్సిన్‌ తరువాత తనకు కొద్దిగా తలనొప్పి అనిపించిందన్నారు. ఇలా స్వల్ప సమస్యలు మినహా జిల్లాలో తొలిరోజు వ్యాక్సినేషన్‌ విజయవంతమైంది. కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, పాతకొత్తగూడెం పట్టణ ఆరోగ్యకేంద్రంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు, ఇలెందులో ఇల్లెందు ఎమ్మెల్యే హారిప్రియా, భధ్రాచలంలో  జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కోరం కనకయ్య,  భద్రాచలం ఎమ్యెల్యే  పొదెం వీరయ్యలు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్తగూడెంలో ఏరియా ఆస్పత్రి సూపరిండిండెంట్‌  డాక్టర్‌ సరళ, భధ్రాచలంలో ఏరియా ఆస్పత్రి స్టాఫ్‌ నర్సు పి. పుష్పలత, పాత్తకొత్తగూడెం కేంద్రంలో బూడిదగడ్డ 3వ సెంటర్‌కు చెందిన ఆశాకార్యకర్తల మద్దెల శ్రీదేవి, ఇల్లెందులో ఎల్‌బిఎస్‌ నగర్‌కు చెందిన ఆశాకార్యకర్త జి ఉమాదేవి తొలి టీకా తీసుకున్నారు.  

బ్యానర్‌లో మొదీ ఫొటో లేదని బీజేపీ అసంతృప్తి

వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సందర్భంగా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో ప్రధాని నరేంద్రమోదీ  ఫొటో లేదని బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన మోదీ కృషితోనే ప్రపంచలోనే మొట్టమొదటగా కరోనా వ్యాక్సిన్‌ దేశంలో అందుబాటులోకి వచ్చిందని, అలాంటి వ్యాక్సిన్‌ పంపిణీ  ప్రారంభోత్సవ కేంద్రాలవద్ద ఏర్పాటు చేసిన ఫ్లక్సీల్లో  ప్రధాన నరేంద్ర వెదీ ఫొటోలు లేకుండా వ్యవహారించడం రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు  ఆలోనకు నిదర్శనమని భద్రాద్రి జిల్లా బీజేపీ నాయకుడు కోనేరు సత్యనారాయణ విమర్శించారు. దీనిపై ఆయన జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

వైద్య ఉద్యోగులతో పాటుగా అంగన్వాడీ సిబ్బందికీ టీకా 

ఖమ్మం జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి

ఖమ్మం జిల్లాలో ఆరు కేంద్రాల్లో నిర్వహించిన కొవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతమైంది. తొలిరోజు మొత్తం 180మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించగా ఖమ్మంనగరంలోని ముస్తాఫానగర్‌ అర్బన్‌ ఆరోగ్యకేంద్రంలో 10మంది గైర్హాజరయ్యారు. ఇతరుచోట్ల గైర్హాజరైనవారి స్థానంలో ఇతరులకు వ్యాక్సిన్‌ అవకాశం కల్పించారు. 

వ్యాక్సినేషన్‌ విజయవంతం

- భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అంతరాయాలు లేకుండా విజయవంతమైంది. జిల్లాలో నాలుగుకేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాం. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి, పాతకొత్తగూడెం పట్టణ ఆరోగ్యకేంద్రం, ఇల్లెందు కమ్యూనిటి హెల్త్‌సెంటర్‌, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో 30మంది చొప్పున 120 మంది వైద్య, అశా కార్యకర్తలకు వ్యాక్సిన్‌ వేశాం. ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా త్వరలో అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుంది. 

  శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు

- సూర్యపోగు మేరీ, హెడ్‌నర్స్‌

ఖమ్మం జిల్లాలో తొలి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తాను తీసుకోవటం ఆదృషంగా భావిస్తున్నా.. 10నెలలుగా కరోనా వైరస్‌పై ముందు వరసలో ఉండి వైద్య సేవలు అందించాం. కరోనాకు వ్యాక్సిన్‌ రూపొందించిన శాస్త్రవేత్తలు, ఉద్యోగులకు ప్రత్యేక కృతజ్ఞతలు. వ్యాక్సినేషన్‌ సమయంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ కర్ణన్‌, ఇతర అధికారులు ధైర్యం చెప్పారు. 

  దైర్యంగా కరోనాను తరిమ కొడదాం 

కొత్తగూడెంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సరళ

కరోనా మహామ్మారిని తరిమి కొట్టే అసలైన యుద్దంలో జిల్లాలో తానే తొలి వ్యాక్సిన్‌ వేసుకున్నందుకు  సంతోషంగా ఉంది. టీకా తీసుకొన్నతరువాత తనకు ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ కనిపించలేదు. దైర్యంగా ముందుకు వచ్చి యుద్దంలో నిలబడ్డ ఫీలింగ్‌ వచ్చింది. కరోనా వ్యాక్సినేషన్‌పై అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. ముందుగా వ్యాక్సిన్‌ తీసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచినందుకు సంతోషంగా ఉంది.  



Updated Date - 2021-01-17T05:06:27+05:30 IST