ఢిల్లీలో కోవిడ్ పాజిటివ్ రేటు 0.44 శాతం

ABN , First Publish Date - 2021-01-17T20:32:18+05:30 IST

దేశ రాజధానిలో గత 24 గంటల్లో కొత్తగా 295 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని..

ఢిల్లీలో కోవిడ్ పాజిటివ్ రేటు 0.44 శాతం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గత 24 గంటల్లో కొత్తగా 295 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, కోవిడ్ పాజిటివ్ కేసుల శాతం 0.44కు తగ్గిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆదివారంనాడు తెలిపారు. ఢిల్లీలో కేసులు తగ్గడంతో కోవిడ్ 'థర్డ్ వేవ్' ముగింపు దశకు వచ్చినట్టు భావిస్తున్నామని చెప్పారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా మాస్క్‌లు ధరించడం మాత్రం తప్పనిసరి అని అన్నారు.


ఢిల్లీలోని 81 కేంద్రాల్లో శనివారంనాడు 4,317 మంది హెల్త్ వర్కర్లు వ్యాక్సిన్ డోస్ తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. వ్యాక్సినేషన్ అనంతరం 51 మందికి సైడ్ ఎఫెక్ట్‌లు వచ్చినట్టు, ఒకరు ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం ఉందని చెప్పారు. ప్రతికూల సమస్యలు ఏర్పడిన 22 ఏళ్ల వ్యక్తిని ఎయిమ్స్‌లోని ఐసీయూలో చేర్చామని, 51 మందిని ఏఈఎఫ్ఐ టీమ్ అబ్జర్వేషన్‌లో ఉంచి, పరిస్థితి కుదటపడటంతో 30 నిమిషాల తర్వాత డిశ్చార్చ్ చేశామని తెలిపారు. వ్యాక్సినేషన్ విశ్వసనీయతపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, నిపుణుల సూచనల మేరకే ప్రతీదీ జరుగుతోందని, సమగ్ర పరిశీలన జరిపిన తర్వాతే వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. వ్యాక్సినేషన్ కేంద్రాలను తొలుత 175కి పెంచి, ఆ తర్వాత 1000కు చేరుస్తామని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) సమ్మె కారణం ఎంసీడీ పరిధిలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను ఉపసంహరించుకున్నామని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలు లేవని మంత్రి వివరించారు.

Updated Date - 2021-01-17T20:32:18+05:30 IST