ఆవు పేడ యుద్ధంతో Diwali ముగింపు సంబరం

ABN , First Publish Date - 2021-11-08T23:42:51+05:30 IST

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఈ మూలసూత్రంతోనే ప్రజాస్వామ్యం..

ఆవు పేడ యుద్ధంతో Diwali ముగింపు సంబరం

న్యూఢిల్లీ: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఈ మూలసూత్రంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంటుంది. చాలా సందర్భాల్లో పండుగలు, సంప్రదాయాలు ఇందుకు వేదికగా నిలుస్తుంటాయి. ఇలాంటి పండుగల్లో దీపావళి ఒకటి. ఆవు పేడ యుద్ధంతో దీపావళి ముగింపు సంబరాలు చేసుకునే ఓ గ్రామం ఉందని తెలిస్తే మనకు ఆశ్చర్యమే కదా. ఇది తెలుసుకోవాలంటే..తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని గుమటపుర గ్రామానికి వెళ్లాల్సిందే. ఏటా దీపావళి ముగింపు వేడుకగా 'గోరెహబ్బా' ఫెస్టివల్‌ను ఈ గ్రామస్థులు ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. దిబ్బలాంటి ఆవుపేడ మధ్యలోకి జనం చేరి, ఒకరిపై మరికొరు పేడ ముద్దలు విసురుకుంటారు. ఒక చిన్నపాటి యుద్ధాన్నే ఈ ఉత్సవం తలపిస్తుంది. ఈ వేడుకలకు వందేళ్లకు పైగా ఘన చరిత్ర ఉందని ఆ గ్రామస్థులు ఘనంగా చెబుతుంటారు.


దీపావళి ముగింపు వేడుకల్లో భాగంగా ఇటీవల ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ గోరెహబ్బా పండుగలో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్దవాళ్లు కూడా వయస్సును పక్కనపెట్టి ఆ క్రీడలో మునిగితేలారు. యువకులను ప్రోత్సహిస్తూ కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ నెటిజన్లను అబ్బురపరుస్తోంది. ఆవుపేడ యుద్ధంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుండగా, కొందరు అయితే స్పెయిన్‌లో జరిగే టమోటాల యుద్ధంతో దీన్ని పోలుస్తూ 'పల్లె క్రీడలా...మజాకానా' అంటూ సంబరపడుతున్నారు.

Updated Date - 2021-11-08T23:42:51+05:30 IST