వందకోట్ల మంది టీకా పొందారహో..!

ABN , First Publish Date - 2021-10-15T07:53:19+05:30 IST

వంద కోట్ల మందికి కొవిడ్‌ టీకా పంపిణీ పూర్తయిన సందర్భాన్ని ఘనంగా చాటాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

వందకోట్ల మంది టీకా పొందారహో..!

మైలురాయి చేరిక సందర్భంగా ప్రచారం.. ఎర్రకోటపై ఎగరనున్న జాతీయ జెండా

దేశంలో కొత్తగా 18 వేల కరోనా కేసులు


న్యూఢిల్లీ, అక్టోబరు 14: వంద కోట్ల మందికి కొవిడ్‌ టీకా పంపిణీ పూర్తయిన సందర్భాన్ని ఘనంగా చాటాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై, ప్రధానమంత్రి కార్యాలయం సహా పలు కీలక మంత్రిత్వ శాఖల కార్యాలయాలున్న సౌత్‌ బ్లాక్‌, నార్త్‌ బ్లాక్‌లలో జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రణాళికలు వేస్తోంది. దీనిని రోడ్డు, వాయు, జలమార్గాల్లో చాటాలని చూస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం తెలిపిన సమాచారం మేరకు.. వంద కోట్ల మందికి టీకా అందిన విషయాన్ని దేశంలోని ప్రతి రైల్వే స్టేషన్‌లో, రైళ్లలో, మెట్రోలు, విమానాలు, నౌకల్లో స్పీకర్లతో ప్రకటించనున్నారు. స్పైస్‌ జెట్‌ విమానాలకు ప్రధాని మోదీ, ఆరోగ్య కార్యకర్తల చిత్రాలను అతికించనున్నారు. కాగా, దేశంలో ప్రస్తుతం 97 కోట్ల మందికిపైగా కొవిడ్‌ టీకా తీసుకున్నారు. అర్హుల్లో 75 శాతం తొలి డోసు, 30 శాతం మంది రెండు డోసులూ పొందారు. సోమవారం నాటికి వందకోట్లకు చేరొచ్చని అంచనా. దేశంలో బుధవారం 18,987 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 246 మంది మృతిచెందారు. మంగళవారం (14 వేలు)తో పోలిస్తే కేసులు 20 శాతం పెరిగాయి. 


కరోనా పుట్టుకను నిగ్గు తేల్చాల్సిందే..: భారత్‌

కరోనా ఎలా పుట్టిందన్న అంశంపై నిజానిజాలు బయటకు రావాల్సిందేనని భారత్‌ స్పష్టం చేసింది. కరోనాపై దర్యాప్తునకు  మన దేశానికి చెందిన ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్‌ రామన్‌ గంగాఖేద్కర్‌, ఐసీఎంఆర్‌ నేషనల్‌ చైర్‌ డాక్టర్‌ సీజీ పండిట్‌ సహ 26 మంది నిపుణులతో డబ్ల్యూహెచ్‌వో బృందాన్ని నియమించిన నేపథ్యంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరింధమ్‌ బాగ్చి స్పందించారు. తదుపరి అధ్యయనాలు, ఇతర సమాచారం తెలుసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, కరోనా పుట్టుకపై అనవసర రాజకీయాలు చేయవద్దని చైనా పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో విచారణకు సహకరిస్తామంటూనే.. రాజకీయాలు చేస్తే సహించమని తెలిపింది. గతంలో జరిపిన దర్యాప్తులో కీలక అంశాలను చైనా దాచిందన్న ఆరోపణలు వచ్చాయి. విచారణ సైతం అర్ధంతరంగా ముగిసింది. కరోనా వూహాన్‌లోని ల్యాబ్‌ నుంచే బయటకు వచ్చినట్లు చెప్పలేమని డబ్ల్యూ హెచ్‌వో బృందం పేర్కొనడం కూడా వివాదాస్పదమైంది. 

Updated Date - 2021-10-15T07:53:19+05:30 IST