కరోనా టీకా కార్యక్రమానికి కొవిన్‌, ఆధార్‌ కీలకం

ABN , First Publish Date - 2021-01-11T07:03:57+05:30 IST

దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ‘కొవిన్‌ (కరోనా వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌)’ ఒక పునాదిని ఏర్పరుస్తుందని కేంద్రం పేర్కొంది.

కరోనా టీకా కార్యక్రమానికి కొవిన్‌, ఆధార్‌ కీలకం

  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు
  • నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ


న్యూఢిల్లీ, జనవరి 10: దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ‘కొవిన్‌ (కరోనా వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌)’ ఒక పునాదిని ఏర్పరుస్తుందని కేంద్రం పేర్కొంది. ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కార్యక్రమంగా జనవరి 16 నుంచి కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ను భారత్‌లో ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమ సన్నాహాల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారంనాడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఏర్పాట్లపై చర్చించింది.


‘కొవిడ్‌-19పై పోరులో సాంకేతిక పరిజ్ఞానం, సమాచార నిర్వహణ’పై ఏర్పాటైన సాధికారిక బృందానికి చైర్మన్‌ అయిన రామ్‌సేవక్‌ శర్మ ఈ భేటీకి అధ్యక్షత వహించారు. వ్యాక్సిన్లు అందరికీ ఎక్కడైనా ఎప్పుడైనా అందుబాటులో ఉండేలా ఈ ప్రక్రియ ఉండాలని ఆయన సూచించారు. వ్యాక్సినేషన్‌ సమాచారాన్ని రియల్‌టైమ్‌లో సేకరించడం అన్నింటికన్నా ముఖ్యమన్నారు. వ్యాక్సిన్‌ ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో వేయించుకుంటున్నారు? ఏ వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు (ఆక్స్‌ఫర్డ్‌ టీకానా లేక భారత్‌ బయోటెక్‌దా?)? తదితర అంశాలన్నీ కూడా పక్కాగా సేకరించాలని.. ఒకరి బదులు మరొకరు వ్యాక్సిన్‌ వేయించుకోకుండా చూడాలని.. ఇవన్నీ జరగాలంటే లబ్ధిదారులు తమ మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకునేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించారు.


కాగా.. వ్యాక్సినేషన్‌ ప్రణాళికను అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఢిల్లీ ప్రకటించింది. తొలిదశలో వారందరికీ 89 ఆస్పత్రుల్లో మాత్రమే టీకాలు వేయిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. తమ రాష్ట్రంలో కరోనాపై పోరులో ముందు వరుసలో నిలిచిన యోధులందరికీ ఉచితంగా టీకా వేయిస్తామని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఒక లేఖలో తెలిపారు. కరోనా టీకా కార్యక్రమాన్ని జనవరి 16 నుంచి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించినందున.. జనవరి 17న తలపెట్టిన పల్స్‌పోలియో కార్యక్రమాన్ని కేరళ సర్కారు వాయిదా వేసింది. 


ముఖ్యమంత్రులతో..

వ్యాక్సినేషన్‌ సన్నాహకాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం వర్చువల్‌ భేటీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే ఈ భేటీలో.. సీఎంలు తమ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ సన్నాహాల గురించి, ఇతరత్రా సమస్యలేవైనా ఉంటే వాటి గురించి ప్రధానికి వివరించనున్నారు.




బెంగాల్‌లో ప్రతిఒక్కరికీ ఉచిత టీకాలు: మమత

బెంగాల్‌లో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ముందుగా కొవిడ్‌ యోధులకు ప్రాధాన్యమిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల కోసం నిస్వార్థంగా సేవలందించిన కొవిడ్‌ యోధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా కొవిడ్‌ వ్యాక్సిన్ల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్న వారిపై రాజస్థాన్‌ వైద్యశాఖ మంత్రి రఘు శర్మ తీవ్రంగా మండిపడ్డారు.


కేంద్ర ప్రభుత్వం టీకాలు సరఫరా చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ల పనితీరుపై సందేహాలు లేవనెత్తడానికి ఇది సమయం కాదని ఆయన అన్నారు. అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన టీకాల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్న సొంత పార్టీ నేతల తీరును సైతం ఆయన తప్పుపట్టారు. ఇప్పటికే ప్రయోగ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో వ్యాక్సిన్లపై విశ్వాసం ఉంచాలని ప్రజలను కోరారు.

రాజస్థాన్‌లో మొదటి దశలో 4.5 లక్షల మందికి టీకాలు వేస్తామని స్పష్టం చేశారు. ఇందు కోసం 18 వేల మందికి ప్రభుత్వం శిక్షణ ఇచ్చిందని ఆయన వెల్లడించారు.


Updated Date - 2021-01-11T07:03:57+05:30 IST