Abn logo
Jun 24 2021 @ 12:27PM

ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే అరెస్టులు చేస్తారా?: రామకృష్ణ

అమరావతి: ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే అరెస్టులు చేస్తారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతియేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని యువతకు తమరిచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 2.35 లక్షల ఉద్యోగ ఖాళీలుంటే రెండేళ్ల తదుపరి కేవలం 10,143 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం తగునా అని ఆయన మండిపడ్డారు. కర్నూలులో యువజన, విద్యార్థులను అరెస్టు చేసి సెల్లో నిర్బంధించి, నాన్బెయిలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీకి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు యువజన, విద్యార్థులపై పెట్టిన నాన్ బెయిలబుల్ కేసులను ఉపసంహరించాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.