ఆవుకూ ప్రాథమిక హక్కులు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

ABN , First Publish Date - 2021-09-02T03:44:11+05:30 IST

ఆవుకు కూడా ప్రాథమిక హక్కులు కల్పించాలంటూ అలహాబాద్ హైకోర్టు బుధవారం నాడు వ్యాఖ్యానించింది.

ఆవుకూ ప్రాథమిక హక్కులు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ: ఆవుకు కూడా ప్రాథమిక హక్కులు కల్పించాలంటూ అలహాబాద్ హైకోర్టు బుధవారం నాడు వ్యాఖ్యానించింది. గోవధ నిరోధక చట్టం కింద అరెస్టైన ఓ వ్యక్తికి బెయిలు నిరాకరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. ‘‘గోవులు సురక్షితంగా ఉన్నప్పుడే లోకకల్యాణం జరుగుతుంది. గోరక్షణ అనేది ఒక మతానికి సంబంధించినది కాదు. ఇది భారతీయ సంస్కృతిలో భాగం. ప్రతి పౌరుడు ఈ బాధ్యతను తీసుకోవాలి ’’ అని  న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్ తన తీర్పులో పేర్కొన్నారు.  గోవును జాతీయ జంతువుగా గుర్తించాలని, గోవుకు కూడా ప్రాథమిక హక్కులు కల్పించేలా పార్లమెంటులో చట్టం చేయాలని జడ్జి అభిప్రాయపడ్డారు. బెయిలు కోరుతూ జావేద్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి ఈ విధంగా స్పందించారు. అతడు కోరినట్టు బెయిలు మంజూరు చేస్తే సమాజంలో సామరస్యభావన దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిందితుడు గతంలోనూ గోవధకు పాల్పడ్డ విషయాన్ని కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు.   

Updated Date - 2021-09-02T03:44:11+05:30 IST