కోవీషీల్డుతో కరోనా నుంచి ఉపశమనం

ABN , First Publish Date - 2021-01-17T05:17:29+05:30 IST

కోవీషీల్డు వ్యాక్సిన్‌తో ప్రజలకు కరోనా నుంచి ఉపశమనం లభించిందని అధికారులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు

కోవీషీల్డుతో కరోనా నుంచి ఉపశమనం
స్టాఫ్‌నర్స్‌ పుష్పలతకు వ్యాక్సిన్‌ వేస్తున్న దృశ్యం

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ షురూ

ప్రారంభించిన జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యే, పీవో, అదనపు కలెక్టర్‌

తొలి సూదిమందు స్టాఫ్‌నర్స్‌ పుష్పలతకు

ఫ్రంట్‌లైన్‌ వారీయర్స్‌కు మొదటి ప్రాధాన్యం 

భద్రాచలం, జనవరి 16: కోవీషీల్డు వ్యాక్సిన్‌తో ప్రజలకు కరోనా నుంచి ఉపశమనం లభించిందని అధికారులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కోవీషీల్డు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ఈ నేపఽథ్యంలో భద్రాచలంలోని ఏరియా వైద్యశాలలో తొ లుత మోదీ ప్రసంగాన్ని టీవీ ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యులు, సిబ్బంది వీక్షించారు. అనంతరం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జిల్లాపరిషత్‌ చైర్మన్‌ కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఐటీడీఏ పీవో పి.గౌతమ్‌, అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో తొలి వ్యాక్సిన్‌ను ఏరియా వైద్యశాలలో స్టాఫ్‌నర్సుగా బాధ్యతలు నిర్వహిస్తున్న పి.పుష్పలతకు పిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ క్రాపా విజయ్‌ వేశారు. ఈ క్రమంలో ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చావా యుగంధర్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ సుమన్‌ ప్రవీణ్‌తో పాటు వైద్యు లు, సిబ్బంది మొత్తం 30 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. డాక్టర్‌ దేవిక, ఎస్‌.విజయలక్ష్మీలు బా లింతలు కావడంతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వారి స్థానంలో పి.విజయశ్రీ, జి.దుర్గా భవానికి వ్యాక్సిన్‌ వేశారు. ఈ సమయంలో వ్యాక్సిన్‌ వేసుకున్న వారిని అరగంట పాటు ప ర్యవేక్షణ గదిలో ఉంచి పరిశీలించారు. ఈ క్రమంలో వారికి ఎటువంటి ఆరోగ్యపరమైన మార్పులు లేకపోవడంతో అధికారులు, వైద్యులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వ్యాక్సినేషన్‌ను నిర్వహించేందుకు లబ్ధిదారుల వివరాలు అధికారికంగా సేకరించి వారి ఆమోదానికి సంతకాలు కూడా తీసుకున్నారు. కోవీషీల్డు వ్యాక్సినేషన్‌ ప్రారంభాన్ని పురస్కరించుకొని జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఐటీడీఏ పీవో పోత్రు గౌతమ్‌, అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తొలి విడతలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించిన వారికి వ్యాక్సిన్‌ వేస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్‌ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. కాగా వ్యాక్సిన్‌ వేయించుకున్న వైద్యులు, సిబ్బంది మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌లో తొలి విడతలో తాము భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వ్యాక్సిన్‌ అనంతరం తమకు ఎటువంటి సమస్య లేదని వారు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీనివాస్‌, డిప్యుటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ మోకాళ్ల వెంకటేశ్వరరావు, డాక్టర్‌ క్రాపా విజయ్‌, డాక్టర్‌ కిషన్‌, డాక్టర్‌ చైతన్య, డాక్టర్‌ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-17T05:17:29+05:30 IST