Abn logo
Sep 19 2021 @ 01:02AM

మోదీ నుంచి దేశాన్ని కాపాడాలి

రాజమహేంద్రవరంలో సీపీఐ పాదయాత్ర
రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 18: ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రధాని మోదీ కబంధహస్తాల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ, 27న జరిగే భారత్‌బంద్‌ జయప్రదం చేయాలని కోరుతూ శనివారం సీపీఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఎర్రజెండాలతో రాజమహేంద్రవరంలో పాదయాత్ర నిర్వహించారు. మున్సిపల్‌ స్టేడియం నుంచి ప్రారంభమైన ప్రదర్శన పాదయాత్ర మెయిన్‌రోడ్డు, దేవీచౌక్‌ మీదుగా కంబాలచెరువు గాంధీ బొమ్మసెంటర్‌ వరకూ సాగింది. కంబాలచెరువు వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలను మోదీ నాశనం చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడంలేదని, విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారని అన్నారు. అందుకే రైతు కార్యాచరణ సమితి పిలుపుమేరకు ఈనెల 27న భారతబంద్‌ జయప్రదం చేయాలని కోరారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వరంగ ఆస్తులను అమ్మేసి కార్పొరేట్‌ శక్తులకు అప్పగించడం శోచనీయమన్నారు. 144 కార్మికచట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మికుల హక్కులు కాలరాశారని విమర్శించారు. అఖిలభారత కిసాన్‌సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ అన్నంపెట్టే రైతన్న నడ్డివిరగ్గొట్టేందుకు మూడు నల్లచట్టాలు తెచ్చి రైతులను కూలీలుగా మార్చేందుకు, కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేయించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొట్టాలని కోరారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అత్తిలి విమల మాట్లాడారు. రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నాయకులు పలు చోట్ల పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, జట్లు లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు కూండ్రపు రాంబాబు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జుత్తుక కుమార్‌, చెల్లుబోయిన కేశవశెట్టి, తోకల ప్రసాద్‌, శీలం వెంకటేష్‌, రాము, సత్యనారాయణ, వంగమూడి కొండలరావు, నల్లా భ్రమరాంబ, జి.లోవరత్నం, సేపేని రమణమ్మ పాల్గొన్నారు.