డేటా చౌర్యంపై సీపీ సీరియస్‌

ABN , First Publish Date - 2021-03-03T07:15:35+05:30 IST

ఈ కామర్స్‌ సైట్లలో వినియోగదారుల డేటా చౌర్యంపై సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

డేటా చౌర్యంపై సీపీ సీరియస్‌

 ఈ కామర్స్‌ సైట్లకు లేఖలు  

హైదరాబాద్‌ సిటీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఈ కామర్స్‌ సైట్లలో వినియోగదారుల డేటా చౌర్యంపై సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సీరియస్‌ అయ్యారు.  ఈ కామర్స్‌ సైట్లలో వస్తువులు కొనుగోలు చేసిన వారికి వాటిని డోర్‌ డెలివరీ చేస్తున్న సమయంలో, డెలివరీ విభాగంలో పని చేస్తున్న సిబ్బందిని మచ్చిక చేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు వారి నుంచి వినియోగదారుల చిరునామాల జాబితా, ఇతర డేటాను తస్కరిస్తున్నారు. ఆ తర్వాత ఈ కామర్స్‌ వెబ్‌సైట్ల పేరుతో నకిలీ లెటర్‌లు, బహుమతుల పేరుతో స్ర్కాచ్‌ కార్డులు తయారు చేస్తున్నారు. వాటిని కస్టమర్ల అడ్ర్‌సకు పంపిస్తున్నారు. ఆ స్ర్కాచ్‌ కార్డు ఓపెన్‌ చేస్తే ఖరీదైన కారు బహుమతిగా గెలుచుకున్నారంటూ నమ్మిస్తున్నారు. నమ్మిన కస్టమర్లు ఆ లేఖలో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేసి సైబర్‌ నేరగాళ్ల బారిన పడుతున్నారు. బహుమతిగా గెలుచుకున్న కారు డెలివరీ ఇవ్వాలంటే జీఎస్టీ, ఇన్సూరెన్స్‌, సెక్యూరిటీ డిపాజిట్‌ ఇలా వివిధ చార్జీలు చెల్లించాలని నేరగాళ్లు బురిడీ కొట్టించి రూ. లక్షల్లో దోచేస్తున్నారు. దేశవ్యాప్తంగా వందలాది మందిని మోసం చేసి రూ. 2 కోట్లు కొల్లగొట్టిన జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీ సైబర్‌ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్‌ల డేటాను సైబర్‌ నేరగాళ్ల చేతికి అందేలా, పరోక్షంగా సైబర్‌ నేరాలను ప్రోత్సహిస్తున్న ఈ కామర్స్‌ సైట్లపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఉపక్రమించారు. ఈ మేరకు ఆయా యాజమాన్యాలకు సీపీ సజ్జనార్‌ లేఖలు రాయనున్నట్లు పేర్కొన్నారు. వారు స్పందించే తీరును బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు.   

Updated Date - 2021-03-03T07:15:35+05:30 IST