ఇది ఫ్యాక్షనిస్టుల పాలన: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

ABN , First Publish Date - 2021-03-03T15:40:19+05:30 IST

రాష్ట్రంలో పాలన రాజ్యాంగపరంగా సాగడం లేదని, ఫ్యాక్షనిస్టు తరహా పాలన సాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ..

ఇది ఫ్యాక్షనిస్టుల పాలన: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

గవర్నర్‌పేట(కృష్ణా): రాష్ట్రంలో పాలన రాజ్యాంగపరంగా సాగడం లేదని, ఫ్యాక్షనిస్టు తరహా పాలన సాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ సాంప్రదాయాలను మంటగలిపి రాజకీయాన్ని అతలాకుతలం చేస్తోందన్నారు. మంగళవారం విజయవాడలో టిడీపీ, సీపీఐ ఉమ్మడి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. 23వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి నెల్లిబండ్ల బాలస్వామితో కలిసి సూర్యారావుపేట, గవర్నర్‌పేట ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. కొన్నిచోట్ల సైకిల్‌ తొక్కుతూ ప్రచారం నిర్వహించారు. నారాయణ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకోవడం అరాచకానికి పరాకాష్ట అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నిర్భందాన్ని సమర్థించుకుంటూ గతంలో జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్టులో నిర్బంధించలేదా అని వైసీపీ నేతలు ప్రశ్నించడం సమంజసం కాదన్నారు. దేశంలోని సంక్షేమ పథకాల అమలులో నెంబర్‌వన్‌గా నిలిచామని చెబుతున్న వైసీపీ నేతలు ఎన్నికల్లో దౌర్జన్యాలు, బెదిరింపులకు ఎందుకు పాల్పడుతున్నదని ప్రశ్నించారు. బలవంతపు ఎకగ్రీవాలకు పాల్పడటం ద్వారా ఎన్నికలు ఎదుర్కొనేందుకు, ప్రజల నుంచి తీర్పు కోరేందుకు వైసీపీ భయపడుతోందని అన్నారు. ఓడిపోతామన్న భయంతోనే దౌర్జన్యాలు, ప్రలోభాలకు తెరదీశారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం శాంతియుత వాతావరణంలో సాగాలని, అలాంటి పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత పాలకులదేనని అన్నారు. పాదర్శక పాలన సాగాలంటే టీడీపీ, సీపీఐ ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  

Updated Date - 2021-03-03T15:40:19+05:30 IST