పోరాడుదాం.. పోడు పట్టాలు సాధించుకుందాం.. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌

ABN , First Publish Date - 2021-01-26T05:25:32+05:30 IST

గిరిజన హక్కులను కాలరాస్తూ.. పోడు సాగుపై ఆధారపడిన గిరిజనులను ఆ భూముల నుంచి వెళ్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడి పట్టాలు సాధించుకుందామని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కరత్‌ పిలుపునిచ్చారు.

పోరాడుదాం.. పోడు పట్టాలు సాధించుకుందాం..  సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌
మాట్లాడుతున్న బృందాకరత్‌

అటవీ చట్టాలను నిర్వీర్యం చేస్తే సహించం

గిరిజన హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

కొత్తగూడెంలో సీపీఎం భారీ ప్రదర్శన, ప్రజాగర్జనసభ

కొత్తగూడెం కలెక్టరేట్‌/లక్ష్మీదేవిపల్లి, జనవరి 25 : గిరిజన హక్కులను కాలరాస్తూ.. పోడు సాగుపై ఆధారపడిన గిరిజనులను ఆ భూముల నుంచి వెళ్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడి పట్టాలు సాధించుకుందామని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కరత్‌ పిలుపునిచ్చారు. పోడు రైతులకు పట్టాలు, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు  ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. లక్ష్మీదేవిపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డు నుంచి కలెక్టరేట్‌ వరకు జరిగిన ప్రదర్శన అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ప్రజాగర్జన సభ నిర్వహించారు. ఈ సభలో బృందాకరత్‌ మాట్లాడుతూ అటవీ, గిరిజన చట్టాలను నిర్వీర్యం చేస్తే సహించేది లేదని, ఓపెన్‌కాస్ట్‌లు, ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం ఆదివాసీల భూములను లాక్కుంటూ నిర్వాసితులుగా చేస్తోందని ధ్వజమెత్తారు. 2005లో పోరాడి సాధించిన అటవీ హక్కుల చట్టం ప్రకారం రాష్ట్రంలో 2లక్షల మంది రైతులు పట్టాలకోసం దరఖాస్తులు చేస్తే సగం మందికి కూడా పట్టాలు ఇవ్వలేదని మండిపడ్డారు. మోదీ, కేసీఆర్‌ అన్నదమ్ములని ఉదయం ఒకమాట, సాయంత్రం మరో మాట చెబుతూ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టాల అమలుపై సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ చట్టం సనికిరాదని ప్రజలను తప్పుదోవ పట్టించారని, చట్టం అమలుకు, పోడు భూముల రక్షణకు జైలుకెళ్లడానికైనా వెనుకాడేది లేదన్నారు. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎంపీ మిడియం బాబురావు మాట్లాడుతూ ఎర్రజెండా పోరాటాలతో వచ్చిన చట్టాలను అమలు చేయడం ప్రభుత్వాలకు ఇష్టం లేదని, చట్టాలు చేసిన నాటి నుంచే నిర్వీర్యం కోసం కుట్ర మొదలైందన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్ర మరీ పెరిగిందని ధ్వజమెత్తారు. హరితహారం పేరుతో గిరిజనులు సాగుచేస్తుకుటుఉన్న భూములను బలవంతంగా లాక్కొని మొక్కలు నాటుతున్నారని మండి పడ్డారు.  ఈ సభలో  సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజె రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-26T05:25:32+05:30 IST