వదల బొమ్మాళీ!

ABN , First Publish Date - 2020-03-19T07:11:59+05:30 IST

స్టాక్‌ మార్కెట్‌ వర్గాలను కరోనా వైరస్‌ భయాలు వీడట్లేదు. ఈ మహమ్మారి దెబ్బకు స్టాక్‌ సూచీలు మరోసారి కుప్పకూలాయి. బుధవారం లాభాలతోనే ప్రారంభమైనా విదేశీ మార్కెట్ల నుంచి వెలువడిన సంకేతాలతో ఇండెక్స్‌లు ట్రేడింగ్‌ సాగుతున్న కొద్దీ భారీ పతనం దిశగా పయనించాయి.

వదల బొమ్మాళీ!

  • కరోనా దెబ్బకు మార్కెట్‌ మళ్లీ ఢమాల్‌ 8 సెన్సెక్స్‌ 1,709 పాయింట్లు డౌన్‌ 
  • 8,500 పాయింట్ల దిగువకు నిఫ్టీ 

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ వర్గాలను కరోనా వైరస్‌ భయాలు వీడట్లేదు. ఈ మహమ్మారి దెబ్బకు స్టాక్‌ సూచీలు మరోసారి కుప్పకూలాయి. బుధవారం లాభాలతోనే ప్రారంభమైనా విదేశీ మార్కెట్ల నుంచి వెలువడిన సంకేతాలతో ఇండెక్స్‌లు ట్రేడింగ్‌ సాగుతున్న కొద్దీ భారీ పతనం దిశగా పయనించాయి. చివరి గంటలో ట్రేడర్లు అమ్మకాలు పోటెత్తించారు. బీఎ్‌సఈలో ట్రేడింగ్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 1,709.58 పాయింట్లు (5.59 శాతం) క్షీణించి 28,869.51 వద్ద నిలిచింది. సూచీ 29,000 దిగువ స్థాయిలో ముగియడం 2017 జనవరి తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. నిఫ్టీ 498.25 పాయింట్ల (5.56 శాతం) నష్టంతో 8,468.80 వద్ద ముగిసింది. దాంతో సూచీ 8,500 కీలక మద్దత స్థాయిని కోల్పోయింది. గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌ అండ్‌ పీ .. భారత వృద్ధి అంచనాలకు కోతపెట్టడం, ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల విషయంలో టెల్కోలకు ఊరటనిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని మరింత పెంచింది. 


* సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 28 నష్టాలు చవిచూశాయి. ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ 23.90 శాతం పతనమై సూచీ టాప్‌ లూజర్‌గా నిలిచింది. 

* ఆర్‌బీఐ మారటోరియం ఎత్తివేయడంతో యెస్‌ బ్యాంక్‌ షేరు ధర ఇంట్రాడేలో ఏకంగా 49.95ు ఎగబాకినా ట్రేడింగ్‌ ముగిసేసరికి 3.67ు లాభంతో రూ.60.80 వద్ద స్థిరపడింది. 


బ్యాంకింగ్‌, టెలికాం షేర్లు ఢాం

ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టడంతో టెలికాం కంపెనీల షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. వొడాఫోన్‌ ఐడియా షేరు ఏకంగా 35 శాతం క్షీణించింది. భారతీ ఎయిర్‌టెల్‌ కూడా 6.14 శాతం తగ్గింది. దాంతో బీఎ్‌సఈ టెలికాం సూచీ 9.48 శాతం నష్టపోయింది.


3 రోజుల్లో రూ.15.72 లక్షల కోట్లు ఫట్‌ 

గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.15.72 లక్షల కోట్లు తరిగిపోయింది. దాంతో బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.113,53,329.30 కోట్లకు జారింది.


7,500 స్థాయికి నిఫ్టీ!

మరికొన్నాళ్లపాటు స్టాక్‌ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగవచ్చని ఈక్విటీ నిపుణులు భావిస్తున్నారు. మున్ముందు సెషన్లలో నిఫ్టీ 7,900-7,500 స్థాయి వరకు పడిపోయే అవకాశాలు లేకపోలేవని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ ఎనలిస్ట్‌ చందన్‌ తపారియా అన్నారు. 


పాపం పౌండ్‌!

బ్రిటన్‌ పౌండ్‌ విలువ 1985 సంవత్సరం నాటి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికన్‌ డాలర్‌తో పౌండ్‌ మారకం రేటు 1.9 శాతం తగ్గి 1.1828 డాలర్లకు జారుకుంది. 


అంబానీ ఆస్తిలో లక్షన్నర కోట్లు ఆవిరి 

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ వ్యక్తిగత సంపద భారీగా తరిగిపోయింది. బ్లూంబర్గ్‌ బిలియన్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ఆయన ప్రస్తుత సంపద 3,840 కోట్ల డాలర్లు. ఈ ఏడాదిలో మార్చి 16 వరకు అంబానీ ఆస్తి 2,020 కోట్ల డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.1.50 లక్షల కోట్లు) తగ్గింది. గడిచిన కొద్ది నెలల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) షేరు విలువ భారీగా క్షీణించింది. నేటి సెషన్‌ ముగిసేనాటికి ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.6,14,179.93 కోట్లకు జారుకుంది. ఇదే సమయంలో టీసీఎస్‌ మార్కెట్‌ విలువ రూ.6,19,499.95 కోట్లకు పెరిగింది. దాంతో రిలయన్స్‌ను వెనక్కి నెట్టి టీసీఎస్‌ మార్కెట్లో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 


17 ఏళ్ల కనిష్ఠానికి ముడి చమురు 

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పతనం కొనసాగుతోంది. బెంచ్‌మార్క్‌ డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర 25 డాలర్ల దిగువకు పడిపోయింది. 17 ఏళ్ల (2003) తర్వాత డబ్లూటీఐ క్రూడ్‌కిదే కనిష్ఠ స్థాయి. బ్రెంట్‌ రకం క్రూడాయిల్‌ రేటు 27 డాలర్ల దిగువన ట్రేడైంది. మున్ముందు క్రూడ్‌ ధర 20 డాలర్లకు పడిపోవచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంటోంది. 

Updated Date - 2020-03-19T07:11:59+05:30 IST